రేవాక్స్ అగ్రిటెక్ ఇండియాకు చిత్తూరులో కేటాయింపు
ప్రోత్సాహకాల రూపంలో రూ.592.22 కోట్లు వెనక్కి
సరిగ్గా 10 నెలల క్రితం విశాఖ కేంద్రంగా కంపెనీ ఏర్పాటు
రూ.9 లక్షల మూలధనంతో రూ.1,388.14 కోట్లతో ఫుడ్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
ఫుడ్ ప్రాసెసింగ్, నిర్మాణ రంగాల్లో ఎటువంటి అనుభవంలేని కంపెనీ..
అలాంటి కంపెనీకి భారీ ప్రయోజనాలు చేకూర్చడంపై అనుమానాలు
సాక్షి, అమరావతి: ఆ కంపెనీ పుట్టి పట్టుమని పది నెలలే అయింది. దాని ప్రమోటర్లకు ఫుడ్ ప్రాసెసింగ్‌లోగానీ ఫుడ్ పార్కుల నిర్మాణంలోగానీ ఎలాంటి అనుభవంలేదు. రూ.9 లక్షలతో కంపెనీ పెట్టి రూ.1,388.14 కోట్లతో ఫుడ్ పార్కును ఏర్పాటుచేస్తున్నామంటూ దరఖాస్తు చేసుకున్నారో లేదో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద 40 ఎకరాల భూమిని ఉచితంగా ధారాదత్తం చేసేసింది. అంతేకాదు.. పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద రూ.592.22 కోట్లు వెనక్కి ఇచ్చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉర్సా.. ఇండిచిప్.. అజాద్ మొబిలిటీ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రేవాక్స్ అగ్రిటెక్ ఇండియాకి భారీ ప్రయోజనాలను చేకూరుస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఎలాంటి అనుభవం లేకపోయినా..
విశాఖ కేంద్రంగా 2025 నవంబర్ 20న రూ.9 లక్షల మూలధనంతో రేవాక్స్ అగ్రిటెక్ ఇండియా పేరిట దేవిప్రసాద్ ముల్లూరు, కీర్తి వినాయక్ కంభంలు కలిసి కంపెనీని ఏర్పాటుచేశారు. వీరిద్దరికీ అప్పటివరకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోగానీ, ఫుడ్ పార్కులు, ఇతర నిర్మాణ రంగ కార్యకలాపాల్లోగానీ ఎలాంటి అనుభవంలేదు. విశాఖలో ఉన్న వీరు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కైగల్ గ్రామంలో ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ)కి చెందిన 40.50 ఎకరాల్లో రూ.1,388.14 కోట్లతో ఫుడ్‌పార్క్ ఏర్పాటుచేస్తామంటూ ప్రతిపాదన పంపగానే 99 పైసలు కూడా తీసుకోకుండానే ఉచితంగా భూమి కేటాయించడమే కాక భారీ రాయితీలు ఇవ్వడంపై అధికారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

2025 నవంబర్ 20న రేవాక్స్ అగ్రిటెక్ ఇండియా కంపెనీ రిజిస్టర్ అయినట్లు స్పష్టం చేస్తున్న కాపీ
ఈ ఇద్దరు డైరెక్టర్లలో దేవిప్రసాద్ అనే వ్యక్తికి ఇంతవరకు వ్యాపార రంగంలో ఎలాంటి అనుభవంలేదు. మరో డైరెక్టర్ కీర్తి వినాయక్‌కు మాత్రం గ్లౌజులు వంటి వైద్య సంబంధిత వస్తువులను ఈజీఐఎస్ గ్లోవ్స్ పేరిట ఉత్పత్తి చేసిన అనుభవం ఉంది. అలాగే, పెటోరస్ కెమిక
ల్స్‌తో పాటు ఈ ఏడాది ఏప్రిల్‌లో సత్రా లాబ్స్ ఇండియా పేరిట మరో కంపెనీని స్థాపించారు. ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అనుభవంలేని వారికి పాలసీకి విరుద్ధంగా> ఉచితంగా భూమిని ఇవ్వడం వెనుక ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న వారు చక్రం తిప్పారంటూ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

రేవాక్స్ అగ్రిటెక్ ఇండియా కంపెనీకి చిత్తూరు జిల్లాలో ఉచితంగా 40.5 ఎకరాలు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 259
ప్రోత్సాహకాల రూపంలో భారీ మొత్తం వెనక్కి..
పండ్ల రసాలు, కెచప్‌లు, జ్యూస్, జామ్‌లు, ఇతర స్పైసెస్ పదార్థాలు తయారుచేసే విధంగా రూ.1,388.14 కోట్ల పెట్టుబడితో ఫుడ్ పార్కును ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వానికి రేవాక్స్ ప్రతిపాదనలను పంపింది. వీటిని పరిశీలించిన తర్వాత వాస్తవ పెట్టుబడి విలువలో రూ.592.22 కోట్ల ప్రోత్సాహకాల రూపంలో తిరిగి వెనక్కి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో క్యాపిటల్ సబ్సిడీ రూపంలో రూ.272.64 కోట్లు, విద్యుత్ సబ్సిడీల రూపంలో రూ.37.20 కోట్లు, జీఎస్టీ మినహాయింపుల కింద రూ.280.83 కోట్లు ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసి ఏప్రిల్, 2028 నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా అన్ని విభాగాల అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.


