PC: Sports Wiz X
శ్రీలంక అండర్-19 జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత యువ జట్టు భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 411 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గాలె వేదికగా శ్రీలంక- భారత్ అండర్-19 జట్ల మధ్య తొలి యూత్ టెస్టు ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే.
ఓపెనర్లు డకౌట్ అయినా..
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య కొలంబో వేదికగా సోమవారం రెండో యూత్ టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. తొలి రోజు ఆటలో ఓపెనర్లు లక్ష్య రాజేశ్ రాయ్ చందాని, సాగర్ విర్క్ డకౌట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్ర ఓజా.. కెప్టెన్ యశ్‌వర్దన్ చౌహాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు.
శతక్కొట్టిన కుశాగ్ర
ఈ క్రమంలో కుశాగ్ర శతకం పూర్తి చేసుకోగా.. యశ్‌వర్దన్ అర్ధ శతకం (78) చేసి అవుటయ్యాడు. కుశాగ్రకు తోడుగా ఐదో నంబర్ బ్యాటర్ మనాల్ చౌహాన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా సోమవారం నాటి ఆట పూర్తయ్యేసరికి భారత్ 65 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.
ఇక 253/3 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. భోజన విరామ సమయానికి 92 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 355 పరుగులు చేసింది. శతక వీరుడు కుశాగ్ర (193 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు: 111) రనౌట్ కాగా.. ఆల్‌రౌండర్ మనాల్ చౌహాన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మనాల్ భారీ శతకం
అనంతరం అదే జోరు కొనసాగించిన మనాల్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. మొత్తంగా 224 బంతులు ఎదుర్కొన్న ఈ ఆల్‌రౌండర్.. 20 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 150 పరుగులు చేశాడు. అయితే, గిమ్హాన్ మెండిస్ బౌలింగ్‌లో విఘ్నేశ్వరన్ ఆకాశ్‌కు క్యాచ్ ఇవ్వడంతో అతడి మారథాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
మనాల్ అవుటైన తర్వాత భారత జట్టు వేగంగా వికెట్లు కోల్పోయింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఆర్యన్ సక్పా 10, జగన్నాథన్ హేంచుదేశన్ 4 పరుగులు చేసి వెనుదిరిగారు. రోహిత్ యాదవ్ డకౌట్ కాగా.. చిగురుపాటి వెంకట 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ప్రణవ్ రాఘవేంద్ర ఒక బంతిని ఎదుర్కొని ఖాతా ఏమీ తెరవలేదు.
411 పరుగులకు ఆలౌట్
ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 105.2 ఓవర్లలో 411 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కుశాగ్ర ఓజా (111), మనాల్ చౌహాన్ (150) సెంచరీలు.. యశ్‌వర్దన్ చౌహాన్ (78) అర్ధ శతకంతో రాణించడంతో భారత్‌కు ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది. ఇక శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ మూడు వికెట్లు పడగొట్టగా.. సెత్మిక సెనెవిరత్నె, దుల్నిత్ సిగెర, విఘ్నేశ్వరన్ ఆకాశ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
చదవండి: ఇంగ్లండ్ అతడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది.. మీరేం చేస్తున్నారు?


