దాదాపు పదేళ్ల నుంచి పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ) ఆధునీకరణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
- లైనింగ్ కాలువలో పెరిగిన కంపచెట్లు
- నీరు రాకముందే కొన్ని ప్రాంతాల్లో దెబ్బతిన్న లైనింగ్లు
పులివెందుల రూరల్ :
దాదాపు పదేళ్ల నుంచి పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ) ఆధునీకరణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 2006లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పీబీసీ ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు వీలుగా కాలువల ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. పీబీసీ ఆయకట్టు పరిధిలో కాలువలు 68కి.మీ ఉండగా.. 55,579ఎకరాల ఆయకట్టు పరిధి ఉంది. ఈ పరిధిలో మొత్తంగా మూడు ప్యాకేజీలుగా విభజించి పనులు ప్రారంభించారు. 93 ప్యాకేజీలో తుంపెర డీప్కట్, బైపాస్ చానెల్, మెయిన్ కెనాల్లు కలిసి 23.2కి.మీ ఆధునీకరణ కోసం రూ32.69కోట్ల నిధులు మంజూరు కాగా.. ఇప్పటివరకు రూ28.08కోట్లు చేయగా.. 12.50శాతం పనులు పెండింగ్లో ఉన్నాయి.
అదేవిధంగా 92ప్యాకేజీలో 33కి.మీ నుంచి 68కిలోమీటరు వరకు కాలువలు లైనింగ్ వేయాల్సి ఉంది. ఇందుకు రూ44.04కోట్ల నిధులు మంజూరు కాగా.. దాదాపు రూ43.41కోట్లు ఖర్చు చేయగా.. 1.5శాతం పనులు మిగిలిపోయాయి. 93బిలో రూ73.06కోట్లు మంజూరు కాగా.. రూ55.47కోట్లు పనులు చేయడంతో 24.1శాతం పనులు నిలిచిపోయాయి. 92ఏలో రూ55.77కోట్లకు రూ30.73కోట్లు ఖర్చు చేయగా.. 32శాతం పనులు, 93ఏలో రూ38.81కోట్లకు రూ18.91కోట్లు చేయడంతో 50శాతం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.
లైనింగ్ వేసిన కాలువల్లో మొలిచిన కంపచెట్లు :
కాలువలను అధునీకరణలో భాగంగా కాలువలకు లైనింగ్ వేసిన నీరు సక్రమంగా రాకపోవడం, కాలువల సమీపంలోని పొలాలనుంచి మట్టి కోతకు గురి కావడంతో కాలువల్లో మట్టి రాళ్లతో ఉన్నాయి. దీంతో కాలువల్లో కంపచెట్లు పెరిగిపోయాయి. 6-8కి.మీ మధ్యలో అనంతపురం జిల్లా వెంకటాంపల్లె వద్ద కాలువలు లైనింగ్ వీసే సమయంలో పైనుంచి మట్టి జారిపడుతుండటంతో పనులు చేసేందుకు 6నెలల క్రితం ఎక్స్ఫర్ట్ కమిటీ పరిశీలన చేసిన పనులు ప్రారంభానికి నోచుకోలేదు.
దెబ్బతింటున్న లైనింగ్లు.. :
పీబీసీ కాలువల ఆధునీకరణలో భాగంగా పాలూరు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పరిధిలో ఏర్పాటు చేసిన లైనింగ్లు చాలాచోట్ల దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల భూమి కోతకు గురి కావడంతో కాలువల రంథ్రాలు పడ్డాయి. నీరు రాకముందే దెబ్బతింటుండటంతో రైతులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో పెండింగ్ పనులకు టెండర్లు పిలిచే అవకాశం :
పీబీసీ ఆధునీకరణలో భాగంగా పెండింగ్లో ఉన్న పనులకు సంబంధించి నివేదికలను ఉన్నతాధికారులకు పంపించాం. పెండింగ్లో ఉన్న పనులను తిరిగి టెండర్లకు పిలిచి పనులు చేయిస్తాం. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలన్నదే లక్ష్యం.
- కిరణ్ కుమార్(పీబీసీ ఈఈ), పులివెందుల