క్షిపణి దాడుల బీభత్సం: కువైట్ ఎయిర్‌పోర్ట్ మూసివేత | Kuwait Diverts Flights Amid Fears of Iranian Attacks | Sakshi
Sakshi News home page

క్షిపణి దాడుల బీభత్సం: కువైట్ ఎయిర్‌పోర్ట్ మూసివేత

Jun 11 2026 1:08 PM | Updated on Jun 11 2026 1:27 PM

Kuwait Diverts Flights Amid Fears of Iranian Attacks

కువైట్‌ సిటీ: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న శత్రుత్వం గల్ఫ్ ప్రాంతాన్ని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. దీంతో కువైట్ దేశం తన గగనతలాన్ని అత్యవసరంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. గురువారం తెల్లవారుజామున 4:50 గంటల నుండి విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ వైమానిక దాడులు, పౌర విమానయాన రక్షణను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

క్షిపణులను అడ్డుకున్న కువైట్ ఎయిర్ డిఫెన్స్
గగనతలంలో ముంచుకొస్తున్న ముప్పును కువైట్ సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. తమ దేశ రక్షణ వ్యవస్థలు గగనతలంలో శత్రు లక్ష్యాలను  గుర్తించి, వాటిని విజయవంతంగా తిప్పికొడుతున్నాయని కువైట్ జనరల్ స్టాఫ్ ఆఫ్ ది ఆర్మీ ‘ఎక్స్‌’ వేదికగా తెలిపింది.  ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగి, ప్రమాదం తప్పిందని నిర్ధారించుకున్నాకే మళ్లీ విమాన రాకపోకలను పునరుద్ధరిస్తామని కువైట్ సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ ప్రకటించింది. ప్రజలు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరింది.

బహ్రెయిన్, కువైట్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యం
గత మూడు నెలలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చలను ఇరాన్ కావాలనే ఆలస్యం చేస్తోందని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిచర్యగా అమెరికా దళాలు ఇరాన్‌పై సరికొత్త దాడులకు దిగాయి. దీంతో ఆగ్రహించిన ఇరాన్.. కువైట్, బహ్రెయిన్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులకు తెగబడింది. అంతేకాకుండా అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధిని’ పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో గల్ఫ్‌లో యుద్ధ వాతావరణం ముదిరింది.

అంతర్జాతీయంగా చమురు సెగ
రెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ ప్రతీకార దాడుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్ తమతో మైండ్ గేమ్ ఆడుతోందని, దీనికి వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. అటు అమెరికా సెంట్రల్ కమాండ్ సైతం ఇరాన్ దుశ్చర్యలకు దీటుగా ఆత్మరక్షణ దాడులను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇరు దేశాల దూకుడుతో గల్ఫ్ రీజియన్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement