IND vs SL: ఒకే ఒక్కడు!.. శ్రీలంక భారీ స్కోరు | IND U19 Vs SL U19: Senuja Double Century SL Huge Score Declared | Sakshi
Sakshi News home page

IND vs SL: ఒకే ఒక్కడు!.. శ్రీలంక భారీ స్కోరు

Jul 14 2026 1:52 PM | Updated on Jul 14 2026 2:04 PM

IND U19 Vs SL U19: Senuja Double Century SL Huge Score Declared

సెనుజ (PC: SLC/X)

భారత అండర్‌-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక అండర్‌-19 జట్టు భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్ల ధాటికి మెజారిటీ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టినా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సెనుజ వెకునగొడ ఒంటిచేత్తో జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు.

కాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌- శ్రీలంక మధ్య గాలె వేదికగా సోమవారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన ఆతిథ్య శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆరంభంలోనే ఓపెనర్లు దుల్నిత్‌ సిగెర (0), దిమంత మహవితన (2) వికెట్లు కోల్పోయింది.

సెనుజ  డబుల్‌ సెంచరీ
ఇలాంటి తరుణంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ సెనుజ ఆచితూచి ఆడుతూ క్రీజులో పట్టుదలగా నిలబడ్డాడు. తొలి రోజు ఆటలోనే డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా కెప్టెన్‌ విమత్‌ దిన్సారా అర్ధ శతకం (52)తో రాణించగా.. కవిజ గమాగే 49 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌
ఈ క్రమంలో సోమవారం నాటి తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక 89 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 344 పరుగులు సాధించింది. ఇక 344/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంక.. 9 వికెట్ల నష్టానికి 424 పరుగుల భారీ స్కోరు వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

సెనుజ వెకునగొడ మొత్తంగా 267 బంతుల్లో 33 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 233 పరుగులు సాధించాడు. జిడ్డులా క్రీజులో పాతుకుపోయిన అతడిని జగన్నాథన్‌ హెంచుదేశన్‌ బౌల్డ్‌ చేసి పెవిలియన్‌కు పంపించాడు.

వర్షం వల్ల నిలిచిన ఆట
ఇక మిగిలిన వారిలో చమిక హీనతిగల 45 పరుగులు చేయగా.. పదకొండో నంబర్‌ బ్యాటర్‌ ఒషాడా మనాహర అనూహ్య రీతిలో 12 బంతుల్లోనే 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో జగన్నాథన్‌ హెంచుదేశన్‌ మూడు వికెట్లు తీయగా.. కావ్యా పటేల్‌, ప్రియాన్షు సింగ్‌ చెరో రెండు.. ప్రణవ్‌ రాఘవేంద్ర, కెప్టెన్‌ యశ్‌వర్దన్‌ చౌహాన్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

అనంతరం భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టగా వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగింది. వాన వల్ల ఆట నిలిచే సమయానికి భారత జట్టు ఏడు ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 25 పరుగులు చేసి.. లంక కంటే 399 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్లలో లక్ష్య రాజేశ్‌ రాయ్‌చందాని 16, సాగర్‌ విర్క్‌ 8 పరుగులతో క్రీజులో నిలిచారు.

చదవండి: టీమిండియాలోకి సూర్యకుమార్‌ యాదవ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement