నటిగా కెరీర్ ప్రారంభించి, వ్యాపారవేత్తగా అవతరించిన పరుల్ గులాటికి స్వయంగా తన ఉద్యోగులనుంచే భారీ షాక్ తగిలింది. తనను తాను ముద్దుగా మల్కిన్ అని పిలుచుకునేఈ అమ్మడు ప్రముఖ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ బ్రాండ్ 'నిష్ హెయిర్' అధినేత. తాజాగా బెంగళూరు కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగుల చేతిలో మోసపోయానని వాపోయారు. ఈ సందర్బంగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో రోజంతా గడిపినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు.
ఏం జరిగిందంటే...
పరుల్ గులాటి తన బ్రాండ్ 'నిష్ హెయిర్' (Nish Hair) బెంగళూరు శాఖలో జరిగిన భారీ మోసం గురించి ఇన్‌స్టాలో చెప్పుకొచ్చారు. దీని ప్రకారం నిష్ హెయిర్ ఉత్పత్తులను వినియోగదారులకు అమ్మి, వచ్చిన డబ్బును వారి వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారు. ఇది తెలుసుకున్న తర్వాత, ఆమె బెంగళూరులోని ఒక పోలీస్ స్టేషన్‌లో రోజంతా గడపవలసి వచ్చిందని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. స్టోర్ మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఫొటోలను షేర్ చేస్తూ.. బెంగళూరు స్టోర్‌లో ఏదో తప్పు జరుగుతోందని తనకు ముందే అనుమానం వచ్చిందని, దీంతో తాను అకస్మాత్తుగా స్టోర్‌ను సందర్శించినప్పుడు అసలు నిజాలు బయటపడ్డాయని పరుల్ పేర్కొన్నారు. అలాగే సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న యువతికి స్టోర్ సీసీటీవీ యాక్సెస్ ఉందని అందుకే తాను బెంగళూరు వస్తున్న విషయం తెలుసుకుని, తాను రాకముందే ఒంట్లో బాగోలేదంటూ సెలవు పెట్టి తప్పించుకుంది.
ఇలా రోజుకు దాదాపు రూ.15,000 నుండి రూ. 20 వేల దాకా నొక్కేశారు. పరుల్ వచ్చిన రోజు డ్యూటీలో ఉన్న స్టోర్ మేనేజర్‌ను నిలదీయడంతో అతను మోసం చేసినట్లు అంగీకరించాడు. ఉద్యోగంలో చేరిన మొదటి నెల మొత్తం బిజినెస్ ఎలా నడుస్తుందో అర్థం చేసుకున్నానని, రెండో నెల నుంచే ఈ మోసానికి తెరలేపానని అతను ఒప్పుకున్నట్లు పరుల్ చెప్పారు.
రూ.10 లక్షల స్టాక్ మాయం
గత నెలలో తమ ఇన్వెంటరీ (స్టాక్) లెక్కలు చూసినప్పుడు దాదాపు రూ.10 లక్షల విలువైన ప్రొడక్ట్స్ తక్కువగా ఉన్నట్లు గుర్తించామని పరుల్ చెప్పారు. 'షాపిఫై' (Shopify) యాప్‌లో లెక్కలు సరిచేస్తున్నట్లు కనిపించినా, తాను పంపిన అసలు స్టాక్‌కు, అమ్మకాలకు పొంతన కుదరక పోవడంతో అనుమానం బలపడిందని అన్నారు. తన ప్రొడక్ట్స్‌ని, ప్యాకేజింగ్‌నువాడుకొని, తనను, తన కస్టమర్లను కూడా మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీ
పరుల్ గులాటి విజ్ఞప్తి
ప్రస్తుతానికి కేవలం గత 6 నెలల కాలానికి సంబంధించిన ఆధారాలు మాత్రమే తన వద్ద ఉన్నాయని పరుల్ తెలిపారు. మేనేజర్ ఒక్కడే దాదాపు రూ.8 లక్షల వరకు కాజేసినట్లు ఒప్పుకున్నాడని, ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్ యువతి మాత్రం ప్రస్తుతం పరారీలో ఉందని పేర్కొన్నారు. పోగొట్టుకున్న డబ్బు తిరిగొస్తుందనే నమ్మకం తనకు లేదని, కానీ ఇలాంటి మోసగాళ్లను ఎవరూ కూడా ఉద్యోగాల్లోకి తీసుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని బయటపెడుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలోఅప్రమత్తంగా ఉండాలని తన కస్టమర్లకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్‌కు ఫౌండర్!


