సిండికేట్‌కు మరో ‘ప్యాకేజీ’ | Tender for Handri Neeva canal lining works | Sakshi
Sakshi News home page

సిండికేట్‌కు మరో ‘ప్యాకేజీ’

Oct 3 2026 5:35 AM | Updated on Oct 3 2026 5:35 AM

Tender for Handri Neeva canal lining works

హంద్రీ–నీవాలో నీకింత.. నాకింత!

రెండో దశ ప్రధాన కాలువలో 463 – 554.175 కి.మీ. లైనింగ్‌ పనులకు టెండర్‌

కాంట్రాక్టు విలువ జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి రూ.625.29 కోట్లు

2026–27 ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రకారం క్యూబిక్‌ మీటర్‌ మట్టి తవ్వకం పనులకు రూ.123.75, గట్టు పనులకు రూ.195.57

కానీ టెండర్‌లో సగటున మట్టి తవ్వకం, గట్టు పనులకు క్యూబిక్‌ మీటర్‌ రూ.396.60కు పెంపు

తద్వారా మట్టి పనుల్లోనూ రూ.89.52 కోట్ల వ్యయం పెంచేసిన వైనం

కాంక్రీట్‌ లైనింగ్, షార్ట్‌ క్రీటింగ్, ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ పనుల అంచనా వ్యయం ఇదే రీతిలో పెంపు

ఈనాడు కిరణ్‌ వియ్యంకుడు, సీఎం రమేష్, బలుసు, కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే, ఎన్‌సీసీ సంస్థలు మాత్రమే బిడ్‌లు దాఖలు చేసేలా ‘అర్హత’లు నిర్ణయించిన వైనం

సిండికేటు కాంట్రాక్టర్లలో ఒకరికి అధిక ధరలకు కట్టబెట్టి పంచుకు తినేందుకు రంగం సిద్ధం

సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ ప్రధాన కాలువ లైనింగ్‌ పనులను అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల రైతులు  ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. లైనింగ్‌ చేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని.. బోరు బావులు ఎండిపోతాయని.. తాము జీవనాధారం కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ.. రైతుల ఆందోళనను ఏమాత్రం ఖాతరు చేయకుండా హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ.. పుంగనూరు, కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ లైనింగ్‌ పనులకు ఇప్పటికే రూ.3,850 కోట్ల మేర టీడీపీ కూటమి సర్కార్‌ వ్యయం చేసింది. తాజాగా రూ.625.69 కోట్ల విలువైన పనులను సిండికేట్‌ అస్మదీయ కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. 

శ్రీసత్యసాయి జిల్లాలో ఎన్‌పీ కుంట, అన్నమయ్య జిల్లాలో గాలివీడు, పెదమండ్యం, చినమండ్యం, కేవీపల్లి మండలం అడవిపల్లి వరకూ హంద్రీ–నీవా రెండో దశ కాలువ 463 కి.మీ. నుంచి 554.175 కి.మీ. వరకూ మిగిలిపోయిన లైనింగ్, కాంక్రీట్‌ కట్టడాల నిర్మాణాల పనులకు  జలవనరుల శాఖ శుక్రవారం టెండర్లు పిలిచింది. కాంట్రాక్టు విలువను రూ.511.66 కోట్లుగా నిర్ణయించింది. జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.113.63 కోట్ల రీయింబర్స్‌ చేస్తామని పేర్కొంది. అంటే.. కాంట్రాక్టు విలువ రూ.625.29 కోట్లన్నమాట. పనుల పూర్తికి 18 నెలలు గడువు పెట్టింది.  బిడ్‌ల దాఖలుకు ఈనెల 15 తుది గడువు. ఈనెల 19న ఆర్థిక బిడ్‌ను తెరిచి.. స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ ఆమోదంతో టెండర్‌ ఖరారు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. 

ఐదు సంస్థలకే అర్హత...
గతంలో హంద్రీ–నీవా లైనింగ్‌ పనులను ఈనాడు కిరణ్‌ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్‌ ప్రాజెక్టŠట్స్, సీఎం చంద్రబాబుకు సన్నిహితులైన సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్, బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్‌ ఇన్‌ఫ్రా, కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన ఎస్సార్‌ కన్‌స్ట్రక్షన్స్, రంగరాజు ఎండీగా ఉన్న ఎన్‌సీసీ దక్కించుకున్నాయి. కాంట్రాక్టు ఒప్పందాన్ని తుంగలో తొక్కి.. రాతి పొర ఉన్న ప్రాంతాల్లో షార్ట్‌ క్రీటింగ్‌ (రాతి పొరకు ఇనుప జాలరీ అమర్చి సిమెంటు కాంక్రీట్‌ వేయడం) పద్ధతిలో కాకుండా, ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ (స్టీల్‌ ఫైబర్‌ రీయిన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ – ఇనుప మేకులతో కూడిన కాంక్రీట్‌ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో పిచికారి చేయడం) పద్ధతిలో మట్టి పొరకు చేశారు. 

అత్యంత నాసిరకంగా పనులు చేయడంతో 2025లో కాలువలో నీటి ప్రవాహానికే లైనింగ్‌ ఎక్కడికక్కడ దెబ్బతిని కొట్టుకుపోయింది. తాజాగా పిలిచిన టెండర్లలోనూ ఈ ఐదు సంస్థలే బిడ్‌లు దాఖలు చేసేలా నిబంధనలు రూపొందించారు. 2016–17 నుంచి 2025–26 వరకూ కాలువలో మట్టి తవ్వకం, గట్లు వేయడం, సిమెంటు కాంక్రీట్‌ లైనింగ్‌ చేయడం లాంటివి ఏదైనా ఒక ఏడాదిలో రూ.170.554 కోట్ల విలువైనవి పూర్తి చేసి ఉండాలని నిబంధన పెట్టారు. 

గత పదేళ్లలో ఏదైన ఒక ఏడాదిలో 14,84,552 క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం, గట్లు వేసే పని.. 38,054 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌(పీసీసీ/వీఆర్‌సీసీ/ఆర్‌సీసీ), సిమెంట్‌ కాంక్రీట్‌ లైనింగ్‌/షార్ట్‌ క్రీటింగ్‌/ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ పద్ధతిలో 5,05,263 చదరపు మీటర్ల పని చేసి ఉండాలని నిబంధన పెట్టారు. వీటిని పరిశీలిస్తే.. ఆ ఐదు సంస్థల్లో ఒక సంస్థకు పనులు కట్టబెట్టడానికేనన్నది స్పష్టమవుతోందని ఇంజనీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

ఎస్‌ఎస్‌ఆర్‌ తుంగలోకి...
బోర్డ్‌ ఆఫ్‌ చీఫ్‌ ఇంజినీర్స్‌ (బీవోసీఈ) ఖరారు చేసి, ప్రభుత్వం ఆమోదించిన ఎస్‌ఎస్‌ఆర్‌ (స్టాండర్డ్‌ షెడ్యూల్డ్‌ రేట్స్‌) ప్రకారం మట్టి తవ్వకం పనులకు క్యూబిక్‌ మీటర్‌కు రూ.123.75.. కాలువ గట్లు (ఎంబాక్‌మెంట్‌) పనులకు క్యూబిక్‌ మీటర్‌కు 195.57 చెల్లించాలి. నిజానికి రెండో దశ ప్రధాన కాలువ 463 నుంచి 554.175 కిమీ వరకూ తవ్వకం పనులు 95 శాతం ఇప్పటికే పూర్తయ్యాయి. కానీ.. 44,53,657 క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, కాలువ గట్ల పని మిగిలి ఉన్నట్లు చూపారు. సగటున క్యూబిక్‌ మీటర్‌కు రూ.195.57లు చొప్పున వేసుకున్నా ఈ పనులకు రూ.87.10 కోట్లు వ్యయం అవుతుంది. 

కానీ.. ఆ పనులకు సగటున క్యూబిక్‌ మీటర్‌కు రూ.396.60 చొప్పున లెక్కగట్టి ఏకంగా రూ.176.62 కోట్లుగా టెండర్‌లో పేర్కొనడం గమనార్హం. అంటే.. మట్టి పనికి క్యూబిక్‌ మీటర్‌కు సగటున రూ.201.03 పెంచేసినట్లు స్పష్టమవుతోంది. తద్వారా  మట్టి పనుల రూపంలోనే రూ.89.52 కోట్ల మేర అంచనా వ్యయాన్ని పెంచేశారని ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక కాంక్రీట్‌ కట్టడాలు, సిమెంటు కాంక్రీట్‌ లైనింగ్, షార్ట్‌ క్రీటింగ్, ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ పనుల అంచనా వ్యయాన్ని కూడా ఇదే రీతిలో పెంచేశారు. గతంలోలానే సిండికేటు కాంట్రాక్టు సంస్థల్లో ఒక సంస్థకు అధిక ధరలకు పనులు కట్టబెట్టి.. అత్యంత నాసిరకంగా చేపట్టి నీకింత నాకింత అంటూ ప్రజాధనాన్ని దోచుకుతినేందుకు ముఖ్యనేత సిద్ధమయ్యారని ఇంజనీరింగ్‌ నిపుణులు పేర్కొంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement