breaking news
lining canal
-
సిండికేట్‌కు మరో ‘ప్యాకేజీ’
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ ప్రధాన కాలువ లైనింగ్ పనులను అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని.. బోరు బావులు ఎండిపోతాయని.. తాము జీవనాధారం కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ.. రైతుల ఆందోళనను ఏమాత్రం ఖాతరు చేయకుండా హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ.. పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు ఇప్పటికే రూ.3,850 కోట్ల మేర టీడీపీ కూటమి సర్కార్ వ్యయం చేసింది. తాజాగా రూ.625.69 కోట్ల విలువైన పనులను సిండికేట్ అస్మదీయ కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. శ్రీసత్యసాయి జిల్లాలో ఎన్పీ కుంట, అన్నమయ్య జిల్లాలో గాలివీడు, పెదమండ్యం, చినమండ్యం, కేవీపల్లి మండలం అడవిపల్లి వరకూ హంద్రీ–నీవా రెండో దశ కాలువ 463 కి.మీ. నుంచి 554.175 కి.మీ. వరకూ మిగిలిపోయిన లైనింగ్, కాంక్రీట్ కట్టడాల నిర్మాణాల పనులకు జలవనరుల శాఖ శుక్రవారం టెండర్లు పిలిచింది. కాంట్రాక్టు విలువను రూ.511.66 కోట్లుగా నిర్ణయించింది. జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.113.63 కోట్ల రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. కాంట్రాక్టు విలువ రూ.625.29 కోట్లన్నమాట. పనుల పూర్తికి 18 నెలలు గడువు పెట్టింది. బిడ్ల దాఖలుకు ఈనెల 15 తుది గడువు. ఈనెల 19న ఆర్థిక బిడ్‌ను తెరిచి.. స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ ఆమోదంతో టెండర్ ఖరారు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ఐదు సంస్థలకే అర్హత...గతంలో హంద్రీ–నీవా లైనింగ్ పనులను ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్టŠట్స్, సీఎం చంద్రబాబుకు సన్నిహితులైన సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్, బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రా, కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన ఎస్సార్ కన్స్ట్రక్షన్స్, రంగరాజు ఎండీగా ఉన్న ఎన్సీసీ దక్కించుకున్నాయి. కాంట్రాక్టు ఒప్పందాన్ని తుంగలో తొక్కి.. రాతి పొర ఉన్న ప్రాంతాల్లో షార్ట్ క్రీటింగ్ (రాతి పొరకు ఇనుప జాలరీ అమర్చి సిమెంటు కాంక్రీట్ వేయడం) పద్ధతిలో కాకుండా, ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ (స్టీల్ ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ – ఇనుప మేకులతో కూడిన కాంక్రీట్ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో పిచికారి చేయడం) పద్ధతిలో మట్టి పొరకు చేశారు. అత్యంత నాసిరకంగా పనులు చేయడంతో 2025లో కాలువలో నీటి ప్రవాహానికే లైనింగ్ ఎక్కడికక్కడ దెబ్బతిని కొట్టుకుపోయింది. తాజాగా పిలిచిన టెండర్లలోనూ ఈ ఐదు సంస్థలే బిడ్లు దాఖలు చేసేలా నిబంధనలు రూపొందించారు. 2016–17 నుంచి 2025–26 వరకూ కాలువలో మట్టి తవ్వకం, గట్లు వేయడం, సిమెంటు కాంక్రీట్ లైనింగ్ చేయడం లాంటివి ఏదైనా ఒక ఏడాదిలో రూ.170.554 కోట్ల విలువైనవి పూర్తి చేసి ఉండాలని నిబంధన పెట్టారు. గత పదేళ్లలో ఏదైన ఒక ఏడాదిలో 14,84,552 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం, గట్లు వేసే పని.. 38,054 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్(పీసీసీ/వీఆర్‌సీసీ/ఆర్సీసీ), సిమెంట్ కాంక్రీట్ లైనింగ్/షార్ట్ క్రీటింగ్/ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ పద్ధతిలో 5,05,263 చదరపు మీటర్ల పని చేసి ఉండాలని నిబంధన పెట్టారు. వీటిని పరిశీలిస్తే.. ఆ ఐదు సంస్థల్లో ఒక సంస్థకు పనులు కట్టబెట్టడానికేనన్నది స్పష్టమవుతోందని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎస్ఎస్ఆర్ తుంగలోకి...బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజినీర్స్ (బీవోసీఈ) ఖరారు చేసి, ప్రభుత్వం ఆమోదించిన ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం మట్టి తవ్వకం పనులకు క్యూబిక్ మీటర్‌కు రూ.123.75.. కాలువ గట్లు (ఎంబాక్‌మెంట్) పనులకు క్యూబిక్ మీటర్‌కు 195.57 చెల్లించాలి. నిజానికి రెండో దశ ప్రధాన కాలువ 463 నుంచి 554.175 కిమీ వరకూ తవ్వకం పనులు 95 శాతం ఇప్పటికే పూర్తయ్యాయి. కానీ.. 44,53,657 క్యూబిక్ మీటర్ల మట్టి పని, కాలువ గట్ల పని మిగిలి ఉన్నట్లు చూపారు. సగటున క్యూబిక్ మీటర్‌కు రూ.195.57లు చొప్పున వేసుకున్నా ఈ పనులకు రూ.87.10 కోట్లు వ్యయం అవుతుంది. కానీ.. ఆ పనులకు సగటున క్యూబిక్ మీటర్‌కు రూ.396.60 చొప్పున లెక్కగట్టి ఏకంగా రూ.176.62 కోట్లుగా టెండర్లో పేర్కొనడం గమనార్హం. అంటే.. మట్టి పనికి క్యూబిక్ మీటర్‌కు సగటున రూ.201.03 పెంచేసినట్లు స్పష్టమవుతోంది. తద్వారా మట్టి పనుల రూపంలోనే రూ.89.52 కోట్ల మేర అంచనా వ్యయాన్ని పెంచేశారని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఇక కాంక్రీట్ కట్టడాలు, సిమెంటు కాంక్రీట్ లైనింగ్, షార్ట్ క్రీటింగ్, ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ పనుల అంచనా వ్యయాన్ని కూడా ఇదే రీతిలో పెంచేశారు. గతంలోలానే సిండికేటు కాంట్రాక్టు సంస్థల్లో ఒక సంస్థకు అధిక ధరలకు పనులు కట్టబెట్టి.. అత్యంత నాసిరకంగా చేపట్టి నీకింత నాకింత అంటూ ప్రజాధనాన్ని దోచుకుతినేందుకు ముఖ్యనేత సిద్ధమయ్యారని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. -
హంద్రీ–నీవా లైనింగ్ పనుల్లో మరో దోపిడీకి ఎత్తు
సాక్షి, అమరావతి : హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశ ప్రధాన కాలువ లైనింగ్ పేరుతో మరో విడత దోపిడీకి చంద్రబాబు సర్కార్ తెరతీసింది. శ్రీసత్య సాయి జిల్లా ముదిగుబ్బ, కదిరి, తలుపుల, ఎన్పీ కుంట మండలాల పరిధిలో హంద్రీ– నీవా రెండో దశ ప్రధాన కాలువ కాలువ 400.5 కి.మీ నుంచి 458.975/463 కి.మీ వరకు లైనింగ్ పనులు, మిగిలిపోయిన నిర్మాణ పనులకు రూ.487.48 కోట్ల అంచనాతో మంగళవారం టెండర్లు పిలిచింది. మరో రూ.109.21 కోట్లను జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది.అంటే.. కాంట్రాక్టు విలువ రూ.596.69 కోట్లు. ఈ పనులను లంప్సమ్ విధానంలో 18 నెలల్లోగా పూర్తి చేయాలని షరతు విధించింది. టెండర్లో బిడ్ల దాఖలుకు అక్టోబర్ 16 తుది గడువు. అక్టోబర్ 21న ఆర్థిక బిడ్‌ను తెరిచి టెండర్‌ను ఖరారు చేసి, పనులను కాంట్రాక్టు సంస్థకు అప్పగించనుంది. 2016–17 నుంచి 2025–26 వరకూ ఏదైనా ఒక ఏడాదిలో 13,19,026 క్యూబిక్ మీటర్ల మట్టి పని.. 25,705 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని, 3,97,015 చదరపు మీటర్ల సిమెంట్ కాంక్రీట్ లైనింగ్, షార్ట్ క్రీటింగ్, ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ (స్టీల్ ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్) పనులు పూర్తి చేసిన కాంట్రాక్టు సంస్థలకు టెండర్లో బిడ్ దాఖలుకు అర్హత ఉంటుందని పేర్కొంది. గత పదేళ్లలో ఏదైనా ఓ ఏడాది 2026–27 ధరల ప్రకారం రూ.162.50 కోట్ల విలువైన ఇదే రకం పనులు పూర్తి చేసి ఉండాలని మరో షరతు విధించింది. వీటిని బట్టి చూస్తే హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 216 కి.మీ నుంచి 400 కి.మీ వరకు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు చేసిన కాంట్రాక్టు సంస్థల్లో ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ (ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల రఘు), కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు (ఎస్సార్ కన్స్ట్రక్షన్స్), సీఎం చంద్రబాబు సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావు (బీఎస్సార్ ఇన్ఫ్రా), సీఎం చంద్రబాబు సన్నిహితుడు రంగరాజు ఎండీగా ఉన్న ఎన్సీసీ, సీఎం రమేష్ (రిత్విక్ ప్రాజెక్ట్స్)లలో.. ఒక సంస్థకు పనులు కట్టబెట్టేందుకే షార్ట్ క్రీటింగ్కు తోడుగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీని చేర్చారన్నది స్పష్టమవుతోంది. సన్నిహితులకు కట్టబెట్టేందుకే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ లింకు » రాతి పొర ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కాలువకు షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో లైనింగ్ (రాతి పొరకు ఇనుప జాలరీని అమర్చి.. దానిపై సిమెంటు కాంక్రీట్ వేయడం) చేయాలి. షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో లైనింగ్ చేయడానికి సాధ్యం కాని చోట్ల మాత్రమే.. రాతి పొరకు ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ (ఇనుప మేకులతో కూడిన సిమెంట్ కాంక్రీట్ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో స్ప్రే చేయడం) పద్ధతిలో లైనింగ్ చేయాలి. » కానీ.. హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 216 నుంచి 400 కి.మీ వరకు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు 2024–2025లో పిలిచిన టెండర్లలో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ నిబంధన లేదు. సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ లేదా షార్ట్ క్రీటింగ్ విధానంలో మాత్రమే లైనింగ్ చేయాలని స్పష్టంగా ఉంది. » టెండర్ నిబంధనలు ఉల్లంఘించి రాతి పొర లేకపోయినా కాలువ గట్లను సరి చేయకుండానే మట్టి పొరకే ఇష్టారాజ్యంగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో అత్యంత నాసిరకంగా లైనింగ్ చేసి బిల్లులు కాజేశారు. దాంతో 2025లో కాలువలో నీటి ప్రవాహ ఉద్ధృతికే లైనింగ్ ఎక్కడికక్కడ జారిపోయి కొట్టుకుపోయింది. రూ.3,850 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆ పనుల్లో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందని ఇంజినీరింగ్ నిపుణులు ఎత్తి చూపుతున్నారు. » తాజాగా టెండర్లు పిలిచిన పనులనూ అస్మదీయ సంస్థకు కట్టబెట్టి.. భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోచిపెట్టి.. నీకింత నాకింత అంటూ పంచుకుతినేందుకు ముఖ్య నేత సిద్ధమయ్యారని ఆరోపిస్తున్నారు. అందుకే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ పద్ధతిలో లైనింగ్ చేసినా టెండర్లో బిడ్ దాఖలు చేసేందుకు అర్హత ఉంటుందని నిబంధన పెట్టారని స్పష్టం చేస్తున్నారు. -
‘పాలమూరు’ అంచనాల పెంపు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–3 కింద నార్లాపూర్ రిజర్వాయర్, ఏదుల రిజర్వాయర్ మధ్య 8.32 కి.మీ.ల ఓపెన్ కాల్వ నిర్మాణం పనుల అంచనాల పెంపు ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. అంచనాలను రూ.416.1 కోట్ల నుంచి రూ.780.63 కోట్లకు సవరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఎస్ ఘన్పూర్ రిజర్వాయర్ ప్రధాన కాల్వను 12.65– 31.2 కి.మీ.ల మధ్య రూ.148.76 కోట్ల అంచనాలతో లైనింగ్ చేసేందుకు గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. రూ.153 కోట్లతో రొల్లవాగు చెరువు సామర్థ్యం పెంపు పనులకు కూడా ఓకే చెప్పింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీలకు తగ్గిస్తూ, ఆ మేరకు రూ.574.56 కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతిచ్చింది. గతంలో ఈ పనులను రూ.860.25 కోట్లతో చేపట్టేందుకు పరిపాలనపర అనుమతులివ్వగా, రిజర్వాయర్ సామర్థ్యం పెంపును వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంది. తొలుత ఈ రిజర్వాయర్‌ను 9.8 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించగా, ఆ తర్వాత 4.8 టీఎంసీలకు, తాజాగా 1.41 టీఎంసీలకు తగ్గించారు. సీతారామపై మంత్రుల మధ్య సంవాదం !సీతారామ ఎత్తిపోతల పథకం–సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు అంచనాలు సవరించే అంశంపై ఇద్దరు మంత్రుల మధ్య సంవాదం జరిగినట్టు తెలిసింది. ప్రాజెక్టు అంచనాలను రూ.13,057 కోట్ల నుంచి రూ.19,324 కోట్లకు పెంచాలనే ప్రతిపాదనలపై వాడీవేడి చర్చ జరిగింది. దీంతో ఈ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించకుండా, రాష్ట్ర ఆర్థిక శాఖ పరిశీలనకు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో దీనిని రాజీవ్‌సాగర్/ఇందిరాసాగర్ ప్రాజెక్టుగా ప్రతిపాదించగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుగా రీ ఇంజనీరింగ్ చేసిందంటూ ఓ మంత్రి తప్పుబట్టినట్టు తెలిసింది. 67.5 టీఎంసీల గోదావరి జలాలను తరలించి ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 4.15 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 3.89 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిన నేపథ్యంలో మళ్లీ పాత పథకాల ప్రస్తావన అనవసరమని మరో మంత్రి బదులిచ్చినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘంలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ నుంచి అనుమతుల కోసం చేస్తున్న ప్రయత్నాలు చివరి దశలో ఉన్నాయని, మళ్లీ పాత ప్రాజెక్టులను తెరపైకి తెచ్చి సమస్యను జటిలం చేయవద్దంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. రూ.7,926.14 కోట్ల అంచనాలతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి 2016 ఫిబ్రవరి 18న గత ప్రభుత్వం పరిపాలనపర అనుమతులు జారీ చేయగా, 2018లో అంచనాలను రూ.13,057 కోట్లకు పెంచింది. -
పదేళ్లుగా సాగుతున్న పీబీసీ ఆధునికీకరణ పనులు
- లైనింగ్ కాలువలో పెరిగిన కంపచెట్లు - నీరు రాకముందే కొన్ని ప్రాంతాల్లో దెబ్బతిన్న లైనింగ్‌లు పులివెందుల రూరల్ : దాదాపు పదేళ్ల నుంచి పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ) ఆధునీకరణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 2006లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పీబీసీ ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు వీలుగా కాలువల ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. పీబీసీ ఆయకట్టు పరిధిలో కాలువలు 68కి.మీ ఉండగా.. 55,579ఎకరాల ఆయకట్టు పరిధి ఉంది. ఈ పరిధిలో మొత్తంగా మూడు ప్యాకేజీలుగా విభజించి పనులు ప్రారంభించారు. 93 ప్యాకేజీలో తుంపెర డీప్‌కట్, బైపాస్ చానెల్, మెయిన్ కెనాల్లు కలిసి 23.2కి.మీ ఆధునీకరణ కోసం రూ32.69కోట్ల నిధులు మంజూరు కాగా.. ఇప్పటివరకు రూ28.08కోట్లు చేయగా.. 12.50శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అదేవిధంగా 92ప్యాకేజీలో 33కి.మీ నుంచి 68కిలోమీటరు వరకు కాలువలు లైనింగ్ వేయాల్సి ఉంది. ఇందుకు రూ44.04కోట్ల నిధులు మంజూరు కాగా.. దాదాపు రూ43.41కోట్లు ఖర్చు చేయగా.. 1.5శాతం పనులు మిగిలిపోయాయి. 93బిలో రూ73.06కోట్లు మంజూరు కాగా.. రూ55.47కోట్లు పనులు చేయడంతో 24.1శాతం పనులు నిలిచిపోయాయి. 92ఏలో రూ55.77కోట్లకు రూ30.73కోట్లు ఖర్చు చేయగా.. 32శాతం పనులు, 93ఏలో రూ38.81కోట్లకు రూ18.91కోట్లు చేయడంతో 50శాతం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. లైనింగ్ వేసిన కాలువల్లో మొలిచిన కంపచెట్లు : కాలువలను అధునీకరణలో భాగంగా కాలువలకు లైనింగ్ వేసిన నీరు సక్రమంగా రాకపోవడం, కాలువల సమీపంలోని పొలాలనుంచి మట్టి కోతకు గురి కావడంతో కాలువల్లో మట్టి రాళ్లతో ఉన్నాయి. దీంతో కాలువల్లో కంపచెట్లు పెరిగిపోయాయి. 6-8కి.మీ మధ్యలో అనంతపురం జిల్లా వెంకటాంపల్లె వద్ద కాలువలు లైనింగ్ వీసే సమయంలో పైనుంచి మట్టి జారిపడుతుండటంతో పనులు చేసేందుకు 6నెలల క్రితం ఎక్స్‌ఫర్ట్ కమిటీ పరిశీలన చేసిన పనులు ప్రారంభానికి నోచుకోలేదు. దెబ్బతింటున్న లైనింగ్‌లు.. : పీబీసీ కాలువల ఆధునీకరణలో భాగంగా పాలూరు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పరిధిలో ఏర్పాటు చేసిన లైనింగ్‌లు చాలాచోట్ల దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల భూమి కోతకు గురి కావడంతో కాలువల రంథ్రాలు పడ్డాయి. నీరు రాకముందే దెబ్బతింటుండటంతో రైతులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరలో పెండింగ్ పనులకు టెండర్లు పిలిచే అవకాశం : పీబీసీ ఆధునీకరణలో భాగంగా పెండింగ్‌లో ఉన్న పనులకు సంబంధించి నివేదికలను ఉన్నతాధికారులకు పంపించాం. పెండింగ్‌లో ఉన్న పనులను తిరిగి టెండర్లకు పిలిచి పనులు చేయిస్తాం. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలన్నదే లక్ష్యం. - కిరణ్ కుమార్(పీబీసీ ఈఈ), పులివెందుల


