న్యూస్‌రీల్
శనివారం శ్రీ 3 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
బీచ్‌రోడ్డు: గాంధీ జయంతి సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గల ధర్నా చౌక్ గురువారం నినాదాలతో దద్దరిల్లింది. వేర్వేరు డిమాండ్లతో పలు సంఘాలు, పార్టీలు ఒకేసారి ధర్నాలకు దిగడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, జీవీఎంసీ కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు, విమ్స్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతన సమస్యలు, ఏఐ డేటా సెంటర్లకు వ్యతిరేకత తదితర అంశాలపై ఐదు వేర్వేరు నిరసనలు జరిగాయి. దీంతో ధర్నా చౌక్ పరిసరాలు నినాదాలతో మార్మోగాయి.
విశాఖ డివిజన్‌లో విస్తృతంగా ‘స్వచ్ఛతా హీ సేవా’
తాటిచెట్లపాలెం: సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం డివిజన్ పరిధిలో విస్తృతంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం డీఆర్‌ఎం కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ గత నెల 17 నుంచి ఈ నెల 2 వరకు చేపట్టిన స్వచ్ఛతా పక్షోత్సవాల ద్వారా ప్రయాణికులకు, ప్రజలకు శుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించామన్నారు. 130 ఏళ్ల విశాఖ రైల్వే స్టేషన్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించి.. హెరిటేజ్ గ్యాలరీ వంటివి ఏర్పాటు చేశామన్నారు. అనంతరం డీఆర్‌ఎం కార్యాలయం నుంచి సైకిల్ ర్యాలీ, అవగాహన ర్యాలీలు నిర్వహించారు. డీఆర్‌ఎంతోపాటు రైల్వే అధికారులు, సిబ్బంది, శానిటేషన్ కార్మికులు, స్కౌట్స్, అండ్ గైడ్స్, డివిజనల్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు, సౌత్ కోస్ట్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ డివిజన్ సభ్యులు పాల్గొన్నారు.


