రాజస్థాన్‌లోని ఒక చిన్న గ్రామం నుండి ఆల్ ఇండియా 23వ ర్యాంకు వరకు డాక్టర్ సునీతా జాట్ జీవిత ప్రయాణం, సాధించిన అసాధారణ విజయం ఎంతోమందికి స్పూర్తిదాయకం. రాజస్థాన్‌లోని ఒక చిన్న గ్రామం నుండి UPSC CMS పరీక్షలో ఆల్ ఇండియా 23వ ర్యాంక్ సాధించే వరకు సునీత ప్రయాణం అంత ఆషామాషీగా ఏమీ సాగలేదు. వ్యక్తిగత విషాదాలు, సామాజిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలను ఎదుర్కొని తన ఆశయాన్ని సాధించన ధీర మహిళ ఆమె.
రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా ‘సువానా’ అనే చిన్న గ్రామంలో సునీత జన్మించారు. ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేసి వంటింటికే పరిమితం చేయాలనే ఆలోచనలున్న ఆ ఊరిలో, సునీత తండ్రి మాత్రం భిన్నంగా ఆలోచించారు. బంధువులు, చుట్టుపక్కల వారి మాటలను పక్కనపెట్టి, ఆయన సునీతను డాక్టర్ చదివించడం కోసం కోటా పంపారు. ఆమె మెడికల్ ఎంట్రన్స్ పాసై, BAMS (ఆయుర్వేద వైద్యం) కాలేజీలో చేరారు.
కానీ దురదృష్టం ఏమిటంటే ఆమె చదువుకుంటున్న రోజుల్లోనే సునీత తండ్రి అకస్మాత్తుగా మరణించారు. ఆ వార్తతో ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి వెళ్లిపోయారు సునీత. కానీ,అంతలోనే తేరుకుని, ధైర్యం తెచ్చుకుని, తన కోసం తండ్రి చేసిన త్యాగాలను గుర్తుచేసుకుని, డిగ్రీని విజయవంతంగా BAMS పూర్తి చేశారు.
ఇదీ చదవండి: షాకింగ్ : భారతీయ నావికుడి బాడీలో అవయవాలన్నీ మాయం!
పెళ్లి తరువాత ఒత్తిడి
చదువు పూర్తయ్యాక, దేశానికి సేవ చేయాలనే తన ఆశయాన్ని పెళ్లికి ముందే భర్తకు, అత్తమామలకు స్పష్టంగా చెప్పారు. వారు మొదట ఒప్పుకున్నా, పెళ్లయ్యాక మాత్రం సునీతను ఉద్యోగం చేయనివ్వకుండా వంటింటికే పరిమితం కావాలని ఒత్తిడి తెచ్చారు. అయినే ఇంటి నుంచే పనిచేస్తూ వచ్చింది. అదే సమయంలో సునీత గర్శం దాల్చింది. దీన్నిసాకుగా చూపి సరిగ్గా ఆమె ఆరు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు, ఉద్యోగమైనా వదులుకో.. లేదా సంసారమైనా వదులుకో అంటూ పెద్ద ఛాలెంజ్ విసిరారు అత్తింటి వారు. గర్భవతిగా ఉన్న సమయంలోనే ఒంటరిగా ఆ ఇంటి నుండి బయటకు వచ్చేశారు.
ఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్
2023 ఏప్రిల్ 20న, ఆమె భర్త ఆమెను వాళ్ళ అమ్మానాన్నల ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు. సునీత చెప్పిన ప్రకారం, ఆ రోజు తర్వాత అతను ఆమెను బ్లాక్ చేశాడు. ఎలాంటి కాల్స్ లేవు, మెసేజ్‌లు లేవు, ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం లేదు, ఏమీ లేదు. దీంతో తండ్రి, తన ఆశయ సాధన కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. సునీత తన ఆత్మగౌరవాన్ని, దేశానికి సేవచేయాలనే కల సాకారంకోసం కట్టుబడి ఉండేలా నిర్ణయించుకున్నారు.
ఒంటరి తల్లిగా పోరాటం
ఒక పక్క విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరగడం, చిన్న బిడ్డను పెంచడం, మరోపక్క సమాజం నుండి ఎదురైన సూటిపోటి మాటల వల్ల సునీత మళ్లీ తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యారు. ఆ సమయంలో ఆమె తల్లి కొండంత అండగా నిలిచారు. తల్లి బిడ్డను చూసుకుంటుంటే, సునీత రాత్రుళ్లు బాబును ఒడిలో పడుకోబెట్టుకుని గంటల తరబడి UPSC పరీక్ష కోసం చదివేవారు. ఆమె నిరంతర శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. కేంద్ర ప్రభుత్వ వైద్య సేవల రిక్రూట్‌మెంట్ (UPSC CMS) ఫలితాలు వచ్చినప్పుడు ఆమె ఏకంగా ఆల్ ఇండియా 23వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ఆమె దేశానికి సేవలందిస్తూ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
"జీవితంలో పెద్దగా ఏదైనా సాధించాలనుకుంటే, ముందు మీకంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలి. సమస్యలను చూసి భయపడితే లాభం లేదు. వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి. కష్టపడితే ఎప్పటికైనా ఫలితం ఉంటుంది. దారి కష్టంగా ఉన్నా, పట్టుదల ఉంటే విజయం మీ సొంతమవుతుంది." అంటారామె.


