రాంపూర్: భార్యకు మర్మాంగాలతో పాటు శరీరంలోని పలు భాగాలకు విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేశాడు భర్త. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదమే ఆ మహిళ దారుణ హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు.
నస్రీన్ పోస్టుమార్టం నివేదికలో ఆమె శరీరంపై పలు కాలిన గాయాలు ఉన్నట్లు తేలింది. మర్మాంగాలపై కూడా కాలిన గాయాలు ఉండగా, అవి విద్యుత్ షాక్ వల్ల ఏర్పడినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితుడు ఇస్రార్ నేరాన్ని అంగీకరించాడు. తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో కొంత భాగాన్ని విక్రయించేందుకు భార్య నిరాకరించడంతో ఆమెపై కోపం పెంచుకున్నానని దర్యాప్తు అధికారులకు చెప్పాడు.
నస్రీన్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ భూమిని విక్రయిస్తే తమ ఐదుగురు పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆమె భయపడింది. నస్రీన్, ఇస్రార్‌లకు దాదాపు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
భూమి వివాదం కారణంగా నస్రీన్‌కు పదేపదే బెదిరింపులు, హింస ఎదురయ్యాయని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన డిమాండ్లకు అంగీకరించకపోతే ఎప్పటికైనా చంపేస్తానని ఇస్రార్ ఆమెను బెదిరించేవాడని వారు తెలిపారు.
నస్రీన్ సోదరి హసీన్ జహాన్ మాట్లాడుతూ.. నస్రీన్ ఇటీవల గాయపడినప్పటికీ, ఆ విషయాన్ని బయటకు చెప్పలేదని తెలిపారు. "ఆమె ఇంటికి పూర్తిగా క్షేమంగా వచ్చింది. కానీ ఆమె ముఖంపై గాయాలు ఉన్నాయి" అని జహాన్ తెలిపారు. తనకు ఏం జరిగిందో నస్రీన్ చెప్పలేదని ఆమె తెలిపారు.
రాంపూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ అనురాగ్ సింగ్ మాట్లాడుతూ.. బాధితురాలి మేనమామ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నస్రీన్ హత్యలో ఆమె అత్తింటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని ఫిర్యాదులో ఆరోపించినట్లు చెప్పారు.
విద్యుత్ షాక్‌ల కారణంగా గాయాలు ఏర్పడినట్లు పోస్టుమార్టం నివేదిక నిర్ధారించిందని అధికారి తెలిపారు. "పోస్టుమార్టం నివేదికలో 6 చోట్ల గాయాలు ఉన్నట్లు తేలింది. అందులో విద్యుత్ షాక్ కారణంగా ఏర్పడిన పలు కాలిన గాయాలు ఉన్నాయి. ఆమె మర్మాంగాలపై కూడా విద్యుత్ షాక్ గాయాలు కనిపించాయి" అని సింగ్ తెలిపారు.


