విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూజలు చేస్తే వర్షాలు పడ్డాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు చేసిన మోసాలను గడప గడపకూ వివరించాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు సూచించారు. విజయనగరం జిల్లా కొత్త వలస మండల వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో బొత్స మాట్లాడారు.
‘చంద్రబాబు నాయుడు పూజలు చేస్తే వర్షాలు పడ్డాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు చేసిన మోసాలు ప్రజల ముందుకు తీసుకువెళ్లాలి. అన్ని శాఖల వ్యవహారాలు ఒక పోలీస్ స్టేషన్లోనే నిర్వహించే పరిస్థితికి తీసుకు వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కక్ష సాధింపులుకు పాల్పడడమే తప్ప ప్రజలకు మంచి పాలన అందించే పరిస్థితి లేదు. రెండు ఎకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు పాలమ్మి వేల కోట్లకు అధిపతి అయ్యారా ఎలా అయ్యారో ఆ కిటుకేంటో చెప్తే మనందరం అలాగే సంపాదించుకుందాం.
స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెడతారో తెలియని పరిస్థితి. ఏదైనా ఎప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినా మండల స్థాయి నుండి గ్రామస్థాయి నాయకులు వరకు సిద్ధంగా ఉండాలి’ అని సూచించారు.
ఇదీ చదవండి: చంద్రబాబుకు పబ్లిసిటీ ఎక్కువ.. పని తక్కువ..


