హైదరాబాద్: నగర యువకుడి చేతిలో బిహార్‌కు చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన మేరకు.. పాటా్నకు చెందిన రెహానా (21) తల్లిదండ్రులతో కలిసి ఒరంగడ్డలోఉంటోంది.
ఫంక్షన్ హాళ్లలో వెయిటర్‌గా పని చేసేది. ఈ క్రమంలోనే ఫంక్షన్ హాళ్లకు ఫిల్టర్ వాటర్ సరఫరా చేసే షాహిన్‌నగర్ బిస్మిల్లా కాలనీకి చెందిన షేక్ అహ్మద్ (21)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తాము పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో రెహానా తండ్రి ఇషాక్ ఆరు నెలల క్రితమే కూతురుఉన వదిలేసి కుటుంబంతో స్వస్థలానికి వెళ్లిపోయారు. నాలుగు నెలల పాటు ప్రేమికులిద్దరూ రహస్యంగా కలిసి ఉన్నట్లు సమాచారం. రెండు నెలలు క్రితం రెహానాను నేరుగా తన ఇంటికి తీసుకెళ్లిన అహ్మద్ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో రెహనా గర్భం దాల్చింది. ప్రస్తుతం రెండునెలల గర్భవతి. దీంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోంది.
ఆదివారం అర్ధరాత్రి కూడా వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆగ్రహానికి గురైన అహ్మద్ కత్తితో రెహానా వీపు భాగంలో విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం తన తల్లి ఆయేషాతో కలిసి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి, మాయం చేసేందుకు పరిచయస్తుల సాయం కోరాడు. విషయం బయటకు రావడంతో స్థానికులు డయల్– 100కు ఫోన్ చేసి, సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్ సుధాకర్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. బెడ్‌రూంలో మూటకట్టి పెట్టిన మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని, క్లూస్ టీమ్‌తో ఆధారాలు, బ్లడ్ శాంపిళ్లను సేకరించారు. పరారీలో ఉన్న తల్లీకొడుకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


