ర్యాలీలో పాల్గొన్న వామపక్ష నాయకులు
తక్షణం సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి
సర్ ప్రక్రియను నిలిపేసి, ఎన్నికల సంఘాన్ని పునర్‌వ్యవస్థీకరించాలి
విజయవాడలో భారీ ర్యాలీ అనంతరం సభలో నేతల డిమాండ్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. ఏకంగా 13 కోట్లమంది ఓటర్ల పేర్లు తొలగించారని చెప్పారు. దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోపభూయిష్టంగా సాగుతున్న ఈ సర్ ప్రక్రియను నిలిపివేయాలని, ఎన్నికల కమిషన్ పునర్వ్యవస్థీకరించాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా శుక్రవారం విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ సర్ ప్రక్రియలో లోటుపాట్లను తమ పార్టీ పలుమార్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తెలిపినట్లు చెప్పారు.
2023లో తెచ్చిన ఎన్నికల చట్టం, ఎంపిక కమిటీ నుంచి ప్రధాన న్యాయమూర్తిని తొలగించడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదట స్పందించి ట్వీట్ చేశారని, ఈ చట్టాన్ని మార్చాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాలని ౖవైఎస్సార్‌సీపీ ఎంపీలు ఢిల్లీలో కోరారని చెప్పారు. కొత్త ఓటర్ల నమోదు, ఫారం–6 ప్రక్రియపై అధికారులు శ్రద్ధ పెట్టకుండా నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ..సీఈసీ జ్ఞానేష్ కుమార్ బీజేపీ ఏజెంట్ అని డాక్యుమెంటరీతో రుజువైందని చెప్పారు.
సీఈసీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫారం–6 పేరుతో కొత్త ఓటర్లను, యువతను ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రెండున్నర లక్షలమంది కొత్త ఓటర్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. బీజేపీ తొత్తుగా మారి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయవద్దని చంద్రబాబుకు హితవు పలికారు. మాజీ ఐఏఎస్ అధికారి బండ్ల శ్రీనివాస్,ఆంధ్ర మేథావుల ఫోరం కనీ్వనర్ చలసాని శ్రీనివాస్, జెన్‌జెడ్ ప్రతినిధి మేఘనారెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సీపీఎం రాష్ట్ర నాయకులు డి.రమాదేవి, వై.వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నేతలు నరహరిశెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజీ, వామపక్ష పార్టీల నేతలు చిట్టిపాటి, రవీంద్ర, జాస్తి కిషోర్‌బాబు, హరినాథ్, గణేష్ , సి.భాస్కరరావు మాట్లాడారు.


