వరల్డ్‌లోనే బెస్ట్‌.. ఎందుకు ఆడించలేదు: ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ ఫైర్‌ | One of best spinners in world dont know why he not playing: Moeen Ali | Sakshi
Sakshi News home page

వరల్డ్‌లోనే బెస్ట్‌.. అతడిని ఎందుకు ఆడించలేదు: ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ ఫైర్‌

Jul 21 2026 7:34 PM | Updated on Jul 21 2026 7:56 PM

One of best spinners in world dont know why he not playing: Moeen Ali

PC: BCCI X

టీమిండియా యాజమాన్యం వైఖరిపై ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌ని తుదిజట్టులోకి తీసుకోకుండా పక్కనపెట్టడం ఏమిటని ప్రశ్నించాడు. కాగా ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు.

లార్డ్స్‌ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డేకు ముందు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ గాయపడగా.. ఈసారి కుల్దీప్‌ను ఆడిస్తారని అంతా అనుకున్నారు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కుల్దీప్‌ను కాదని.. పేస్‌ బౌలర్‌ ప్రిన్స్‌ యాదవ్‌ను ఆడించింది. మొత్తంగా నలుగురు సీమర్లతో బరిలోకి దిగి మూల్యం చెల్లించింది.

బౌలర్లంతా విఫలం
గుర్నూర్‌ బ్రార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్‌ కృష్ణ, ప్రిన్స్‌ యాదవ్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ కూడా తేలిపోయాడు. ఫలితంగా ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో కేవలం మూడే వికెట్లు నష్టపోయి 387 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది.

ఈ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడిన టీమిండియా.. 27 పరుగుల తేడాతో ఓటమిపాలై.. సిరీస్‌నూ 1-2తో చేజార్చుకుంది. ఇంగ్లండ్‌ తమ పార్ట్‌టైమ్‌ స్పిన్నర్ల సేవలను కూడా ఉపయోగించుకుని గిల్‌ సేనను దెబ్బకొట్టింది. ఈ నేపథ్యంలో మొయిన్‌ అలీ టీమిండియా వ్యూహాన్ని తప్పుబట్టాడు.

వరల్డ్‌లోనే బెస్ట్‌.. ఎందుకు ఆడించలేదు
యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అసలు కుల్దీప్‌ యాదవ్‌ను ఎందుకు ఆడించలేదో నాకింకా అర్థం కావడం లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో అతడూ ఒకడు. ఇంగ్లండ్‌కు ఆదిల్‌ రషీద్‌ మాదిరే.. టీమిండియాకు కుల్దీప్‌ కూడా!.. 

భాగస్వామ్యాలను విడదీస్తూ వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంలో అతడు దిట్ట. కానీ టీమిండియా మాత్రం వాళ్ల బ్యాటింగ్‌ లైనప్‌ను పటిష్టం చేసుకోవడానికి కుల్దీప్‌ను పక్కనపెట్టింది.

భారత బౌలర్లకు బ్యాటింగ్‌ చేతకాదు. వాళ్ల జట్టులో ఉన్న అతిపెద్ద సమస్య ఇదే’’ అని మొయిన్‌ అలీ విమర్శించాడు. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా లేకుంటే టీమిండియా బౌలింగ్‌ విభాగం యావరేజ్‌గా ఉంటుందని పేర్కొన్నాడు. 

ఇదిలా ఉంటే.. కుల్దీప్‌ యాదవ్‌కు తుది జట్టులో తీసుకోకపోవడాన్ని టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ సమర్థించుకున్నాడు. తుది జట్టు కూర్పులో భాగంగా తీసుకున్న నిర్ణయమే అని వెల్లడించాడు. 

చదవండి: శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement