breaking news
foodpark
-
కారుచౌకగా కట్టబెట్టేశారు!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు ఉపాధి కల్పిస్తుందని చెబుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్ల విలువైన భూమిని కారు చౌకగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కంపెనీకి కట్టబెట్టింది. ఇదే ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న భూమిని దారి కోసం ఓ రైతు నుంచి అదే కంపెనీ ఎకరం రూ.75 లక్షలకు కొనుగోలు చేస్తే.. ఆ వెనకే టీజీఐఐసీ (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) అధీనంలో ఉన్న 72 ఎకరాల భూమిని ఎకరం కేవలం రూ.21 లక్షల చొప్పున రూ.15.12 కోట్లకే ప్రభుత్వం ధారాదత్తం చేయడం గమనార్హం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌లో జరిగిన ఈ తంతుపై బీజేపీతో పాటు ఇతర పార్టీలు ఆందోళనలకు సిద్ధమవుతుండగా..ప్రభుత్వం, అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత విలువైన భూమిని తక్కువ ధరకు కట్టబెట్టేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి ఒకరు చక్రం తిప్పారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి లక్ష్యంగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతంలో జామ, మామిడి, అరటి, కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటలు విస్తారంగా సాగవుతున్నాయి. ఇక్కడ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో బుగ్గపాడులో ఫుడ్‌పార్క్‌కు శంకుస్థాపన చేశారు. ఇందుకోసం రైతుల నుంచి 203 ఎకరాలు సేకరించి రూ.1.75 లక్షల నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. ఆపై భవనాలు నిర్మించి, మౌలిక వసతులు కల్పించారు. ఫుడ్‌పార్కులో అన్ని వసతులున్నా.. పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాలేదు. గతంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మొక్కజొన్న, మామిడి, కొబ్బరిపీచు పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. అంత తక్కువ ధరకు ఎలా? బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌లో 72 ఎకరాల భూమి కేటాయిస్తే రూ.650 కోట్ల వ్యయంతో చేపలు, రొయ్యల దాణా తయారీకి ఒక పరిశ్రమ, రొయ్యల ప్రాసెసింగ్, ఎగుమతులకు మరో పరిశ్రమ ఏర్పాటుకు ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీపక్ నెక్స్ట్ జెన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంది. దీని యజమాని అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం కాగా..దీని ప్రధాన కార్యాలయం పూర్వపు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం, బొమ్ములూరు గ్రామంలో ఉంది. విజయవాడలో కూడా వీరికి సంబంధించిన కార్యాలయం ఉండగా, మచిలీపట్నం, ఏలూరు, విశాఖపట్నంలో కూడా వీరి యూనిట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి ఒకరు..ఫుడ్ పార్క్‌లో ఎకరం రూ.21 లక్షలకే కేటాయించేలా చేశారని తెలుస్తోంది. సదరు మంత్రి తనయుడు బుగ్గపాడు ప్రాజెక్టులో స్లీపింగ్ పార్ట్నర్ అనే ఆరోపణలూ విన్పిస్తున్నాయి. కాగా పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే ఈ భూమిలోకి త్వరగా చేరుకోవడానికి వీలుగా ప్రభుత్వంతో ఒప్పందం కన్నా ముందే రోడ్డు ఎదురుగా ఉన్న ఎకరం భూమిని ఓ రైతు వద్ద రూ.75 లక్షలకు ఆ కంపెనీ కొనుగోలు చేయడం గమనార్హం. కాగా అంత విలువున్న ఆ భూమిని ఆనుకుని ఉన్న టీజీఐఐసీ భూమిని ఎకరం రూ.21 లక్షలకు సదరు కంపెనీకి కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి టీజీఐఐసీ ఎకరం ధర రూ.40.47 లక్షలుగా నిర్ణయించింది. మరోవైపు ఆ కంపెనీ రైతు నుంచి ఎకరం ఏకంగా రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో ఈ రెండూ కాదని రూ.21 లక్షల ధర ఏ ప్రాతిపదికన నిర్ణయించారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అభివృద్ధి చేసిన విలువైన భూమిని ఈ విధంగా తక్కువ ధరకు అమ్మడంపై ప్రజాసంఘాలు, బీజేపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. రెండేళ్ల తర్వాత కంపెనీ ఆస్తే.. ఏపీ కంపెనీకి 72 ఎకరాలు ఇవ్వగా.. డీపీఆర్ ప్రకారం పరిశ్రమల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనతో పాటు 3 వేల మందికి ఉపాధి కల్పిస్తే రెండేళ్ల తర్వాత కంపెనీ పేరుతో సేల్‌డీడ్ అవుతుంది. అంటే సదరు భూమి కంపెనీదే అవుతుందన్న మాట. స్థానికంగా రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న నల్లరేగడి భూముల ఎకరం ధర బహిరంగ మార్కెట్లో రూ.50 లక్షల వరకు ఉంది. అంతేకాకుండా సీతారామ ప్రాజెక్టు జలాలు అందే అవకాశముంది. సదరు కంపెనీ కూడా రైతుల భూములు ఎకరా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల ధరకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు టీజీఐఐసీ ఇటీవల ఏప్రిల్ నుంచి జూన్ చివరి వరకు తమ అ«దీనంలో ఉన్న భూములకు చదరపు మీటర్ చొప్పున ధర నిర్ణయించగా.. బుగ్గపాడు భూమి ధర రూ.1,000గా ఖరారు చేసింది. ఈ లెక్కన ఎకరా కనీసం రూ.40.47 లక్షలకు కేటాయించాలని, అలా కాకుండా సగం ధరకే ఏకంగా 72 ఎకరాలు కట్టబెట్టడం వెనుక ‘మంత్రాంగం’ఉందనే చర్చ జరుగుతోంది. ఎవరూ ముందుకు రానందుకే.. కంపెనీ డీపీఆర్‌ను పరిశీలించాకే 72 ఎకరాల భూమి కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రెండేళ్లలో పూర్తిస్థాయి పరిశ్రమల ఏర్పాటుతో పాటు 3 వేల మందికి ఉపాధి కల్పిస్తామని డీపీఆర్‌లో పేర్కొన్నారు. బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌లో అన్ని వసతులు కల్పించి ఎకరం ధర రూ.40 లక్షలుగా నిర్ణయిస్తే పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. దీంతో ఇక్కడి భవనాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. ఈ దృష్ట్యా ప్రభుత్వ స్థాయిలో ఏపీ కంపెనీకి ఎకరం రూ.21 లక్షలకు అప్పగించాలని నిర్ణయం జరిగింది. – అజ్మీరా స్వామి, జోనల్ మేనేజర్, టీజీఐఐసీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి -
I2U2 Summit: భారత్‌లో యూఏఈ పెట్టుబడులు
ఐ2యూ2 ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా సమీకృత ఫుడ్‌పార్కుల అభివృద్ధికి 2 బిలియన్ డాలర్లు (రూ.1.60 లక్షల కోట్లు) ఖర్చు చేస్తామని ప్రకటించింది. అలాగే గుజరాత్లో హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుకు ఐ2యూ2 భాగస్వామ్య దేశాలు ఆసక్తి కనబర్చాయి. ఫుడ్‌పార్కుల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను భారత ప్రభుత్వం సమకూర్చనుంది. ఈ పార్కులతో రైతులను అనుసంధానించనున్నారు. సదస్సు అనంతరం ఐ2యూ2 కూటమి ఒక ప్రకటన జారీ చేసింది. ‘అగ్రికల్చర్ ఇన్నోవేషన్ మిషన్ ఫర్ క్లైమేట్ ఇనీషియేటివ్’పై ఆసక్తి చూపిన భారత్‌ను అమెరికా, యూఏఈ, ఇజ్రాయెల్ స్వాగతించాయి. -
ప్రతి జిల్లాలో పుడ్‌పార్కులు
సాక్షి, అమరావతి : వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్న రైతుల ఆదాయాన్ని పెంచేవిధంగా ప్రణాళికలు రచించామని, త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచే ప్రణాళికలో భాగంగా వ్యవసాయ, పరిశ్రమ శాఖలు కలిసి పనిచేసే చేయాలని నిర్ణయించామని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెంచబోతున్నామని తెలిపారు. వ్యవసాయ, పరిశ్రమల శాఖలతో కలిసి జాయింట్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. రైతుల సమస్కల పరిష్కారానికి, వైఎస్సార్ ఉచిత పంటల బీమ కోసం ప్రత్యేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని నిర్మాణంపై చంద్రబాబు నాయుడు అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడతున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేయాలంటూ విద్యార్థులను చంద్రబాబు బెదిరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇదే చంద్రబాబు .. ప్రత్యేక హోదా కోసం రోడ్డుమీదకు వచ్చిన విద్యార్థులపై బెదిరింపులకు దిగారని గుర్తుచేశారు. రాజధానిపై ప్రభుత్వం ఏ నిర్ణయం చెప్పకముందే ఆందోళనలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చ జరుగుతోందని, జీఎన్‌రావు, జీసీజీ నివేదికను హైపవర్ కమిటీ పరిశీలిస్తోందన్నారు. కమిటీ ప్రతిపాదనలో ఏవి అమలు చేయాలో త్వరలోనే నిర్ణయిస్తామని, అప్పుడే అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని మంత్రి తెలిపారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న వ్యవసాయ, పరిశ్రమల రంగాల మధ్య సమన్వయం కుదిరించి.. రైతులకు విస్తృత లాభాలు తెచ్చిపెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై పైలట్ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నామని తెలిపారు. అలాగే రైతులలో, స్థానిక యువతలో నైపుణ్యం పెంచేందుకు కార్యాచరణ చేపడతామని మంత్రి తెలిపారు. -
త్వరలో ఫుడ్ పార్క్‌కు శంకుస్థాపన
కర్నూలు(అగ్రికల్చర్): తంగడంచెలో జైన్ ఇరిగేషన్ నెలకొల్పనున్న ఫుడ్ పార్క్‌కు సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో శంకు స్థాపన చేయనున్నారని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన జైన్ ఇరిగేషన్ ప్రతినిధులు, పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21 లేదా 23వ తేదీల్లో ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని, నంద్యాల, ఓర్వకల్ మండలాలతో పాటు తంగడంచెలోను పర్యటిస్తారని వివరించారు. ఫుడ్ పార్క్‌కు శంకు స్థాపన సందర్భగా రైతులతో సమావేశం అవుతారన్నారు. సమావేశంలో జైన్ ఇరిగేషన్ ప్రతినిధి సమీర్‌శర్మ, జిల్లా పరిశ్రమల కేంద్రం డీడీ మధన్‌మమోహన్ శెట్టి, ఏపీఐఐసీ అధికారి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


