బీచ్‌రోడ్డు: రానున్న రెండు, మూడేళ్లలో విశాఖను జపాన్ స్థాయి పరిశుభ్రత ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేయాలని ఎంపీ ఎం.శ్రీభరత్, జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పిలుపునిచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో వారు మాట్లాడారు. జపాన్‌లో బహిరంగ ప్రదేశాల్లో చిన్న కాగితం ముక్కను కూడా వేయకుండా ప్రజలు పాటించే క్రమశిక్షణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విశాఖలో ఆధునిక పారిశుధ్య విధానాలు, మెకనైజ్డ్ శానిటేషన్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు, సముద్రంలో వ్యర్థాలను తొలగించే ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. అయితే పారిశుధ్య సిబ్బంది ఎంతగా పనిచేసినా ప్రజల ప్రవర్తనలో మార్పు రాకపోతే ఆశించిన ఫలితం సాధ్యం కాదన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిని, వీధిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్ఛతను నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో స్వచ్ఛత కోసం కృషి చేసిన 68 మంది వ్యక్తులు, సంస్థలకు జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యే వెలగపూడి తదితరులు పాల్గొన్నారు.


