హిజ్రాలు కాదు.. మగవాళ్లే! బీఎండబ్ల్యూ కారు ఆపి మరీ.. | Hyderabad Jubilee Hills Fake Transgenders Extortion Arrest | Sakshi
Sakshi News home page

హిజ్రాలు కాదు.. మగవాళ్లే! బీఎండబ్ల్యూ కారు ఆపి మరీ..

Oct 2 2026 8:05 AM | Updated on Oct 2 2026 8:30 AM

Hyderabad Jubilee Hills Fake Transgenders Extortion Arrest

కారు యజమానికి బెదిరిపులు

డీజీపీ సీరియస్‌ – నలుగురి అరెస్ట్‌

హైదరాబాద్‌: కొత్తగా దుకాణం ప్రారంభమైనా.. కారు కొనుగోలు చేసినా హిజ్రాలు వచ్చి డబ్బు డిమాండ్‌ చేయడం చూస్తుంటాం.. అయితే ఇపుడు నగరంలో అసలు హిజ్రాలు కాకుండా సిటీలో నకిలీ హిజ్రాలు రెచ్చిపోతున్నారు. బెదిరించి.. బలవంతపెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. ఇలా వసూళ్లకు పాల్పడుతున్న నలుగురిని డీజీపీ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. 

జూబ్లీహిల్స్‌ అదనపు ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ తెలిపిన మేరకు.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–45లోని ట్రూ బ్లాక్‌ కాఫీ షాపునకు గత ఆగస్టు 21న ఓ యువకుడు తాను కొత్తగా కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారులో వచ్చాడు. కాఫీ తాగిన తర్వాత బయటకు వచ్చి కారు తీస్తుండగా నలుగురు హిజ్రాలు అడ్డుపడి రూ.5 వేలు డిమాండ్‌ చేశారు. అక్కడే ఉన్న ఓ యూట్యూబర్‌ ఈ దృశ్యాలను వీడియో తీసి ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

డీజీపీ సీవీ ఆనంద్‌ స్పందించి దర్యాప్తు చేయాలని జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆదేశించారు.  పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నెల రోజుల పాటు జూబ్లీహిల్స్‌ నుంచి బోడుప్పల్‌ దాకా సుమారు 500 సీసీ కెమెరాలను పరిశీలించారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సహాయంతో నిందితులను బోడుప్పల్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బోడుప్పల్‌ కాకతీయ కాలానగర్‌కు చెందిన డైలీ వర్కర్‌ రమేష్‌ (40), సత్యనారాయణ (41), రమేష్‌ (42), యాదగిరి (44)లుగా గుర్తించారు.

వీరంతా కొంతకాలంగా హిజ్రాల వేషాలు వేస్తూ దారిలో వెళ్తున్న వారిని అడ్డగించడంతో పాటు గృహప్రవేశం చేస్తున్న ఇళ్ల వద్దకు, కొత్తగా ప్రారంభిస్తున్న షాపుల వద్దకు వెళ్లి డబ్బు డిమాండ్‌ చేస్తున్నట్లుగా తేలింది. మగవాళ్లే  హిజ్రాలుగా వేషాలు వేసి ఈ బెదిరింపులకు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ఈ నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఐ సత్యనారాయణ తెలిపారు.

ఇదీ చదవండి: క్రికెట్‌ బ్యాట్‌తో తలపై కొట్టి.. వడ్డీ వ్యాపారి దారుణ హత్య!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement