బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధిలేని బాబు నాటకాలు
హైకోర్టు కొట్టేస్తుందని తెలిసీ 34% రిజర్వేషన్లంటూ మోసం
హైకోర్టులో ఉండగానే ‘స్థానిక’ షెడ్యూలు సిద్ధం చేసిన చంద్రబాబు
కలెక్టర్లను సమావేశపరిచి ఎన్నికల సన్నాహాలపై సమాలోచనలు
పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని అధికారులకు సమాచారం
చీఫ్‌సెక్రటరీ నుంచి మున్సిపల్ స్థాయి వరకు అందరినీ సిద్ధం చేసిన సీఎం
ఇప్పుడు హైకోర్టు కొట్టేశాక సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తున్నామంటూ నాటకాలు
అదే సమయంలో ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ పార్టీ ముఖ్యనేతలకు బాబు సంకేతాలు
కొద్దిరోజులు ఆగుదామని అధికారులన్నా కోర్టు కొట్టేస్తుందని చెబుతున్న సీఎం
రెమో.. రామాచారిలా ముఖ్యమంత్రి డ్యూయల్ డ్రామాలు చూసి నివ్వెరపోతున్న అధికారులు
పార్లమెంటులో చట్ట సవరణ ద్వారానే బీసీలకు న్యాయమైన రిజర్వేషన్లు
టీడీపీ బలంపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నందున ఇదే మంచి తరుణం
బాబుకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఆ దిశగా అడుగు పడని దైన్యం
సాక్షి, అమరావతి: అపరిచితుడు సినిమాలో హీరో కాసేపు రెమోలా.. కాసేపు రామాచారిలా.. వ్యవహరిస్తూ పోలీసు అధికారులను ముప్పుతిప్పలు పెట్టడం చూశాం. అచ్చు అలానే బీసీ రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అపరిచితుడి అవతారం చూసి అధికారులు విస్తుపోతున్నారు. చెల్లవని తెలిసీ బీసీలను బుట్టలో వేయడానికి రిజర్వేషన్ల కోసం జీవోలిస్తారు.. దానిపై కోర్టు విచారణ జరుపుతుండగానే అధికారులను ఎన్నికలకు సన్నాహాలు చేయమంటారు.. కలెక్టర్ల మీటింగులు పెట్టి ఎన్నికల ఏర్పాట్లపై గంటల తరబడి చర్చిస్తారు. కోర్టు కొట్టేయగానే మొసలి కన్నీరు కారుస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు చేద్దామని బీసీలకు గంభీరంగా చెబుతారు.
ఓహో నిజంగానే సీఎంగారు సుప్రీంకోర్టుతో కొట్లాడతారు కాబోలనుకుని అధికారులు అనుకుంటే.. కోర్టులెలాగూ కొట్టేస్తాయి.. పాత రిజర్వేషన్ ప్రకారమే సీట్లు ఖరారు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని అధికారులకు హకుం జారీ చేస్తారు.. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ ముఖ్యనేతలకూ సంకేతాలిస్తారు.. బీసీలతో అలా.. అధికారులతో ఇలా.. చంద్రబాబు డ్యూయల్ డ్రామా నడిపిస్తున్నారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో మాట్లాడి పార్లమెంటులో చట్టసవరణ కోసం పట్టుబట్టేవారు. టీడీపీ బలంపై కేంద్రం ఆధారపడి నడుస్తున్నందున ఇపుడు చంద్రబాబు తలుచుకుంటే అది చాలా సులువు. కానీ బీసీలకు న్యాయం చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదనేది సుస్పష్టం.
ఇంకా ఆగని బాబు నాటకాలు..
బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు మొదలెట్టిన డ్రామా రక్తికట్టకపోవడంతో తన నట కౌశలాన్ని మరింత పెంచి ప్రదర్శిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది కోసం జీఓలు ఇచ్చి భంగపడ్డారు. ఒకవైపు హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తామని చెబుతూనే.. మరోవైపు శనివారంలోపు స్థానిక సంస్థలకు 34శాతం రిజర్వేషన్లు ఖరారు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఆయన డ్రామాలకు పరాకాష్ట.
ఇప్పటికే రిజర్వేషన్ల హామీ.. కమిషన్ ఏర్పాటు.. జీఓలు వంటి విషయాల్లో బీసీను నమ్మించి వెన్నుపోటు పొడిచారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేవనే కారణంతో చంద్రబాబు ఇచ్చిన రెండు జీఓలను హైకోర్టు కొటేసిన విషయం విదితమే. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తామంటూ చంద్రబాబు చెప్పడంతోపాటు మంత్రులతోను చెప్పిస్తున్నారు. వాస్తవానికి రిజర్వేషన్లు 50శాతం మించకూడదనే సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని తెలిసినా చంద్రబాబు డ్రామా ఆడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మొత్తం రిజర్వేషన్లు 61శాతం అవుతాయని, సుప్రీం కోర్టుకు వెళ్లినా చెల్లదని సామాన్యులకు సైతం అర్థమవుతోంది. అయినప్పటికీ తానేదో బీసీల కోసం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ.. డ్రామాను రక్తికట్టించేందుకు బాబు తెగ తాపత్రయ పడుతున్నారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి రిజర్వేషన్ పరిమితి పెంచుకునేలా చట్ట సవరణ చేయాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
బీసీ రిజర్వేషన్లపై మొదటి నుంచి నాటకాలే..
ఎన్నికల ముందు హామీల్వివ్వడం.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోవడం చంద్రబాబు నైజం. హామీలను అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు డ్రామాలు ఆడటంలో ఆయనకు ఎవరూ సాటిరారు. బీసీ రిజర్వేషన్ల అమలులోను చంద్రబాబు అనేక డ్రామాలాడుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలుకు చర్యలు తీసుకున్నట్టుగా కనిపించడానికి రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కానీ హైకోర్టుకు సమర్పించిన వాదనలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా రాష్ట్రంలో బీసీల జనాభా 50.42 శాతంగా ఉన్నట్టు పేర్కొంది.
34 శాతం రిజర్వేషన్ నిర్ణయానికి ఈ సమకాలీన గణాంకాలతోపాటు మిశ్రా కమిషన్ అధ్యయనం కూడా ఆధారమని తెలిపింది. ఇదే సమయంలో మిశ్రా కమిషన్ నివేదికను ప్రభుత్వం ఇంకా పరిశీలిస్తోందని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలపడం గమనార్హం. అలాంటప్పుడు ఆ నివేదికలోని గణాంకాలను ఆధారంగా చేసుకుని 34 శాతం బీసీ రిజర్వేషన్ ఎలా నిర్ణయించారనే ప్రశ్న ఉత్పన్నమైంది. నివేదిక ఇంకా తుది ఆమోదం పొందకపోతే దాని ఆధారంగా ప్రభుత్వం జీవోలు ఎలా జారీ చేసిందని ధర్మాసనం ప్రశ్నించింది. నివేదికను బహిరంగపరచకపోవడానికి కారణమేంటని కూడా కోర్టు ప్రశ్నించడం గమనార్హం.
నాడు టీడీపీ నేతతో కేసు వేయించిన చంద్రబాబు..
నిజానికి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు టీడీపీ నేతతోనే చంద్రబాబు హైకోర్టులో కేసు వేయించారు. బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్ జగన్ జీఓ ఇవ్వడంతో టీడీపీకి చెందిన బిర్రు ప్రతాపరెడ్డితో చంద్రబాబు హైకోర్టులో కేసు వేయించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యహరించిన ప్రతాపరెడ్డి 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఓ నామినేటెడ్ పోస్టు కూడా అనుభవించారు.
బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఓసీలకు అవకాశాలు తగ్గిపోతాయని, ఇది సుప్రీం కోర్టు విధించిన 50శాతం కోటాకు విరుద్ధమని ప్రతాపరెడ్డి చేత చంద్రబాబు హైకోర్టులో కేసు వేయించారు. దీన్ని విచారించిన హైకోర్టు వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీఓను రద్దు చేస్తూ 2020 మార్చి 2న తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే 2021లో నిర్వహించిన గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లోను బీసీ అభ్యర్థులను నిలబెట్టి 34శాతం రిజర్వేషన్లకు మించి పదవులు కట్టబెట్టిన వైఎస్ జగన్.. అలా బీసీల పట్ల తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.

బీసీలను మోసం చేయడానికే.. బాబు డ్రామాలు..!
సుప్రీం కోర్టు మార్గదర్శకాలు.. 2020లో హైకోర్టు తీర్పు అన్నీ తెలిసిన చంద్రబాబు మళ్లీ బీసీ రిజర్వేషన్ల పేరుతో హంగామా చేయడం మోసం చేయడానికేనని బీసీ నేతలు మండిపడుతున్నారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో మూడు కీలక దశలు(ట్రిపుల్ టెస్ట్)ను నిర్ధేశించింది. బీసీల స్థానిక వెనుకబాటుతనంపై సమకాలీన, కఠినమైన అనుభావిక అధ్యయనం చేసే ప్రత్యేక కమిషన్ ఉండాలి. కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఏ స్థానిక సంస్థలో ఎంత రిజర్వేషన్ అవసరమో నిర్ణయించాలి.
ఒకే శాతం మొత్తంగా వర్తింపజేయడం కాకుండా స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలన్నదే సుప్రీంకోర్టు నిర్దేశించిన విధానం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. ఈ మూడు దశలను పూర్తి చేసిన తర్వాతే బీసీ రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇవన్నీ తెల్సినా.. తెలియనట్టు నటిస్తూ.. కమిషన్ వేసిన చంద్రబాబు దాన్ని గడువును సుదీర్ఘంగా పొడిగించి చివరకు పూర్తిస్థాయి నివేదిక ఆమోదించకుండానే జీఓలు ఇచ్చి న్యాయపరంగా నిలబడకుండా చేసి బీసీలకు వెన్నుపోటు పొడిచారు.
ఈ ప్రశ్నలకు బదులేది బాబూ..
» 34 శాతం బీసీ రిజర్వేషన్‌కు ఖచ్చితమైన గణాంక ప్రాతిపదికపై స్పష్టత ఏది?
» రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ పూర్తి నివేదికను ప్రభుత్వం ఎందుకు బహిరంగపరచలేదు?
» నివేదిక ఇంకా ప్రభుత్వ పరిశీలనలో ఉంటే దాని ఆధారంగా 34 శాతం నిర్ణయం ఎలా తీసుకున్నారు?
» యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలోని బీసీ గణాంకాలను పూర్తిగా ఎందుకు ప్రజల్లోకి తీసుకురాలేదు?
» మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటితే దానికి ప్రభుత్వం చూపుతున్న రాజ్యాంగ, న్యాయపరమైన ఆధారం ఏమిటి?
» 2020లో 34 శాతం బీసీ రిజర్వేషన్‌పై వచ్చిన కోర్టు తీర్పుల నేపథ్యంలో ప్రస్తుత విధానంలో కొత్తగా వచ్చిన చట్టపరమైన రక్షణ ఏమిటి?
కాపులను ఇలానే దగా చేసిన చంద్రబాబు..
రిజర్వేషన్ల పేరుతో ఇప్పుడు బీసీలను మోసం చేసిన చంద్రబాబు 2014 ఎన్నికల్లో కాపు రిజర్వేషన్ల అమలుకు హామీ ఇచ్చి దగా చేసిన విషయాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. 2014లో కాపులకు రిజర్వేషన్ అమలు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. హామీ అమలు కోసం కాపు సామాజికవర్గం వత్తిడి పెంచడంతో 2016లో మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేశారు.
మంజునాథ్ కమిషన్ పూర్తి రిపోర్టు బహిర్గతం చేయకుండానే హడావుడిగా అసెంబ్లీలో పెట్టి 2017లో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్టు బిల్లు తెచ్చారు. దీంతో మళ్లీ 50శాతం పరిమితికి మించిన కోటాపై న్యాయపరమైన అడ్డంకులు తప్పలేదు. 2019 ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు ఇస్తున్నట్టు ప్రకటించిన చంద్రబాబు వాటిని కూడా సక్రమంగా అమలు చేయలేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం 2014లో కాపులకు, దశాబ్ధం తర్వాత 2024లో బీసీలకు రిజర్వేషన్ హామీలతో మోసం చేసిన ఘనత చంద్రబాబుది.


