సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’
సీఎస్‌ఐఆర్–ఎన్‌ఐఓ, నౌకాదళ సంయుక్త కృషితో అద్భుత ఆవిష్కరణ
హెచ్‌ఎస్‌ఎల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉత్పత్తికి సన్నాహాలు
సముద్రం లోపల స్వతంత్రంగా పనిచేస్తూ శత్రు కదలికలను పసిగట్టే అత్యాధునిక సామర్థ్యం
మిషన్‌కు తగ్గట్లుగా సెన్సార్లను మార్చుకునేలా ఫ్లెక్సిబుల్ డిజైన్
పోర్టుల భద్రత, తీరప్రాంత గస్తీలో నౌకాదళానికి వ్యూహాత్మక అస్త్రం
సాక్షి, విశాఖపట్నం: సముద్రగర్భ భద్రత, పరిశోధనల రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా శాస్త్రవేత్తలు అద్భుత ఆవిష్కరణ తీసుకువచ్చారు. కేవలం శాస్త్ర పరిశోధనలకే పరిమితం కాకుండా.. తీరప్రాంత రక్షణలోనూ తన సత్తా చాటేందుకు స్వదేశీ అటానమస్ అండర్ వాటర్ వెహికల్(ఏయూవీ) ‘జయ’ను రూపొందించారు. గోవాలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(సీఎస్‌ఐఆర్–ఎన్‌ఐవో) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ వాహనాన్ని.. విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్‌ఎస్‌ఎల్) భారీ స్థాయిలో ఉత్పత్తి చేయనుంది. దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞాన బదిలీ(టీవోటీ) ఒప్పందం అధికారికంగా ఇటీవలే కుదుర్చుకుంది. ‘జయ’ రాకతో భారత నౌకాదళానికి సరికొత్త బలం చేకూరనుంది.
అత్యాధునిక సెన్సార్లతో మల్టీ మిషన్ సామర్థ్యం!
సుమారు 54 కిలోల బరువు, 1.7 మీటర్ల పొడవు ఉండే ‘జయ’ను భారత నౌకాదళ డిజైన్ విభాగం సహకారంతో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది సముద్రంలో 200 మీటర్ల లోతు వరకు వెళ్లి స్వయం ప్రతిపత్తితో పనిచేయగలదు. ఇందులో ఉపయోగించిన విడిభాగాలను దాదాపు 80 శాతం వరకు భారతీయ పరిశ్రమల నుంచే సేకరించారు. ముందు భాగాన్ని అవసరాలకు అనుగుణంగా మార్చుకునేలా రూపొందించారు. సముద్ర ఉష్ణోగ్రతలను కొలిచే సీటీడీ సెన్సార్, ఆక్సిజన్ శాతాన్ని గుర్తించే ఆప్టికల్ సెన్సార్, కాంతి తీవ్రతను లెక్కించే హైపర్ స్పెక్ట్రల్ రేడియో మీటర్లు, కాలుష్యాన్ని పసిగట్టే క్లోరోఫిల్, టర్బిడిటీ సెన్సార్లను ఇందులో అమర్చారు. కేవలం పరిశోధనలకే కాకుండా, సైనిక నిఘా కోసం సైడ్–స్కాన్ సోనార్లను కూడా జోడించి దీనిని ఒక మల్టీ మిషన్ ప్లాట్‌ఫామ్‌గా తయారుచేశారు.
పారిశ్రామిక ఉత్పత్తి దిశగా షిప్‌యార్డు..
హిందూస్థాన్ షిప్‌యార్డు ఈ ప్రాజెక్టుతో హైటెక్ మెరైన్ ప్లాట్‌ఫామ్‌ల తయారీ వైపు అడుగు వేసింది. ఏయూవీలను పారిశ్రామిక స్థాయిలో ఏటా డజన్ల కొద్దీ ఉత్పత్తి చేసే బాధ్యతను హెచ్‌ఎస్‌ఎల్ తీసుకుంది. భవిష్యత్తులో కొత్త పెట్టుబడులు అవసరం లేకుండానే మరింత పెద్ద ఏయూవీలను నిర్మించేలా ప్రస్తుత అసెంబ్లింగ్ లైన్లను విస్తరించుకునే సామర్థ్యం షిప్‌యార్డు వద్ద సిద్ధంగా ఉంది.
నౌకాదళానికి వ్యూహాత్మక ఆయుధం..
హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతాపరమైన సవాళ్లు పెరుగుతున్న తరుణంలో.. నౌకాదళానికి ‘జయ’ ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. పోర్టుల చుట్టుపక్కల శత్రువుల కదలికలను ముందే పసిగట్టేందుకు.. కోస్ట్‌గార్డ్ గస్తీకి ఇది ఎంతో కీలకంగా మారనుంది. నిశ్శబ్దంగా నీటి అడుగున ప్రయాణించే శత్రువుల జలాంతర్గాములు లేదా అండర్ వాటర్ మైన్స్‌ను గుర్తించే నిఘా ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటాయి.

జయ డ్రోన్‌ని ప్రదర్శిస్తున్న షిప్‌యార్డ్, సీఎస్‌ఐఆర్–ఎన్‌ఐవో ప్రతినిధులు
సైనికులతో కూడిన పెద్ద సబ్‌మెరైన్లను నిఘా కోసం పంపి ప్రమాదంలో పడే కంటే.. ఇలాంటి చిన్న వాహనాలను పెద్ద సంఖ్యలో మోహరించడం వల్ల తక్కువ వ్యయంతో విస్తృత రక్షణ, భద్రత లభిస్తుంది. ఓవైపు శత్రువులపై నిఘా ఉంచుతూనే.. మరోవైపు హార్బర్ మ్యాపింగ్, సముద్ర పర్యావరణ మార్పులను నిరంతరం పర్యవేక్షించడం ‘జయ’ ప్రధాన ఉద్దేశం. భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేలా లైసెన్స్ పొందడం వల్ల, అతి తక్కువ సమయంలో వందలాది ఏయూవీలను మోహరించి నిరంతర గస్తీకి దేశీయ ప్రత్యామ్నాయాన్ని సృష్టించి.. భారత రక్షణ దళం చరిత్ర లిఖించబోతోందని రక్షణ వర్గాలు అభివర్ణించాయి.


