అక్కడ సాగునీటి ప్రాజెక్టులన్నీ ఆయన గొప్పతనమేనట
ఇజ్రాయిల్ డ్రిప్ ఇరిగేషన్‌తో సీమ రూపురేఖలే మార్చేశారంట
రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంటూ గప్పాలు
ఇందుకు కేంద్ర వాటా రూ.40వేల కోట్లు అంటూ ప్రకటన
హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన సభలో సీఎం చంద్రబాబు అబద్ధాల వెల్లువ
సాక్షి, అమరావతి : బడ్జెట్‌లో రూపాయి కేటాయించకుండానే.. రూ.లక్ష కోట్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతానంటూ చంద్రబాబు మాటల విన్యాసాలు చూసి రాయలసీమ వాసులు నివ్వెరపోతున్నారు. అబ్రకదబ్ర.. చూమంత్రకాళీ అంటూ ఇంద్రజాలికుల మాదిరిగా పైసాలేకుండానే మదనపల్లిలో శంకుస్థాపన హంగామా చేసిన చంద్రబాబు కళ్లార్పకుండా నిస్సిగ్గుగా మాట్లాడిన తీరుచూసి రాష్ట్ర ప్రజలు నోరెళ్లబెడుతున్నారు.
ఈ రూ.లక్ష కోట్ల ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెడుతుందో చెప్పని చంద్రబాబు.. కేంద్రం రూ.40 వేల కోట్లు పెడుతుందని, ప్రైవేటు రంగం నుంచి రూ.60 వేల కోట్లు పెట్టుబడులొస్తున్నాయని గొప్పలు చెప్పారు. కానీ, ఇదే సభలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తన ప్రసంగంలో ఎక్కడా ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.40 వేల కోట్లు ఇస్తున్నట్లుగా చెప్పకపోవడం కొసమెరుపు. దీంతో.. చంద్రబాబు ఏ స్థాయిలో ప్రజలను మభ్యపెడుతున్నారో ఇట్టే అర్ధమవుతుంది. ఈ అసత్య హరిశ్చంద్రుడు ఇంకా ఏఏ అబద్ధాలు చెప్పారంటే..
రాయలసీమను ఉద్యాన సీమగా తీర్చిదిద్దింది ఆయనేనట!..
రాయలసీమను ఉద్యాన సీమగా మార్చేందుకు ఆద్యుడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్. ఈ విషయం సీమలోని ప్రతీ ఒక్కరికీ తెలుసు. ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్తే ఈరోజు రాయలసీమలో ఉద్యాన పంటల సాగుకు ఊతమిచ్చింది. రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ బోర్లలో మూడొంతులు రాయలసీమలోనే ఉన్నాయి. 90 శాతం సబ్సిడీపై బిందు, తుంపర పరికరాల ద్వారా చిన్న, సన్నకారు రైతులకు సూక్ష్మ, సాగునీటి వ్యవస్థతో ఉద్యాన పంటలకు ఊతమిచ్చిందీ వైఎస్సారే. ఈ వాస్తవాలను కప్పిపుచ్చుతూ ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్‌తో కరువు సీమ రూపురేఖలు మార్చేశానంటూ చంద్రబాబు తెగ డబ్బా కొట్టుకున్నారు. పైగా.. మైక్రో ఇరిగేషన్ పాలసీని తీసుకొచ్చానంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లెవేశారు.
‘సీమ’లో సాగునీటి ప్రాజెక్టులన్నీ ఆయన గొప్పతనమేనట..
‘ఎన్టీఆర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాం. రూ.3,500 కోట్లతో అతిపెద్ద లిఫ్ట్ హంద్రీ–నీవా ద్వారా కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లాం. వెలిగొండ ఫేజ్–1 ప్రారంభించాం. హంద్రీ–నీవా నుంచి నీళ్లులేకపోతే మదనపల్లి పూర్తిగా ఎప్పుడో వలస పోయేది’.. అంటూ చంద్రబాబు నోటికొచ్చినట్లు పచ్చి అబద్ధాలు చెప్పుకొచ్చారు. వాస్తవానికి.. జలయజ్ఞం కింద పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు తీసుకెళ్లడమే కాదు.. గాలేరు–నగరిలో అంతర్భాగమైన గోరుకల్లు, అవుకు, గండికోట, మైలవరం, సర్వారాయ సాగర్, వామికొండ రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు, హంద్రీ–నీవాలో జీడిపల్లితో పాటు మరో ఆరు రిజర్వాయర్లు నిర్మించి సీమను సస్యశ్యామలం చేసేందుకు బాటలు వేసిన ఘనత డాక్టర్ వైఎస్సార్‌దే. అయినాసరే చంద్రబాబు ఎలాంటి సిగ్గులేకుండా సీమలో ప్రాజెక్టులన్నీ తమ హయాంలోనే చేపట్టి పూర్తిచేసినట్లు చెప్పుకొచ్చారు.
సీమ రూపురేఖలు మార్చేశారంట..
ఇక తలసరి ఆదాయంలో రాయలసీమ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని చంద్రబాబు మరో ఘోరమైన అబద్ధం చెప్పారు. పైగా.. ఒకప్పుడు సీమలో ఎడారి ఛాయలుండేవని, కరువుతో పెద్ద సంఖ్యలో వలస పోతుండేవారని, పంటలకు నీళ్లుండేవి కావని, పశువులకు మేత ఉండేది కాదని.. కూలీలకు ఉపాధి దొరికేది కాదని చెబుతూ.. ఇప్పుడు తన కృషివల్లే రాయలసీమ రూపురేఖలు మారిపోయాయంటూ నోటికొచ్చినట్లు డబ్బాకొట్టుకున్నారు. నిజంగా.. తలసరి ఆదాయంలో నెం.1గా ఉంటే, కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమను వదిలి ఈ ఏడాది లక్షలాది కుటుంబాలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు ఎందుకు వలస పోతున్నారంటూ సీమ వాసులు ప్రశ్నిస్తున్నారు.


