వైద్య విద్యలో వైవిధ్య కాపీయింగ్
నంద్యాల మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ల ‘కక్కుర్తి కాపీయింగ్’
ఫస్ట్ ఇయర్ రెఫరల్ విద్యార్థులతో కాసుల డీల్
పరీక్ష హాల్ నుంచి తీసుకెళ్లి ఫోరెన్సిక్ మ్యూజియంలో కూర్చోబెట్టిన ప్రొఫెసర్లు
సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా జాగ్రత్తలు
ఏఐ యాప్ ఉపయోగించి జవాబులు రాయాలని విద్యార్థులకు సెల్‌ఫోన్లు సరఫరా
ఈ తతంగాన్ని ప్రశ్నించిన ప్రత్యేక అబ్జర్వర్‌కు బెదిరింపులు
సాక్షి, నంద్యాల: చంద్రబాబు బాబు పాలనలో కొందరు ప్రొఫెసర్లే వైద్య విద్యార్థులతో ‘కాసుల డీల్’ మాట్లాడుకొని కాపీ కొట్టించే స్థాయికి వ్యవస్థ పతనమైంది. నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రెఫరల్ (గతంలో ఫెయిల్ అయిన) విద్యార్థులతో ప్రిన్సిపాల్ సహకారంతో కొందరు ప్రొఫె సర్లు డీల్ మాట్లాడుకొని ‘కక్కుర్తి కాపీయింగ్’కు పాల్పడిన ఘటన కాలేజీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఏకంగా విద్యార్థులను పరీక్ష హాల్ నుంచి తీసుకెళ్లి మరోచోట కూర్చోబెట్టి, వారికి సెల్‌ఫోన్లు సమకూర్చి, ఏఐ యాప్‌లో సెర్చ్ చేయించి, జవాబులు రాయించేయడం కలకలం రేపింది. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినా చర్యలు తీసుకోకుండా హెల్త్ యూనివర్సిటీ అధికారులు వారికి అండగా నిలబడ్డారని కాలేజీ వర్గాలు మండిపడుతున్నాయి.
సీసీ కెమెరాల కన్నుకప్పి
ఆగస్టులో జరిగిన ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షల్లో రెగ్యులర్ విద్యార్థులతో పాటు రెఫరల్ విద్యార్థులూ పరీక్షలు రాశారు. కొందరు ప్రొఫెసర్లు.. పలుమార్లు పరీక్షల్లో తప్పిన రెఫెరల్ విద్యార్థులతో డీల్ మాట్లాడుకొన్నారు. వారికి ప్రిన్సిపాల్ కూడా సహకరించినట్లు సమాచారం. సీసీ కెమెరాల కంట పడకుండా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో రాయించారు. దీనిని ప్రత్యేక అబ్జర్వర్ ప్రొ.అనిల్ కుమార్ వ్యతిరేకించి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
ఆయన్ని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. సురేఖ, ప్రత్యేక అబ్జర్వర్లుగా ఉన్న ప్రొఫెసర్లు డా. రాజశేఖర్, డా. చంద్రశేఖర్ బెదిరించి నోరు మూయించినట్లు సమాచారం. కాపియింగ్ విషయం యూనివర్సిటీ అధికారుల దృష్టికి వెళ్లినా తొక్కి పెట్టారని ఆరోపణలొస్తున్నాయి. పైగా.. డీఎంఈకి సమాచారం ఇవ్వకుండా యూనివర్సిటీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక వర్సిటీలోని కొందరు అధికారుల ప్రమేయం ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి.


