శంషాబాద్ (హైదరాబాద్): ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఇజ్రాయెల్ విమాన ఘటనతో.. గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయా ఉద్యోగుల ఏజెన్సీలతో పాటు ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. కార్గోతో పాటు ఇతర విభాగాల ఉద్యోగులు ఎలా అప్రమత్తంగా వ్యవహరించాలి? అనుకోని వస్తువుల రవాణాపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అప్రమత్తం చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.
ఎమెర్జెన్సీ డోరు తెరిచేందుకు యత్నం
విమానంలోని అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఎయిర్‌పోర్టు అధికారులు ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి గురువారం ఉదయం కడప బయలుదేరేందుకు సిద్ధమైన విమానంలో.. దినేశ్‌కుమార్ అనే ప్రయాణికుడు అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు యత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. అయినప్పటికీ సదరు ప్రయాణికుడు అదేవిధంగా వ్యవహరించడంతో అతన్ని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించగా కేసు నమోదైంది.
కస్టమ్స్ పథకాలపై 9న కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: ఎగుమతిదారుల కోసం కస్టమ్స్ పథకాలపై అక్టోబర్ 9న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌ఐఈఓ) హైదరాబాద్‌లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఎగుమతిదారులు, తయారీదారులు, ఎంఎస్‌ఎంఈలు, వాణిజ్య భాగస్వాములకు అంతర్జాతీయ వాణిజ్యానికి అందుబాటులో ఉన్న కీలక కస్టమ్స్ పథకాలు, సులభతర చర్యలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రయోజనాలు, అర్హత, విధానాలు, డాక్యుమెంటేషన్, నిబంధనలు పాటించటం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు.
ఇదీ చదవండి: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఒక టికెట్‌తో డబుల్ జర్నీ!
ఎగుమతిదారుల కోసం కస్టమ్స్ సులభతరం చేసే విధానాలపై సమీక్ష, ఎగుమతుల ప్రోత్సాహంలో కస్టమ్స్ పాత్ర, ఐస్‌గేట్, ఎల్రక్టానిక్ కస్టమ్స్ విధానాలు, రిస్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, డ్యూటీ ఫ్రీ దిగుమతి పథకాలు, అడ్వాన్స్ ఆథరైజేషన్, డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్, అర్హత, నిబంధనలు, దరఖాస్తు, డాక్యుమెంటేషన్, ఎక్స్‌పోర్టు ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ (ఈపీసీజీ) పథకంతో పాటు రాయితీ, పన్ను లేకుండా క్యాపిటల్ వస్తువుల దిగుమతి, ఎగుమతి బాధ్యతలు, విధానాలు, నిబంధనల గురించి ఈ కార్యక్రమంలో విస్తృత చర్చలు జరుగుతాయి. హైదరాబాద్ కస్టమ్స్ కమిషనరేట్ సీనియర్ అధికారులు సమగ్రంగా ప్రజెంటేషన్లు ఇస్తారని ఎఫ్‌ఐఈఓ డైరెక్టర్ జనరల్ ఉన్నికృష్ణన్ తెలిపారు.


