శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు | IND U19 vs SL U19 2nd Unofficial Test Day2: India Bowlers Shine SL 122 Per 8 | Sakshi
Sakshi News home page

శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు

Jul 21 2026 6:10 PM | Updated on Jul 21 2026 7:10 PM

IND U19 vs SL U19 2nd Unofficial Test Day2: India Bowlers Shine SL 122 Per 8

శ్రీలంక అండర్‌-19 బ్యాటర్లకు భారత యువ బౌలర్లు చుక్కలు చూపించారు. అద్భుతమైన ప్రదర్శనతో ఆతిథ్య జట్టును ముప్పుతిప్పలు పెట్టారు. కాగా శ్రీలంక- భారత్‌ అండర్‌-19 జట్ల మధ్య సోమవారం రెండో అనధికారిక టెస్టు మొదలైంది.

భారత్‌ భారీ స్కోరు
కొలంబో వేదికగా టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలిరోజు మూడు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసిన భారత జట్టు.. 253/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 105.2 ఓవర్లలో 411 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్‌ అయింది. 

వన్‌డౌన్‌ బ్యాటర్‌ కుశాగ్ర ఓజా (193 బంతుల్లో 111), ఆల్‌రౌండర్‌ మనాల్‌ చౌహాన్‌ (244 బంతుల్లో 150) సెంచరీలు.. యశ్‌వర్దన్‌ చౌహాన్‌ (89 బంతుల్లో 78) అర్ధ శతకంతో రాణించారు.

శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్‌ మెండిస్‌ మూడు వికెట్లు తీయగా.. సెత్మిక సెనెవిరత్నె, దుల్నిత్‌ సిగెర, విఘ్నేశ్వరన్‌ ఆకాశ్‌ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో తమ తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన శ్రీలంకకు భారత బౌలర్లు ఆది నుంచే షాకులు ఇచ్చారు.

శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు
ఓపెనర్లలో అవీష సమాష్‌ (9)ను ప్రణవ్‌ రాఘవేంద్ర పెవిలియన్‌కు పంపగా.. దిమంత మహావితన (24)ను కావ్యా పటేల్‌ అవుట్‌ చేశాడు. గత మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన వన్‌డౌన్‌ బ్యాటర్‌ సెనుజ వెకునగొడను ఈసారి భారత్‌ ఐదు పరుగులకే పరిమితం చేసింది. చిగురుపాటి వెంకట బౌలింగ్‌లో సెనుజ లక్ష్య రాయ్‌చందానికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ తర్వాత భారత బౌలర్లు జోరు కొనసాగించడంతో కెప్టెన్‌ విమత్‌ దిన్సార 8, కవిజ గమాగే 7, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జేసన్‌ ఫెర్నాండో 0 పరుగులకే పెవిలియన్‌ చేరారు. విరాన్‌ చముదిత 21, దుల్నిత్‌ సిగెర 31 పరుగులతో ఫర్వాలేదనిపించారు. 

ఈ క్రమంలో మంగళవారం నాటి ఆట ముగిసేసరికి శ్రీలంక 40 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ కంటే ఇంకా 289 పరుగులు వెనుకబడి ఉంది.

భారత బౌలర్లలో ప్రణవ్‌ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట, రోహిత్‌ యాదవ్‌ తలా రెండు వికెట్లు తీయగా.. కావ్యా పటేల్‌, జగన్నాథ్‌ హెంచుదేశన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. కాగా భారత్‌- శ్రీలంక మధ్య తొలి అనధికారిక టెస్టు డ్రా అయింది.

చదవండి: జింబాబ్వేతో శ్రేయస్‌ అయ్యర్‌ సేనకు ముప్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement