విశాఖ విషాదం.. ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం | Visakhapatnam Tragedy Missing Bodies Found at Rushikonda Beach | Sakshi
Sakshi News home page

విశాఖ విషాదం.. ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం

Oct 3 2026 7:54 AM | Updated on Oct 3 2026 8:55 AM

Visakhapatnam Tragedy Missing Bodies Found at Rushikonda Beach

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో గల్లంతైన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న సాయంత్రం ప్రశాంత్‌ మృతదేహం లభించగా.. ఈరోజు ఉదయం మరో ఇద్దరి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మృతదేహాలను గుర్తించిన పోలీసులు, సంబంధిత సిబ్బంది వాటిని బయటకు తీసి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

ఏం జరిగిందంటే.. గాంధీ జయంతి సెలవు రోజు స్నేహితులతో సరదాగా గడిపేందుకు రుషికొండ బీచ్‌కు వెళ్లారు. మధురవాడ, వాంబే కాలనీ, మల్లయ్యపాలెం ప్రాంతాలకు చెందిన ప్రశాంత్‌, నితీష్‌, సూర్యప్రకాష్‌తో పాటు మరో ముగ్గురు స్నేహితులు రెండు ద్విచక్రవాహనాలపై శుక్రవారం మధ్యాహ్నం రుషికొండ ఐటీ హిల్స్‌ సమీపంలోని బీచ్‌కు వెళ్లారు. సముద్రంలో కేరింతలు కొడుతున్న సమయంలో రిప్‌ కరెంట్‌ ప్రభావానికి భారీ అల ప్రశాంత్‌, నితీష్‌, సూర్యప్రకాష్‌లను లోపలకు లాగేసింది. కనురెప్పపాటులో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు.

కిలోమీటరు దూరంలో మృతదేహం
విద్యార్థులు గల్లంతైన విషయం తెలియడంతో నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి, నార్త్‌జోన్‌ ఏసీపీ అప్పలరాజు, మైరెన్‌, పీఎం పాలెం పోలీసులు, లైఫ్‌గార్డులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నేవీ హెలికాప్టర్‌, పారా సెయిలింగ్‌, టూరిజం స్పీడ్‌బోట్లతో గాలింపు చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు తీరానికి సుమారు కిలోమీటరు దూరంలో ప్రశాంత్‌ మృతదేహాన్ని టూరిజం స్పీడ్‌బోట్‌ సిబ్బంది గుర్తించారు. నితీష్‌, సూర్యప్రకాష్‌ ఆచూకీ కోసం గాలించారు.

కొడుకు కోసం గాలింపు.. దుబాయ్‌లో తండ్రి
మల్లయ్యపాలేనికి చెందిన ఎస్‌.సూర్యప్రకాష్‌ (14) బాగా చదువుకుని ప్రయోజకుడవుతాడని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించిన తండ్రి భాస్కర్‌.. కొడుకును ఉన్నత చదువులు చదివించాలన్న తాపత్రయంతో నెలన్నర క్రితం దుబాయ్‌లోని ఎన్‌సీసీ కంపెనీ ప్రాజెక్టులో ఫ్యాబ్రికేషన్‌ పనికి వెళ్లారు. కాగా, స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లిన కొడుకు కోం తల్లి శోభ ఎదురుచూస్తుండగా.. సముద్రంలో గల్లంతయ్యాడన్న వార్త ఆ కుటుంబాన్ని కుదిపేసింది. బీచ్‌కు చేరుకున్న శోభ.. కడలి వైపు దీనంగా చూస్తూ కన్నీరుమున్నీరుగా విలపించి సొమ్మసిల్లి పడిపోయింది. కొడుకు గల్లంతు విషయం తెలుసుకున్న భాస్కర్‌ దుబాయ్‌లో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. కొడుకు భవిష్యత్తు కోసం దేశం కాని దేశం వెళ్లిన తండ్రి.. తన బిడ్డ ఆఖరి చూపు కోసం స్వదేశానికి రావాలని పరితపిస్తున్నాడు. ప్రభుత్వం అర్థం చేసుకుని, స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆ తండ్రి సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకోసం ప్రభుత్వ పెద్దలు స్పందించి తనకు సహాయం చేయాలని కోరారు.

నా బిడ్డ కనిపిస్తాడా?
‘నా బిడ్డ కనిపిస్తాడా.. ఒక్కసారి కళ్లముందు కనిపిస్తే చాలు’ అంటూ నితీష్‌ (14) తల్లి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేసింది. నితీష్‌ తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో కుమారుడిని చదివిస్తూ.. బాగా చదివి ప్రయోజకుడవుతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. స్నేహితులతో బీచ్‌కు వెళ్లిన కొడుకు గల్లంతయ్యాడన్న వార్త వారిని శోకసంద్రంలో ముంచింది. రుషికొండ తీరానికి చేరుకున్న తల్లిదండ్రులు.. సముద్రం వైపు కన్నార్పకుండా చూస్తూ కుమారుడి ఆచూకీ కోసం ఎదురుచూశారు. గాలింపు బృందాలు కడలిలోకి వెళ్లిన ప్రతిసారీ.. ‘ఇప్పుడైనా మా బిడ్డ కనిపిస్తాడేమో’ అన్న ఆశతో వారి కళ్లు అటువైపే నిలిచిపోయాయి. కన్నీళ్లను ఆపుకోలేక తల్లి విలపించిన తీరు.. అక్కడున్న వారి కళ్లను చెమర్చేలా చేసింది.

టైలర్‌ కుటుంబంలో విషాదం
వాంబే కాలనీకి చెందిన ప్రశాంత్‌ తండ్రి కృష్ణ టైలర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజంతా కుట్టుమిషన్‌పై శ్రమిస్తూ.. కుమారుడే తన భవిష్యత్తు అన్నట్టుగా బాగా చదివించి జీవితంలో స్థిరపడాలని ఎన్నో కలలు కన్నారు. స్నేహితులతో సరదాగా బీచ్‌కు వెళ్లిన కొడుకు తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్న తండ్రికి.. చివరకు కుమారుడి మృతదేహం లభించిందన్న వార్త పిడుగులా మారింది. బీచ్‌ వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు ప్రశాంత్‌ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కళ్లముందే కొడుకు విగతజీవిగా కనిపించడంతో ఆ తండ్రి గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది.

ఇదీ చదవండి: మరీ ఇంత బరితెగింపా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement