రాష్ట్రపతి ముర్ము ఆమోద ముద్ర
నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
సోమవారం ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ఐదుగురిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలన్న సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో వారి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులైన న్యాయమూర్తులు జస్టిస్ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్(టీసీడీ శేఖర్), జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరి హరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు సోమవారం ప్రమాణం చేయనున్నారు.
హైకోర్టు మొదటి కోర్టు హాలులో నిర్వహించనున్న కార్యక్రమంలో వారితో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేయిస్తారు. జస్టిస్ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్ 2024 అక్టోబర్ 28న, జస్టిస్ అవధానం హరి హరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు 2025 జనవరి 24న హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని గత నెల 23న సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం చేసింది.


