భారత్‌తో మ్యాచ్‌.. శ్రీలంక బ్యాటర్‌ డబుల్‌ సెంచరీ | IND vs SL 1st Youth Test Day 1: Senuja Wekunagoda Double Century | Sakshi
Sakshi News home page

భారత్‌తో మ్యాచ్‌.. శ్రీలంక బ్యాటర్‌ డబుల్‌ సెంచరీ

Jul 13 2026 5:43 PM | Updated on Jul 13 2026 5:57 PM

IND vs SL 1st Youth Test Day 1: Senuja Wekunagoda Double Century

PC: Sri Lanka Cricket X

భారత్‌ అండర్‌-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక అండర్‌-19 జట్టు భారీ స్కోరు సాధించింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సెనుజ వెకునగొడ డబుల్‌ సెంచరీతో చెలరేగి.. లంక జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.

కాగా మూడు యూత్‌ వన్డేలు, రెండు యూత్‌ టెస్టులు ఆడేందుకు భారత యువ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్‌ జరుగగా.. శ్రీలంక 2-1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించగా.. చివరి రెండు మ్యాచ్‌లు గెలిచి శ్రీలంక సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఓపెనర్లను త్వరగానే అవుట్‌ చేసినా..
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలే వేదికగా సోమవారం తొలి యూత్‌ టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. భారత్‌ బౌలింగ్‌కు దిగింది. భారత పేసర్‌ కావ్యా పటేల్‌ ఆరంభంలోనే ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు.

ఓపెనర్లలో దుల్నిత్‌ సిగెరను డకౌట్‌ చేసిన కావ్యా పటేల్‌.. దిమంత మహవితనను రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపాడు. అయితే, భారత జట్టుకు ఈ ఆనందం ఎంతో కాసేపే మిగిలింది. వన్‌డౌన్‌లో వచ్చిన సెనుజ వెకునగొడ క్రీజులో పాతుకుపోయి డబుల్‌ సెంచరీ కొట్టాడు.

203 పరుగులతో అజేయంగా..
తొలి రోజు ఆట ముగిసే సరికి సెనుజ మొత్తంగా 227 బంతులు ఎదుర్కొని 31 ఫోర్ల సాయంతో 203 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా కెప్టెన్‌ విమత్‌ దిన్సారా అర్ధ శతకం (52)తో ఆకట్టుకోగా.. కవిజ గెమాగే 49 పరుగులతో రాణించాడు. చమిక హీనతిగల 33 పరుగులతో సెనుజతో కలిసి క్రీజులో నిలిచాడు.

ఫలితంగా సోమవారం నాటి మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక 89 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 344 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. భారత్‌ ఆదిలో వికెట్లు తీసినప్పటికీ.. సెనుజ ద్విశతక ఇన్నింగ్స్‌ కారణంగా లంకదే పైచేయి అయింది. భారత బౌలర్లలో కావ్యా పటేల్‌ రెండు వికెట్లు తీయగా.. ప్రణవ్‌ రాఘవేంద్ర, కెప్టెన్‌ యశ్‌వర్దన్‌ చౌహాన్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

చదవండి: చారిత్రక మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement