విశాఖ : తన కుమారుడి కడసారి చూపు దక్కేలా చేయాలని నగరంలోని రుషికొండ బీచ్ సమీపంలో గల్లంతయిన విద్యార్థి సూర్యప్రకాష్ తండ్రి బోరుమన్నారు. గల్ఫ్‌లో ఉంటున్న ఆయన ఘటన అనంతరం ఆవేదనతో వీడియో విడుదల చేశారు.
తనను అబుదాబి నుంచి విశాఖ రప్పించాలని, తన కుమారుడి కడసారి చూపు దక్కేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. యాజమానులు తనకు పాస్ పోర్టు ఇవ్వడం లేదని, ఎలాగైనా తాను భారత్ వచ్చేలా చూడాలంటూ ప్రాధేయపడ్డారు.
నగరంలోని రుషికొండ బీచ్‌ను ఆనుకుని ఉన్న రిషికొండ హిల్స్ ప్రాంతంలో ముగ్గురు బాలురు గల్లంతైన ఘటన శుక్రవారం సంభవించింది. స్నానానికి దిగిన ముగ్గురు బాలురు సముద్ర అలల ఉధృతికి గల్లంతయ్యారు. బాలురు ఆచూకీ కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.
గాలింపు చర్యల్లో భాగంగా గల్లంతైన ముగ్గురు విద్యార్థుల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది. బాలుడి మృతదేహాన్ని గుర్తించిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్.. టూరిజం బోటులో ఒడ్డుకు తీసుకొచ్చారు. అతన్ని ప్రశాంత్‌గా గుర్తించారు. మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. స్కూబా డ్రైవర్స్ టీమ్ కూడా రంగంలోకి దిగింది.
గల్లంతైనవారు విశాఖ నగరంలోని మధురవాడ ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తోంది. పది మంది కలిసి బీచ్‌కు రాగా, ముగ్గురు అలల ఉధృతికి గల్లంతయ్యారు. గల్లంతయిన వారు సూర్య ప్రకాష్, నితీష్, ప్రశాంత్‌లుగా గుర్తించారు. వీరంతా 9వ తరగతి చదువుతున్నారు. పిల్లలు సముద్రంలో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


