గుంటూరులో గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
చంద్రబాబు ప్రభుత్వంపై సమర శంఖం
గాంధీ జయంతి రోజున రోడ్డెక్కిన ఉద్యోగులు
ఐఆర్, పీఆర్సీ, ఐదు డీఏలు, రూ.40 వేల కోట్ల పెండింగ్ బకాయిల మాటేంటని నిలదీత
నోషనల్ ఇంక్రిమెంట్లు, జూనియర్ అసిస్టెంట్‌స్థాయి హోదా, సొంత మండలాల్లో నియామకాలకు వీలు కల్పించాలని, జీవో నంబర్ 11 రద్దు చేయాలని డిమాండ్
మహాత్ముని విగ్రహాల సాక్షిగా మార్మోగిన నినాదాలు
సచివాలయ ఉద్యోగుల వినూత్న ఆందోళన
అంగన్‌వాడీ కార్యకర్తల విన్నపాల నివేదన
చంద్రబాబు సర్కారుపై ఉద్యోగులు నిరసన గళమెత్తారు. గాంధీ జయంతి రోజున రోడ్డెక్కి శాంతియుతంగా సత్యాగ్రహం చేశారు. గాంధేయమే గాండీవమని నినదించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని గర్జించారు. ఐఆర్, పీఆర్సీ, ఐదు డీఏలు, 40వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు మాటేమిటని నిలదీశారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, జీవో నంబర్ 11 రద్దు తదితర అంశాలపై ధ్వజమెత్తారు. సమస్యలపై జాతిపిత విగ్రహాలకు విన్నపాలు నివేదించారు. సర్కారుకు సద్బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు. – సాక్షి, అమరావతి
మహాత్మా.. మా మొర వినుమా..
ఓ మహాత్మ మా మొర వినుమా అంటూ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు శుక్రవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా గ్రామ, వార్డు ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా గాంధీ విగ్రహాల ఎదుట గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసనలు తెలిపారు. ‘ప్రజలకు సేవ చేయాల్సిన మేమే మా హక్కుల కోసం రోడ్డెక్కాల్సి వచ్చింది. మా సమస్యలు వినాలని కోరుతున్నాం’ అంటూ గాంధీ విగ్రహాల ఎదుట వినతిపత్రాలు ఉంచారు.
ఈ పాలకుల మనసులు మార్చి మా కష్టాలు కడతేర్చు జాతిపితా అంటూ వేడుకున్నారు. గాం«దీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల గుమ్మం వద్దకు సేవలందిస్తున్న తమపట్ల వివక్ష చూపడం సరికాదన్నారు. ఒకవైపు ప్రజలకు ప్రభుత్వ సేవలు అందిస్తూ.. మరోవైపు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. తమపట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
శాంతియుతంగా ఆందోళనలు చేస్తే కేసులా?
తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ నిర్వహించిన ‘చలో విజయవాడ’లో పాల్గొన్న ఉద్యోగులను సస్పెండ్ చేయడం, 46 మందిపై కేసులు నమోదు చేయడం ప్రభుత్వ వేధింపులకు పరాకాష్ట అని ఐక్యవేదిక నేతలు దుర్గం మధులత, కేవీ రాజేష్‌బాబు మండిపడ్డారు. స్వాతంత్య్ర సాధన కోసం గాం«దీజీ ఎంచుకున్న శాంతియుత మార్గంలోనే నిరసనలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వంలో కదలిక రావాలని, తమ డిమాండ్ల పరిష్కారం విషయంలో చిత్తశుద్ధితో ముందుకు రావాలన్నారు.
గతంలో ఉపాధ్యాయులకు ఇచ్చినట్లుగానే సచివాలయ ఉద్యోగులకు కూడా రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరుచేయాలని, ప్రొబేషన్ ఆలస్యమైన తొమ్మిది నెలల కాలానికి చెందిన బకాయిలు చెల్లించడంతో పాటు అదనంగా వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు కనీస వేతన పరిరక్షణ కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు తాము ఇదే రీతిలో శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఆందోళనల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో పాటు ఏపీ మహిళా పోలీసు ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, వ్యవసాయ, ఉద్యాన, పశు సవంర్థక, మత్స్య సహాయకుల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ నిరసనలకు నాయకత్వం వహించారు.
డీఏ బకాయిల కోసం డిమాండ్
డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీస్‌ఈఏ)పోరాటానికి దిగింది. గాంధీ జయంతి రోజైన శుక్రవారం విజయవాడ ధర్నా చౌక్‌లో సీపీఎస్ ఉద్యోగులు నిరాహార దీక్ష చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు బాజీ పఠాన్, ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, ఇతర నాయకులు దీక్షలో కూర్చున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినదించారు. 48 గంటల నిరశన దీక్షకు సిద్ధపడిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం భారీ వర్షం కురిసి టెంట్లు చెల్లాచెదురు కావడంతో దీక్షాపరులతో బలవంతంగా దీక్ష విరమింపజేశారు. సీపీఎస్ ఉద్యోగుల ఉద్యమానికి పలు సంఘాలు మద్దతు తెలిపాయి.
జాతిపితా.. సర్కారుకు సద్బుద్ధి ప్రసాదించు
ఇచి్చన హామీలు అమలు చేయని చంద్రబాబు సర్కారుపై అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. గాంధీజీ విగ్రహాల వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హామీలు అమలుచేసేలా బాబు ప్రభుత్వానికి సద్బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు. అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న తమకు కనీస వేతనాలు పెంచకపోవడం ఎంతవరకు సమంజసమని నిరసించారు. తమకు ప్రభుత్వం సామాజిక పెన్షన్లు, సంక్షేమ పథకాలు కూడా అందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు సామాజిక పింఛన్లు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, కనీస వేతనాలు అందించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సర్కారు స్పందించకుంటే గాంధేయమార్గంలో మహోద్యమం చేపడతామని హెచ్చరించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ మూడు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఐదో రోజుకు చేరిన ‘పార్ట్‌టైమ్ ఉద్యోగుల’ మహా ధర్నా
పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్
వర్షంలోనూ కొనసాగిన నిరసన
మధురానగర్(విజయవాడసెంట్రల్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థలో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ టీచర్లు, లెక్చరర్లు, సిబ్బంది విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహిస్తున్న మహాధర్నా శుక్రవారం ఐదో రోజుకు చేరింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉద్యోగులు మహా ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్ట్‌టైమ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారుస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి మాట తప్పడంతోనే ఈ మహా ధర్నా చేపట్టాల్సి వచ్చిందన్నారు.

ఐదు రోజులుగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం దారుణమన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన ధర్నాకు న్యాయవాది, జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రామకృష్ణ, విశ్వ కళా మండలి రాష్ట్ర అధ్యక్షుడు కుటుంబరావు, ఏపీ ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఉమామహేశ్వరరావు తదితరులు మద్దతు తెలిపారు.
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
విశాఖలో సత్యాగ్రహ దీక్ష
బీచ్‌రోడ్డు: కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వందలాది మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు ఏపీ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ రాష్ట్ర గౌరవ చైర్మన్ ఏవీ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడంపై చంద్రబాబు ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే రాష్ట్రంలోని మూడు లక్షల మంది ఉద్యోగులు అసెంబ్లీకి తరలివస్తారని హెచ్చరించారు.

ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఉద్యోగులకు కనీసం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జేఏసీ రాష్ట్ర చైర్మన్ కాంతారావు (నాని) మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో ఉద్యోగులతో సదస్సులు నిర్వహిస్తామని, అక్టోబర్ 4న రాజమహేంద్రవరంలో ‘గోదావరి జిల్లాల గర్జన’ నిర్వహించనున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో ఏపీకాస్ ఉద్యోగుల జేఏసీ ప్రధాన కార్యదర్శి పి.వెంకటసుబ్బయ్య, సమగ్ర శిక్ష కేజీబీవీ రాష్ట్ర నాయకులు కె. విజయగౌరి, ఎన్‌హెచ్‌ఎం రాష్ట్ర జేఏసీ చైర్మన్ డి.దయాని, మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ నాయకుడు రాజు, అనకాపల్లి జిల్లా జేఏసీ నాయకుడు వీవీ శ్రీనివాసరావు, విశాఖ జిల్లా జేఏసీ నాయకుడు పి.మణి, సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


