సాక్షి,కాకినాడ: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి. నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనతో పాటు ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న షేక్ సాధిక్‌ఖాన్ పోలీసుల విచారణ ముగిసింది. రెండు రోజుల పాటు సాధిక్‌ను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఈ సందర్భంగా 80కి పైగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ముఖ్యంగా జగదీశ్‌రెడ్డి హత్యకు పన్నిన కుట్ర, విషప్రయోగానికి సంబంధించిన ప్రణాళిక, సైనైడ్ సేకరణ, విషాన్ని అందించే విధానం తదితర అంశాలపై పోలీసులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.
జగదీశ్‌రెడ్డికి ప్రొటీన్ పౌడర్‌లో సైనైడ్ కలిపి ఇచ్చే ఆలోచన ఎలా వచ్చింది? విషపదార్థాన్ని ఎన్ని విడతల్లో అందించారు? ఎక్కడి నుంచి సైనైడ్‌ను సేకరించారు? ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే అంశాలపై సాధిక్‌ను పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం.
సైనైడ్ సరఫరాదారుల ఎదుట విచారణ
సైనైడ్ సరఫరా చేసినట్లు అనుమానిస్తున్న వ్యక్తులను కూడా పోలీసులు విచారణకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వారి ఎదుటే సాధిక్‌ను ప్రశ్నించి, సైనైడ్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన వివరాలను నిర్ధారించుకునే ప్రయత్నం చేశారు. సైనైడ్ కోసం రెండు విడతల్లో మొత్తం రూ.60 వేల వరకు చెల్లించినట్లు సాధిక్ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ చెల్లింపులు ఎవరికి, ఎప్పుడు, ఏ విధంగా జరిగాయనే అంశంపై పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.
వివాహ వివాదమే కారణమా?
విచారణ సందర్భంగా సాధిక్ కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 14 తర్వాత సౌజన్యతో తన వివాహం విషయంలో వివాదాలు మొదలయ్యాయని, జగదీశ్‌రెడ్డి అడ్డుగా లేకపోతే సౌజన్యను తాను పెళ్లి చేసుకునేవాడినని సాధిక్ చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జగదీశ్‌రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు విచారణలో సాధిక్ వెల్లడించినట్లు పోలీసులు చెబుతున్నారు. కుట్రలో భాగంగా జగదీశ్‌రెడ్డికి విడతలవారీగా విషపదార్థాన్ని ఇచ్చినట్లు కూడా అంగీకరించినట్లు సమాచారం.
జులై 1న ప్రొటీన్ పౌడర్‌లో విషం
జులై 1న ప్రొటీన్ పౌడర్‌లో సైనైడ్ కలిపి జగదీశ్‌రెడ్డికి ఇచ్చినట్లు సాధిక్ విచారణలో చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే విషప్రయోగం ఎన్ని సార్లు జరిగింది, ప్రతి సందర్భంలో ఎంత మోతాదులో విషపదార్థాన్ని ఉపయోగించారు అనే అంశాలపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేసినట్లు తెలుస్తోంది. విచారణలో కొన్ని ప్రశ్నలకు సాధిక్ నేరుగా సమాధానం ఇవ్వకుండా దాటవేసినట్లు సమాచారం. దీంతో అతడి వాంగ్మూలంలోని అంశాలను ఇతర నిందితులు, సాక్షులు, సాంకేతిక ఆధారాలతో సరిపోల్చే దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నేడు కస్టడీ ముగింపు
సాధిక్ పోలీస్ కస్టడీ శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ముగియనుంది. అనంతరం అతడిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి, తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. పోలీసుల విచారణలో సాధిక్ వెల్లడించిన అంశాలు, సైనైడ్ సరఫరాకు సంబంధించిన వ్యక్తుల వాంగ్మూలాలు, ఇతర సాక్ష్యాలను విశ్లేషించిన తర్వాత కేసులో తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో మరెవరైనా ప్రమేయం ఉందా? హత్యకు ఉపయోగించిన విషపదార్థాన్ని ఎక్కడి నుంచి సేకరించారు? ఎంతకాలం పాటు కుట్ర కొనసాగింది? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.


