PC: Sri Lanka Cricket
భారత్ అండర్-19 క్రికెట్ జట్టుతో తొలి అనధికారిక వన్డేలో శ్రీలంక అండర్-19 జట్టు భారీ స్కోరు సాధించింది. ఆరంభంలో తడబడ్డా ఎట్టకేలకు మూడు వందల పరుగుల మార్కు దాటింది. కాగా మూడు అనధికారిక వన్డేలు, రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు భారత యువ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది.
ఆరంభంలో ఎదురుదెబ్బ
ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య శనివారం వన్డే సిరీస్ మొదలైంది. హంబన్‌టోటా వేదికగా తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ దుల్నిత్ సిగేరా 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు.
ఆ తర్వాత సీన్ రివర్స్
అయితే, భారత జట్టుకు ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ దిమాంత మహవితన (42)తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగోడ (Senuja Wekunagoda- 91) స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అయితే, కావ్యా పటేల్ బౌలింగ్‌లో అర్జున్ రాజ్‌పుత్‌కు క్యాచ్ ఇవ్వడంతో సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
కెప్టెన్ విమత్ దిన్సారా (1) పూర్తిగా విఫలం కాగా.. కవిజ గమాగే అర్ధ శతకం (77)తో దుమ్ములేపాడు. మిగిలిన వారిలో చమిక హీనతిగల 46 పరుగులతో అజేయంగా నిలవగా.. వికెట్ కీపర్ చమరిందు నెత్సారా 21 పరుగులు చేయగలిగాడు.
కిత్మా వితానపతిరణ 5 బంతుల్లో 18 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి శ్రీలంక 320 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కావ్యా పటేల్ రెండు, మోహిత్ ఉల్వా, రోహిత్ యాదవ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.


