యావత్తు భారతదేశంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఎటు చూసినా.. మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. చిన్నపెద్ద అనే తారతమ్యం లేకుండా వందేమాతరం.. అంటూ తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ వేడుకలు అన్ని చోట్ల ఆయా రాష్ట్రాల సాంస్కృతులకు అనుగుణంగా జరిగితే..ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో మాత్రం ఓ బుడ్డోడు తన కమనీయ గొంతుతో ఆకట్టుకున్నాడు. ఆ చిన్నారి ఆలపించిన తీరుకి ఆ రాష్ట్రంలోని కమనీయ పర్యాటక ప్రదేశాలపై చర్చకు తెరలేపింది. అదెలాగో చకచక ఇది చదివేయండి మరి..
పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఆ చిన్నారి జాతీయ గీతాన్ని ఆలపించిన వీడియోని షేర్ చేస్తూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. ఆ వీడియోలో నాగాలాండ్‌కి చెందిన ఐదేళ్ల చిన్నారి యాటో వాంగ్నావో జాతీయ గీతాన్ని చాలా అద్భుతంగా ఆలపించాడు. ఆ చిన్నారి పాట పాడిన తీరు.. ఆ రాష్ట్ర పర్యాటక ప్రదేశాలపై మనసు మళ్లేలా అందర్నీ మత్రముగ్ధుల్ని చేసిందన్నారు.
ఆ రాష్ట్రంలో తప్పక చూడాల్సిన పర్యాట ప్రదేశాలు గురించి ట్రావెలింగ్ బకెట్ లిస్ట్‌లో ఎందుకు లేవని ప్రశ్నించారు. కనీసం ఈ చిన్నారి యాటో గాత్రం కారణంగానైననా నాగాలాండ్ పర్యాటక ప్రాంతాలవైపుకి మొగ్గు చూపేలా చేస్తుందంటూ అక్కడి ఆకర్షణీయమైన ప్రదేశాల జాబితా గురించి ప్రస్తావించారు. అంతేగాదు ఈ ఈశాన్య రాష్ట్రం అంటేనే పొగమంచుతో నిండిన పర్వతాలు, అడవులతో నిండిన లోయలు, మారుమూల గ్రామాలు, గిరిజన సముదాయలకు నిలయం.
అంతేకాకుండా ప్రతి ఏడాది వేలాదిమంది పర్యాటకులను, ఫోటోగ్రాఫర్లను ఆకర్షించే ప్రసిద్ధ హార్న్‌బిల్ ఉత్సవాన్ని అస్సలు మర్చిపోకూడదు అంటూ తన పోస్ట్‌లో అక్కడ పర్యాట ప్రదేశాల వైభవంగా గురించి రాసుకొచ్చారు. మరి ఈ నేపథ్యంలో నాగాలాండ్ పర్యాటనలో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశాలేంటో చూద్దామా..!.
కోహిమా, సహజమైన ప్రారంభ స్థానం
నాగాలాండ్ కొండ ప్రాంత రాజధాని అయిన కోహిమాతో ప్రయాణం మొదలవుతుంది. ఈ రాష్ట్రం గిరిజన చరిత్ర, రంగురంగుల స్థానిక మార్కెట్లు, ప్రత్యేకమైన వంటకాలు కొన్ని ప్రసిద్ధ గ్రామాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.
కిసామా, హార్న్‌బిల్ ఉత్సవానికి కేంద్రం
ప్రసిద్ధ హార్న్‌బిల్ ఉత్సవానికి నిలయమైన కిసామా హెరిటేజ్ విలేజ్ తప్పక చూడాలి. ఈ ఉత్సవం సాంప్రదాయ ప్రదర్శనలు, సంగీతం, ఆహారం, చేతివస్తువులు, దేశీయ ఆటలు, గ్రామ అనుభవాల ద్వారా నాగ తెగలను ఏకతాటిపైకి తెస్తుంది.
అధికారిక పర్యాటక క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది ఈఉత్సవాన్ని డిసెంబర్ 1 నుంచి 10 వరకు జరుపుకుంటారు.
జుకౌ లోయ
జుకౌ లోయలో ఉండటం అంటే మేఘాలలో నడుస్తున్నట్లు ఉంటుంది. ఇది ప్రతి సాహస ప్రియుడికి ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ లోయ సుమారు 2,452 మీటర్ల ఎత్తులో, నాగాలాండ్-మణిపూర్ సరిహద్దు వెంబడి ఉంది.
ఇది పచ్చని పచ్చిక బయళ్ళు, కాలానుగుణంగా పూసే పువ్వులు, సెలయేళ్ళు, వెదురుతో కప్పబడిన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. పుష్పించే కాలంలో, అరుదైన జుకౌ లిల్లీ పువ్వు ఈ ప్రకృతి సౌందర్యానికి మరో శోభను చేకూరుస్తుంది.
ఖోనోమా
ఖోనోమా కోహిమా నుంచిసుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం అత్యంత ఆసక్తికరమైన గ్రామ అనుభవాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.చారిత్రాత్మకంగా ఇది ఒక యోధుల గ్రామంగా పేరుగాంచింది. వన్యప్రాణులను రక్షించడానికి 1998లో ఖోనోమా ప్రకృతి సంరక్షణ అండ్ ట్రాగోపాన్ అభయారణ్యం స్థాపించారు.
ఇక్కడే అరుదైన మొక్కలను, అంతరించిపోతున్న బ్లైత్స్ ట్రాగోపాన్‌ను చూడవచ్చు. అంతేగాదు ఈ ఖోనోమా ఆసియాలోనే మొట్టమొదటి గ్రీన్ విలేజ్‌గా ప్రసిద్ధి చెందింది. అలాగే ప్రయాణికులకు ఇది అనేక రకాల ఆకర్షణలను అందిస్తుంది.
మొకోక్‌చుంగ్: ఆవో నాగా సంస్కృతిని, సాంప్రదాయ గ్రామ జీవితాన్ని అన్వేషించాలనుకునే వారికి మొకోక్‌చుంగ్ సరైన ప్రదేశం. ఇక్కడి వోఖా ప్రత్యేకమైనది పక్షి ప్రేమికులను ఆకర్షిస్తుంది.
దోయాంగ్ జలాశయం: దోయాంగ్ జలాశయం వద్ద, వలస సమయంలో అముర్ ఫాల్కన్ పక్షులు భారీ సంఖ్యలో గుంపులుగా వస్తాయి.
తువోఫెమా: ప్రామాణికమైన గ్రామ అనుభూతిని కోరుకునే ప్రయాణికులకు ఇది అనువైన ప్రదేశం. ఈ ప్రదేశం దాని గ్రామీణ హోమ్‌స్టేలకు ప్రసిద్ధి చెందింది.
నాగాలాండ్‌ను సందర్శించడానికి ఉత్తమ సమయం
నాగాలాండ్‌ను సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ , ఏప్రిల్ మధ్య ఉండే చల్లని నెలలు.
హార్న్‌బిల్ పండుగ కోసం, డిసెంబర్ సరైన నెల. ఆ తర్వాత సెక్రెన్యీ, మోట్సు, సుంగ్రెమాంగ్, యెమ్‌షే, తోఖు ఎమాంగ్ ఉన్నాయి.
నాగాలాండ్‌కు ఎలా చేరుకోవాలి
విమాన మార్గం: దిమాపూర్ విమానాశ్రయం రాష్ట్రానికి సేవలు అందిస్తున్న ఏకైక దేశీయ విమానాశ్రయం. ఇక్కడి నుంచి కోల్‌కతాకు నేరుగా విమానాలు ఉన్నాయి
రైలు మార్గం: దిమాపూర్ ఈశాన్య సరిహద్దు రైల్వే నెట్‌వర్క్‌లో కూడా ఉంది. గౌహతితో రైలు కనెక్టివిటీని కలిగి ఉంది, ఇది అనేక ప్రధాన భారతీయ నగరాలకు అనుసంధానిస్తుంది.
దిమాపూర్ నుంచి కోహిమాకు టాక్సీలు, క్యాబ్‌లు సులభంగా అందుబాటులో ఉంటాయి. సాధారణ ఈశాన్య ప్రాంత పర్యటన పరిధిని దాటి ప్రయాణించాలనుకునే వారికి, నాగాలాండ్ ఎప్పటికీ అరుదైన ప్రకృతి అనుభూతిని అందిస్తుంది.
After hearing young Yato Wangnao sing the National Anthem on our 80th Independence Day, how could Nagaland not be on top of the travel bucket list today?#SundayWanderer
(Video courtesy @nehaGurung1692 ) pic.twitter.com/cSuSJQdGWb— anand mahindra (@anandmahindra) August 16, 2026
(చదవండి: మహిళా ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..!)


