ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్‌తో పెరిగిపోతున్న డేటా సెంటర్ల అవసరాలను తీర్చడానికి సరికొత్త ప్రణాళికతో అల్ఫాబెట్ (గూగుల్) ముందుకు వచ్చింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంతరిక్షంలో సోలార్ ఎనర్జీతో నడిచే ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గూగుల్ దీనికి ‘ప్రాజెక్ట్ సన్‌క్యాచర్’(Project Suncatcher)గా పేరు పెట్టింది.
ఈ ప్రాజెక్టు గురించి పిచాయ్ మాట్లాడుతూ ‘గూగుల్‌లో మూన్ షాట్‌లు తీసుకోవడం ఎప్పుడూ గర్వకారణం. ఏదో ఒకరోజు అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా సూర్యుడి నుంచి ఎనర్జీని మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు అనేదే మా ప్రస్తుత మూన్ షాట్’ అని తెలిపారు. సూర్యుడి నుంచి లభించే అపార శక్తిని (భూమిపై కంటే అంతరిక్షంలో అధిక ఎనర్జీ ఉంటుంది) ఉపయోగించి స్పేస్‌లో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. దీనివల్ల భూమిపై డేటా సెంటర్ల ఏర్పాటులోని సమస్యలను పరిష్కరించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.
2027లో తొలి పరీక్షలు
ఈ అంతరిక్ష డేటా సెంటర్ల ప్రయాణంలో గూగుల్ ప్లానెట్ ల్యాబ్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘మేము 2027లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మొదటి అడుగు వేస్తాం. చిన్న యంత్రాల ర్యాక్‌లను శాటిలైట్‌ల్లో పంపి పరీక్షిస్తాం. ఆ తర్వాత స్కేలింగ్ ప్రారంభిస్తాం’ అని పిచాయ్ ప్రకటించారు. భవిష్యత్తులో ఈ అంతరిక్ష డేటా సెంటర్లు సాధారణ మార్గంగా మారతాయని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ఎక్స్ ప్లాట్‌ఫాంమ్‌లో వైరల్ అయింది. దాంతో టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ దృష్టిని ఇది ఆకర్షించింది. ఈ ఇంటర్వ్యూపై మస్క్ కేవలం ‘ఆసక్తికరమైనది (Interesting)’ అనే ఒక్క పదంతో స్పందించారు.
Interesting https://t.co/yuTy9Yr3xw
— Elon Musk (@elonmusk) December 8, 2025
ఇదీ చదవండి: విస్తరణపై ఉన్న ఆసక్తి సమస్యల పరిష్కారంపై ఏది?


