లంక కెప్టెన్ విమత్- భారత జట్టు సారథి యశ్‌వర్దన్ (PC: SLC X)
శ్రీలంక అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్లు లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని, సాగర్ విర్క్ శతక్కొట్టారు. నిలకడగా, ఓపికగా ఆడుతూ భారీ సెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది.
శ్రీలంక భారీ స్కోరు
కాగా భారత్- శ్రీలంక అండర్-19 జట్ల మధ్య సోమవారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ డబుల్ సెంచరీ (233)తో దుమ్ములేపగా.. కెప్టెన్ విమత్ దిన్సార (52) అర్ధ శతకం బాదాడు.
మిగిలిన వారిలో కవిజ గమాగే (49), చమిక హీనతిగల (45), ఒషాడా మనాహర (12 బంతుల్లో 31 నాటౌట్) రాణించారు. ఈ క్రమంలో 106.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 424 పరుగులు చేసి శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ మంగళవారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి 58 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 186 పరుగులు చేసింది.
ఈ క్రమంలో 186/0 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన భారత జట్టుకు వర్షం మరోసారి ఆటంకం కలిగించింది. అయితే, కాసేపటి తర్వాత తెరిపినివ్వడంతో మళ్లీ మ్యాచ్ మొదలైంది.
శతకాలతో చెలరేగిన భారత ఓపెనర్లు
ఈ క్రమంలో శతకం పూర్తి చేసుకున్న ఓపెనర్ సాగర్ (312 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్: 134 రన్స్).. లతేంద్ర ఆకాశ్ బౌలింగ్‌లో జేసన్ ఫెర్నాండోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఇక వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్రా ఓజా 24 పరుగులే చేసి నిరాశపరచగా.. కెప్టెన్ యశ్‌వర్దన్ చౌహాన్ (6) పూర్తిగా విఫలమయ్యాడు. అయితే, మరో ఓపెనర్ లక్ష్య మాత్రం నిలకడగా ఆడుతూ డబుల్ సెంచరీకి చేరువయ్యాడు.
గాలేలో బుధవారం ఆట పూర్తయ్యేసరికి మొత్తంగా 306 బంతులు ఎదుర్కొన్న లక్ష్య.. 21 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 196 పరుగులు చేశాడు. అతడితో పాటు కుశ్ పటేల్ మూడు పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఈ క్రమంలో మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక కంటే ఇంకా 46 పరుగులు వెనుకబడి ఉంది. ఇక ఆటకు గురువారం చివరిరోజు.


