టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 600 బిలియన్ డాలర్ల (రూ. 54.56 లక్షల కోట్లు) నికర విలువ కలిగిన మొదటి వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు. స్పేస్‌ఎక్స్ 800 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో పబ్లిక్‌గా (ఐపీఓ) వచ్చే అవకాశం ఉందనే వార్తలు వెలువడిన వెంటనే.. మస్క్ నికర విలువ ఒక రోజులో 168 బిలియన్ డాలర్లు పెరిగింది.
స్పేస్‌ఎక్స్ సీఈఓ ఇప్పటికే.. ఈ ఏడాది అక్టోబర్‌లో 500 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటారు. కాగా ఇప్పుడు ఈయన సంపద 600 బిలియన్ డాలర్లకు చేరింది. స్పేస్‌ఎక్స్‌లో మస్క్ 42 శాతం వాటాను కలిగి ఉండటం వల్ల.. సంపద ఒక రోజులోనే భారీగా పెరిగిపోయింది. ఇది అనేక దేశాల GDP కంటే ఎక్కువ. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా.. మస్క్ తన స్థానాన్ని మరోమారు సుస్థిరం చేసుకున్నారు.
స్పేస్‌ఎక్స్ మాత్రమే కాదు, ఎలాన్ మస్క్ తన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాలో దాదాపు 12% వాటాను కలిగి ఉన్నారు. ఇది కూడా ఈయన సంపదను పెంచడంలో దోహదపడింది. టెస్లాలో మస్క్ వాటా ఇప్పుడు దాదాపు 197 బిలియన్ డాలర్లుగా ఉంది.
మార్చి 2020లో, టెస్లా సీఈఓ సంపద 24.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తరువాత జనవరి 2021లో దాదాపు 190 బిలియన్ డాలర్ల నికర విలువతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. అయితే.. మస్క్ సంపద పెరుగుదల అక్కడితో ఆగలేదు, ఎందుకంటే ఆయన నికర విలువ డిసెంబర్ 2024లో 400 బిలియన్ డాలర్లకు, అక్టోబర్‌లో 500 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు తాజాగా 600 బిలియన్ డాలర్ల మార్క్ దాటింది.


