ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్.. త్వరలో మొట్టమొదటి ట్రిలియనీర్ కానున్నారు. టెస్లా కంపెనీ నుంచి ఆయనకు ట్రిలియన్ డాలర్ల వేతనం అందించడానికి.. కంపెనీ వాటాదారులలో 75 శాతం కంటే ఎక్కువ మంది అంగీకరించారు. రానున్న దశాబ్దంలో.. టెస్లా అనుకున్న లక్ష్యాలను చేరుకుంటే.. భారీ ప్యాకేజీ అందుతుందని వారు షరతులు పెట్టారు.
గరిష్ట వేతన ప్యాకేజీ అందుకోవాలంటే మస్క్ కొన్ని లక్ష్యాలను సాధించాల్సి ఉంటుంది. ఇందులో 2 కోట్ల వాహనాలు, 10 లక్షల రోబోటాక్సీలు, 10 లక్షల హ్యూమనాయిడ్ రోబోట్ల విక్రయించాలి. కంపెనీ సుమారు 400 బిలియన్ డాలర్ల స్థూల లాభాన్ని పొందాలి. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే, మార్కెట్ విలువ ప్రస్తుత 1.5 ట్రిలియన్ డాలర్ల నుంచి 8.5 ట్రిలియన్ డాలర్లకు చేరాలి.
ఎలాన్ మస్క్ ప్యాకేజీ.. 2018లో తీసుకున్న ప్యాకేజీతో పోలిస్తే సుమారు 18 రెట్లు ఎక్కువ (56 బిలియన్ డాలర్లు). కాగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ ప్రస్తుత నికర విలువ దాదాపు 460 బిలియన్ డాలర్లు. ఈయన టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్ఏఐల ద్వారా ఎక్కువ ఆర్జిస్తున్నారు.
మైక్రోసాఫ్ట్, యాపిల్ సీఈఓల వేతనాలు భారీగా ఉన్నప్పటికీ.. మస్క్ వేతనంతో పోలిస్తే చాలా తక్కువ అని తెలుస్తుంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల సీఈఓల వేతనాల విషయానికి వస్తే..
➤సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్): 79.1 మిలియన్ డాలర్లు
➤టిమ్ కుక్ (యాపిల్): 74.6 మిలియన్ డాలర్లు
➤జెన్సన్ హువాంగ్ (ఎన్విడియా): 49.9 మిలియన్ డాలర్లు
➤డేవిడ్ రిక్స్ (ఎలీ లిల్లి): 29.2 మిలియన్ డాలర్లు
➤మార్క్ జుకర్ బర్గ్ (మెటా): 27.2 మిలియన్ డాలర్లు
➤సుందర్ పిచాయ్ (ఆల్ఫాబెట్): 10.7 మిలియన్ డాలర్లు
➤హాక్ టాన్ (బ్రాడ్ కామ్): 2.6 మిలియన్ డాలర్లు
➤ఆండీ జస్సీ (అమెజాన్): 1.6 మిలియన్ డాలర్లు
➤వారెన్ బఫెట్ (బెర్క్‌షైర్ హాత్‌వే): 4 లక్షల డాలర్లు
ఇదీ చదవండి: భారత్ వైపు జపాన్ చూపు: 2030 నాటికి..


