సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ఆటో రిక్షా ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఆటో ఛార్జీల పెంపుపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆటో రిక్షా కొత్త ఛార్జీలను అధికారికంగా ఖరారు చేస్తూ జీవో నంబర్ 46ను జారీ చేసింది. ఈ మేరకు తక్షణమే తదుపరి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ఆదేశించింది.
ఆటోలో ప్రయాణం ప్రారంభించిన తొలి 1.6 కిలోమీటర్లకు గాను కనీస ఛార్జీని రూ.30గా ప్రభుత్వం నిర్ణయించింది. తొలి 1.6 కిలోమీటర్ల తర్వాత ప్రయాణించే ప్రతి అదనపు కిలోమీటర్‌కు రూ.14 చొప్పున వసూలు చేయనున్నారు. ప్రయాణ సమయంలో ట్రాఫిక్ లేదా ఇతర కారణాల వల్ల ఆటో ఆగి ఉన్నప్పుడు నిమిషానికి 75 పైసల చొప్పున వెయిటింగ్ ఛార్జీని ఖరారు చేశారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రయాణించే ప్రయాణికులు సాధారణ ఛార్జీపై అదనంగా 50 శాతం అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
లగేజీ నిబంధనలు ఇవే
ఆటోలో ప్రయాణిం చేటప్పుడు వెంట ఉండే లగేజీకి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచింది. ప్రయాణికుడు తన వెంట సాధారణంగా ఉండే బ్రీఫ్‌కేస్, హ్యాండ్ బ్యాగ్‌లను ఉచితంగా తీసుకెళ్లవచ్చు. వీటి మినహా ఇతర పెద్ద ప్యాకేజీలు, లగేజీ ఉంటే వాటికి కిలోమీటరుకు 50 పైసల చొప్పున అదనపు ఛార్జీ వర్తిస్తుంది.ఆటోలో తీసుకెళ్లే లగేజీ గరిష్ఠ పరిమితిని 100 కిలోలుగా పరిమితం చేశారు.
డిజిటల్ మీటర్ల సవరణకు గడువు
ప్రభుత్వం ఖరారు చేసిన ఈ కొత్త ఛార్జీలకు అనుగుణంగా ఆటోల్లోని డిజిటల్ మీటర్లను సవరించు కోవడానికి ఆటో డ్రైవర్లు,యజమానులకు మూడు నెలల గడువు ఇచ్చారు. అలాగే ప్రయాణికులకు పాత, కొత్త ఛార్జీల వివరాలు స్పష్టంగా తెలిసేలా ఆటోల్లో విధిగా ఫేర్ కార్డులను ప్రదర్శించాలని అధికారులు స్పష్టం చేశారు.


