PC: BCCI X
టీమిండియా- శ్రీలంక మధ్య తొలి టెస్టు తుది అంకానికి చేరుకుంది. వర్షం వల్ల గనుక అంతరాయం కలగకుంటే.. ఆటకు చివరి రోజైన బుధవారం ఫలితం తేలే అవకాశం ఉంది. కాగా భారత్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఆఖరి రోజు వీలైనంత త్వరగా ఆరు వికెట్లు తీయాల్సి ఉంది.
టార్గెట్ 372
గాలె వేదికగా శనివారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయిన గిల్ సేన.. శ్రీలంకను 284 పరుగులకు కట్టడి చేసింది.
తద్వారా 178 పరుగుల భారీ ఆధిక్యంతో మంగళవారం నాడు నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. 193 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా శ్రీలంకకు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది.
ఈ క్రమంలో మంగళవారం ఆట ముగిసే సరికి లంక నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ఆరంభంలో లంక త్వరత్వరగా వికెట్లు కోల్పోయినప్పటికీ.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ, సొనాల్ దినుష పట్టుదలగా నిలబడి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.
వాన వల్ల అంతరాయం కలిగితే?
ఈ నేపథ్యంలో మంగళవారం ఆట సందర్భంగా టీమిండియా నాయకత్వ బృందం అనుసరించిన వ్యూహాన్ని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే విమర్శించాడు. వర్షం ముప్పు ఉన్న ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఆఖరి రోజు లంకను ఆలౌట్ చేసే అవకాశాలు తక్కువని పేర్కొన్నాడు.
టీమిండియాపై విమర్శలు
నిజానికి రెండో ఇన్నింగ్స్‌లో కాస్త వేగంగా ఆడటం లేదంటే.. ఇన్నింగ్స్ కాస్త ముందుగానే డిక్లేర్ చేసి ఉంటే బాగుండేదని హర్ష అభిప్రాయపడ్డాడు. ‘‘నాలుగో రోజు ఆటలో ఆఖరి నలభై నిమిషాల్లో టీమిండియా వైఖరి నాకెందుకో అంతుపట్టలేదు. బ్యాటర్లు చాలా సమయం తీసుకున్నారు. కానీ స్కోరు బోర్డు మీద కావాల్సినన్ని పరుగులు జమచేయలేకపోయారు.
వాతావరణం అసలే బాగాలేదు. అలాంటపుడు ఇలా చేయడం ఎంతమాత్రం సరికాదు. గ్రౌండ్ సిబ్బంది కవర్లు కప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అయినా కూడా టీమిండియా మాత్రం నెమ్మదిగా ఆడింది’’ అని హర్షా భోగ్లే భారత జట్టు ఆట తీరును తప్పుబట్టాడు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. కాగా బుధవారం నాటి ఆటలో ధనంజయ డి సిల్వ, సొనాల్ దినుష అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. డ్రింక్స్ బ్రేక్ సమయానికి శ్రీలంక విజయానికి 234 పరుగుల దూరంలో నిలిచింది.


