నర్సింగ్ విద్యార్థిని కేసులో సంచలన ట్విస్ట్‌ | Bhadradri Kothagudem: Police Solve Mystery Of Nursing Student Case | Sakshi
Sakshi News home page

నర్సింగ్ విద్యార్థిని కేసులో సంచలన ట్విస్ట్‌

Oct 2 2026 11:14 AM | Updated on Oct 2 2026 11:22 AM

Bhadradri Kothagudem: Police Solve Mystery Of Nursing Student Case

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పదేళ్ల ప్రేమకు మధ్యలో ఓ సారి బ్రేక్‌ పడింది. ఆ తర్వాత కలిసినా యువకుడు దురలవాట్లకు బానిసయ్యాడని తెలిసిన నర్సింగ్‌ విద్యార్థిని దూరం పెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న యువకుడు ఆమెను హతమార్చాడు. జూలూరుపాడు మండలం వెంకన్నపాలెంలో గతనెల 22న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించగా వివరాలను జూలూరుపాడులో సీఐ శ్రీలక్ష్మి, ఎస్‌ఐలు ఎన్‌.జీనత్‌కుమార్, విజయసింహారెడ్డితో కలిసి గురువారం కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు.

2016–2017 నుంచి వెంగన్నపాలెంకు చెందిన బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థి హరిణి, పక్కింటికి చెందిన దేవరకొండ పవన్‌కుమార్‌ ప్రేమలో ఉన్నారు. కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం సాఫీగానే కొనసాగగా, 2020లో గ్రామపెద్దల సమక్షాన పంచాయతీ జరగగా వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ కొన్నాళ్లకు పవన్‌ ఆమె వెంట పడి ఒప్పించి ప్రేమ కొనసాగిస్తున్నాడు. ఇటీవల పవన్‌ దురలవాట్లకు బానిసయ్యాడని ఆమె తిరస్కరిస్తూ వచ్చింది. అంతేకాక గతనెల 4వ తేదీన ఆయన ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ చేయడమే కాక ఇన్‌స్టాలో అడ్రస్‌ మార్చింది. ఈక్రమాన హరిణి తనకు దూరమవుతుందని పవన్‌ ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

ఈ క్రమంలో ఇంటికి వచ్చిన ఆమెతో గతనెల 22న మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఆపై ఆమె తల్లి బయటకు వెళ్లడాన్ని ఆసరగా చేసుకుని మాట్లాడతానంటూ హరిణి ఇంటికి వెళ్లాడు. అప్పటికే అనుమానం వచ్చిన తల్లి మరో యువతిని పంపించగా ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. ఈక్రమాన తల్లి వచ్చేలోగా బాత్‌రూమ్‌ వద్ద హరిణి మృతదేహం ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. ఆమె గొంతుపై వైరుతో బిగించి ఉండడం, నుదుటిపై గాయాలు ఉండడం.. ఘటన జరిగిన రోజు నుంచి పవన్‌ కనిపించకుండా పోవడమే కాక ఫోన్‌ స్విచాఫ్‌ కావడంతో ఆయనపైనే అనమానాలు వచ్చాయి.

ఇదీ చదవండి: ప్రకాశం జిల్లాలో ‘ఇరుముడి’ సీన్‌ రిపీట్‌!

హరిణిని హత్య చేశాక బైక్‌ను సీతారామ కాల్వ వద్ద పెట్టిన పవన్‌ బస్సులో వైజాగ్‌ వెళ్లిపోయాడు. అక్కడి నుంచి తిరుపతికి, బుధవారం ఖమ్మం రాగా, గురువారం జూలూరుపాడు చేరుకున్నాడు. అప్పటికే నిఘా వేసిన పోలీసులు ఆయన ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు విచారించగా.. హరిణితో మాట్లాడే క్రమాన ఘర్షణ జరిగిందని, దీంతో తన వద్ద ఉన్న బ్రేక్‌ బైర్‌తో గొంతు బిగించి హతమార్చినట్లు అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి బైక్, హరిణితో పాటు ఆయన ఫోన్‌ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కాగా, కేసును ఛేదించిన సీఐ శ్రీలక్ష్మి, ఎస్సైలు జీనత్‌కుమార్, విజయ సింహారెడ్డి, సిబ్బందిని డీఎస్పీ ఆదినారాయణ అభినందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement