కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ప్రధాని మోదీ ఎరువుల కొరత లేకుండా చూస్తున్నారు
మదనపల్లెలో హార్టికల్చర్ హబ్, ఐఎస్‌ఏలకు శంకుస్థాపన
వ్యవసాయాన్ని మన యువత గర్వంగా ఎంచుకునే వృత్తిగా మారుద్దాం: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ
ఏడాదంతా పంటలు పండించేలా గ్రీన్ హౌస్ సాంకేతికత
సాక్షి, మదనపల్లె: రైతాంగానికి కేంద్రప్రభుత్వం వివిధ పథకాల ద్వారా చేయూత ఇస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. స్వదేశీ–స్వరాజ్యం అన్న గాందీజీ, జై జవాన్– జైకిసాన్ అని పిలుపునిచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె బీకేపల్లి గ్రామంలో నిర్వహించిన సభలో రాయలసీమ హార్టికల్చర్ హబ్, రిలయన్స్ సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శిలా ఫలకాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ బటన్ నొక్కి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌ను ఏర్పాటు చేస్తున్న రిలయన్స్ సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మాదిరిగా దేశానికి ఉపయోగపడేలా రైతులకు సహకారం అందిస్తోందని తెలిపారు. ప్రధాని మోదీ రైతాంగానికి ఎరువుల కొరత లేకుండా చూస్తున్నారని తెలిపారు. యూరియా బస్తా ధర అంతర్జాతీయంగా రూ.3వేలు ఉంటే రైతులపై భారం పడకుండా రూ.300కే అందిస్తున్నామని, బస్తాకు కేంద్రం రూ.2,700 సబ్సిడీని భరిస్తోందన్నారు. వాతావరణాన్ని తట్టుకునేలా కొత్త వంగడాలు తెచ్చామన్నారు.

మదనపల్లె పర్యటనలో మొక్కలు నాటి నీరుపోస్తున్న నిర్మలా సీతారామన్, చంద్రబాబు, అనంత్ అంబానీ, పవన్ కళ్యాణ్
గోబర్ధన్ విధానం ద్వారా బయోగ్యాస్, పీఎం కుసుమ్ యోజన ద్వారా సోలార్ పంపుసెట్లు ఇస్తున్నామన్నారు. రైతులకు పంట నష్టం రాకుండా కిసాన్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఆక్వా రైతులకు, పశువుల పెంపకానికి సంయుక్తంగా పథకాలు అందిస్తున్న ట్టు తెలిపారు. కాగా నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తుండగా టీడీపీ కూటమి శ్రేణులు తీవ్ర గందరగోళం సృష్టించారు. ‘ఒక్క నిమిషం నా మాట వినండి’ అంటూ ఆమె పదే పదే వేడుకొన్నా కూటమి శ్రేణులు అల్లరి మానకపోవడంతో ఆమె తీవ్ర అసహనానికి గురై రెండు చేతులూ జోడించారు.
వాటర్‌మేన్ అంటుంటే ఆనందంగా ఉంది: సీఎం
రాష్ట్రంలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను రానున్న మూడేళ్లలో పూర్తి చేయడంతోపాటు పోలవరం పూర్తి చేసి ప్రధాని ద్వారా జాతికి అంకితమిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. మదనపల్లెలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్‌ఏ) ఉద్యాన రంగానికి కీలకం అవుతుందన్నారు. గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌తో మరో రూ.లక్ష కోట్ల జీడీపీ పెరిగే అవకాశం ఉందన్నారు.
వాటర్ మాన్ అంటుంటే తన మనసుకు ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రాయలసీమలో గత రెండేళ్లలో రూ.8 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టినట్టు ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అన్నారు. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రులు నారా లోకేశ్, కింజరాపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ రంగంలో నూతన మార్పులకు వేదిక...
అనంత్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
అన్నదాతల ఆదాయాన్ని పెంచుతూ, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో మదనపల్లెలో ఏర్పాటు కానున్న ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ (ఐఎస్‌ఏ) భారత వ్యవసాయ రంగంలో కీలక మైలురాయిగా నిలవనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ పేర్కొన్నారు. మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (రిలయన్స్ భాగస్వామ్యంతో) శంకుస్థాపన కార్యక్రమం అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల సంప్రదాయ అనుభవంతో అనుసంధానించి, వ్యవసాయ రంగంలో నూతన మార్పులకు ఈ విద్యాసంస్థ వేదిక కానుందని తెలిపారు.

మదనపల్లెలో అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఈ విద్యాసంస్థను ఏర్పాటు చేయడం చారిత్రాత్మక పరిణామమని అభివర్ణించారు. సుమారు పాతికేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) ఏర్పాటును ప్రస్తావిస్తూ ఇప్పుడు భారతీయ రైతులకు కూడా అదే తరహాలో ప్రత్యేక విద్యాసంస్థ అందుబాటులోకి రావడం విశేషమన్నారు. ప్రపంచానికి భారత్ అనేకమంది ప్రతిభావంతులైన సీఈఓలను అందించిందని, అదే స్ఫూర్తితో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ రైతులను తమ సొంత పొలాలకు సీఈఓలుగా తీర్చిదిద్దే దిశగా పనిచేస్తుందని అన్నారు. వ్యవసాయాన్ని కేవలం సంప్రదాయ వృత్తిగా కాకుండా, ఆధునిక సాంకేతికత, సమర్థవంతమైన నిర్వహణ, మార్కెట్ అవగాహనతో కూడిన లాభదాయక రంగంగా అభివృద్ధి చేయడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశమని వివరించారు.
జై జవాన్.. జై కిసాన్.. జై విజ్ఞాన్.. జై అనుసంధాన్
లాల్ బహదూర్ శాస్త్రి పిలుపు ఇచ్చిన జై జవాన్.. జై కిసాన్ నినాదానికి, అటల్ బిహారీ వాజ్‌పేయి జై విజ్ఞాన్‌ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై అనుసంధాన్‌ను జోడించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ నాలుగు నినాదాల స్ఫూర్తిని ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ పనిచేయనుందని పేర్కొన్నారు.
వ్యవసాయాన్ని గర్వంగా ఎంచుకునే వృత్తిగా మారుద్దాం..
తాను ఒక పశు సేవకుడిని అనంత్ అంబానీ తెలిపారు. మన రైతులు పశుసంపద విలువను అర్థం చేసుకుంటారన్నారు. జామ్‌నగర్‌లోని తమ ’వంతార’ కేంద్రం హై–టెక్ పశుసంవర్ధక, వన్యప్రాణి సంరక్షణ సాంకేతికతను ఇక్కడ కూడా అమలు చేస్తామని చెప్పారు. వ్యవసాయాన్ని యువత గర్వంగా ఎంచుకునే వృత్తిగా మారుద్దాం.. వారికి నైపుణ్యాలు, సాంకేతికత కల్పిస్తే, వారు తమ గ్రామాల్లోనే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకుంటారని అన్నారు.
వ్యవసాయంలో ఏఐ,డ్రోన్లు, రోబోటిక్స్
ఈ విద్యాసంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డ్రోన్లు, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అనంత్ అంబానీ వెల్లడించారు. పంటలకు చీడపీడలు సోకే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి రైతులను అప్రమత్తం చేసే పరికరాలు, పంట ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ నీరు, పోషకాలను సమర్థంగా వినియోగించుకునేలా సూచించే డ్రోన్లు అభివృద్ధి చేసే దిశగా యువ ప్రతిభావంతులు పనిచేయనున్నారని తెలిపారు. కష్టతరమైన వ్యవసాయ పనులను సులభతరం చేసి, పంట నష్టాలను తగ్గించేందుకు రోబోటిక్స్ సాంకేతికత ఉపయోగపడుతుందన్నారు.
ఈ పాఠశాల శిక్షణ మాడ్యూళ్లను గ్రామీణ ప్రాంతాల్లోని లక్షల మంది రైతులకు వర్చువల్ క్లాస్‌రూమ్‌ల ద్వారా, వారి స్వంత భాషల్లో అందిస్తామన్నారు. జియో అభివృద్ధి చేసిన జియో కృషి ప్లాట్‌ఫారమ్ ద్వారా రైతులకు ప్రయోజనకరమైన ఉత్పత్తులను, జామ్‌నగర్‌లోని ఆధునిక బయో–ఎనర్జీ ఆర్‌అండ్‌డీ కేంద్రం జ్ఞానాన్ని పంచుకుంటామన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారి, ప్రతి రైతుకు సమాజంలో గౌరవం, ఆర్థిక ప్రయోజనం లభించినప్పుడే మహాత్మా గాంధీ ఆశయాలైన సర్వోదయ, అంత్యోదయలకు నిజమైన సార్థకత చేకూరుతుందన్నారు. భారతదేశం గ్రామాల్లోనే జీవిస్తుందన్న గాంధీజీ సందేశాన్ని గుర్తుచేస్తూ.. గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం దేశ ప్రగతికి పునాదులని స్పష్టం చేశారు.


