‘ఏం చేద్దామనుకున్నాడో’.. కెనడాను ఊపేస్తున్న పైలట్ మోసం! | Canadian Pilot Accused Of Flying 900+ Flights Without Proper Captain License, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

‘ఏం చేద్దామనుకున్నాడో’.. కెనడాను ఊపేస్తున్న పైలట్ మోసం!

Jun 11 2026 9:35 AM | Updated on Jun 11 2026 11:33 AM

Air Canada Captain Flew 900 Flights in 17 Year Fraud

ఒట్టావా: ఏకంగా 17 సంవత్సరాల పాటు, కనీసం లైసెన్స్ కూడా లేకుండానే వందలాది ప్రయాణికులతో విమానాలను నడిపాడు ఓ ఎయిర్ కెనడా కెప్టెన్. హాలీవుడ్ సినిమా కథను తలపించే ఈ షాకింగ్ ఉదంతాన్ని కెనడా పోలీసులు బయటపెట్టారు. జెఫ్రీ వాల్ అనే మాజీ పైలట్, కెప్టెన్‌కు ఉండాల్సిన ‘ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్ ఫర్ ఏరోప్లేన్స్’ లేకుండానే 2009 నుండి 2025 వరకు ఏకంగా 900 కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడిపినట్లు విచారణలో తేలింది. జూన్  ఒకటిన అతడిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన పోలీసులు, ఈ కేసు పూర్తిగా ఒక సినిమా స్క్రిప్ట్‌లా ఉందని వ్యాఖ్యానించారు.

సినిమాను మించిన విమాన మోసం
ఈ సుదీర్ఘ  కాలంలో జెఫ్రీ వాల్ బోయింగ్ 767, 777, 787 తదితర భారీ ప్రయాణికుల విమానాలను నడిపాడు. పదివేల మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను గాల్లో ఉంచిన ఈయన, కెప్టెన్‌గా దాదాపు మూడు మిలియన్ కెనడియన్ డాలర్ల (సుమారు రూ. 25 కోట్లకు పైగా) జీతాన్ని కూడా అందుకున్నాడు. 2002 నాటి ప్రసిద్ధ హాలీవుడ్ చిత్రం ‘క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్’ తరహాలోనే ఈ ఉదంతం సాగిందని పీల్ రీజినల్ పోలీస్ డిప్యూటీ చీఫ్ మిలినోవిచ్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

సర్జరీ చేసిన జనరల్ డాక్టర్‌లా..
అయితే, జెఫ్రీ వాల్ పూర్తిగా విమానయాన పరిజ్ఞానం లేనివాడేమీ కాదు. ఎయిర్ కెనడాలో అతని 27 ఏళ్ల కెరీర్‌లో కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉంది. కానీ 2009లో కెప్టెన్‌గా ప్రమోషన్ పొందినప్పుడు కావాల్సిన ఉన్నత స్థాయి లైసెన్స్ మాత్రం అతనికి లేదు. ‘ఇది ఫ్యామిలీ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే అర్హత ఉన్న డాక్టర్, ఏకంగా బ్రెయిన్ సర్జరీ చేసినట్లుంది’ అని మిలినోవిచ్ ఉదహరించారు. నిందితుడు తన నకిలీ పత్రాలతో అటు ఎయిర్‌లైన్స్‌ను, ఇటు రెగ్యులేటర్లను మోసం చేశాడని స్పష్టం చేశారు.

ఇలా దొరికిపోయాడు..
2025లో జరిగిన సాధారణ సర్టిఫికేట్ తనిఖీల్లో ఈ లైసెన్స్ అవకతవకలు బయటపడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ‘ప్రాజెక్ట్ ఇకారస్’ పేరుతో విచారణ ప్రారంభించక ముందే ఈ ఏడాది ప్రారంభంలో వాల్ రిటైర్ అయ్యాడు. కాగా పైలట్లకు ప్రతి ఆరు నెలలకు కఠిన శిక్షణ, తనిఖీలు ఉంటాయని, అందువల్ల ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని ఎయిర్ కెనడా తెలిపింది. ప్రస్తుతం నిందితుడిపై మోసం, నకిలీ పత్రాల సృష్టితో సహా 7 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. జూన్ 29, 2026 న అతడు కోర్టుకు హాజరుకానున్నాడు.

ఇది కూడా చదవండి: ఎత్తయిన ఏనుగుపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement