ఇళ్లకు భలే గిరాకీ..! | Hyderabad Leads Housing Sales Growth in Q3 2026 anarock report | Sakshi
Sakshi News home page

ఇళ్లకు భలే గిరాకీ..!

Oct 2 2026 5:19 AM | Updated on Oct 2 2026 5:31 AM

Hyderabad Leads Housing Sales Growth in Q3 2026 anarock report

సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 1,00,220 గృహాల విక్రయం

15 శాతం వృద్ధితో హైదరాబాద్‌ అగ్రస్థానం

రూ.1.55 లక్షల కోట్లకు మొత్తం అమ్మకాల విలువ

రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ ‘అనరాక్‌’ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: దేశీయ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఇళ్ల కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో జూలై–సెప్టెంబర్‌ (క్యూ3) త్రైమాసికంలో నివాస గృహాల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 3 శాతం పెరిగి 1,00,220 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే క్యూ3 ఇళ్ల విక్రయాలు 97,080 యూనిట్లుగా నమోదయ్యాయి. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో డిమాండ్‌ బలంగా ఉండటమే ఈ వృద్ధికి ప్రధాన కారణమని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ ‘అనరాక్‌’ తన తాజా నివేదికలో వెల్లడించింది. విలువ పరంగా చూస్తే, ఈ ఏడు నగరాల్లో మొత్తం ఇళ్ల విక్రయాల విలువ గతేడాది రూ.1.52 లక్షల కోట్ల నుంచి 2 శాతం పెరిగి రూ.1.55 లక్షల కోట్లకు చేరింది.

హైదరాబాద్‌లోనే అత్యధిక వృద్ధి 
దేశంలోని ప్రధాన నగరాలన్నింటితో పోలిస్తే క్యూ3 త్రైమాసికంలో హైదరాబాద్‌ మార్కెట్‌ అత్యధికం వృద్ధి రేటును కనబరిచింది. గతేడాది జూలై–సెప్టెంబర్‌ కాలంలో 11,305 యూనిట్లుగా ఉన్న ఇళ్ల విక్రయాలు, ఈసారి ఏకంగా 15 శాతం పెరిగి 12,970 యూనిట్లకు చేరాయి. ఐటీ, మౌలిక వసతుల విస్తరణతో పాటు ఐటీ నిపుణులు, ప్రీమియం కొనుగోలుదారులు చూపిన ఆసక్తి హైదరాబాద్‌ను వృద్ధిలో ముందంజలో నిలిపింది. ఇదే సమయంలో బెంగళూరులో అమ్మకాలు 12 శాతం వృద్ధితో 14,835 యూనిట్ల నుంచి 16,670 యూనిట్లకు పెరగ్గా, దేశంలోనే అతిపెద్ద మార్కెట్‌ ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌) లో విక్రయాలు 5 శాతం పెరిగి 30,260 నుంచి 31,750 యూనిట్లకు చేరాయి. దేశవ్యాప్తంగా టాప్‌–7 నగరాల్లో జరిగిన మొత్తం ఇళ్ల విక్రయాల్లో కేవలం ముంబై, బెంగళూరు నగరాలే ఏకంగా 48 శాతం సింహభాగాన్ని ఆక్రమించాయని అనరాక్‌ ఛైర్మన్‌ అనూజ్‌ పూరి ప్రత్యేకంగా వెల్లడించారు.  

నాలుగు నగరాల్లో క్షీణత 
హైదరాబాద్, బెంగళూరు, ముంబైలలో అమ్మకాలు పుంజుకోగా.. ఢిల్లీ–ఎన్‌సీఆర్, పుణే, చెన్నై, కోల్‌కతాలలో ఇళ్ల విక్రయాలు మందగించాయి. ఢిల్లీ–ఎన్‌సీఆర్, పుణే, చెన్నై, కోల్‌కతా వంటి ఇతర ప్రధాన నగరాల్లో మాత్రం విక్రయాలు మందగించడం గమనార్హం. గత ఏడాది జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో 16,620 యూనిట్లుగా ఉన్న పూణే ఇళ్ల విక్రయాలు ఈసారి 6 శాతం క్షీణించి 15,690 యూనిట్లకు పడిపోగా, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ పరిధిలో అమ్మకాలు 1 శాతం స్వల్పంగా తగ్గి 13,920 నుంచి 13,765 యూనిట్లకు నమోదయ్యాయి. ఇక చెన్నై మార్కెట్‌ ఏకంగా 10 శాతం పతనాన్ని చవిచూసి విక్రయాలు 6,010 యూనిట్ల నుంచి 5,395 యూనిట్లకు పరిమితమవ్వగా, తూర్పు ప్రాంతంలోని కోల్‌కతాలోనూ అమ్మకాలు 4 శాతం మేర క్షీణించి 4,130 నుంచి 3,980 యూనిట్లకు పడిపోయాయి.  

డిమాండ్‌కు అనుగుణంగా రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను మార్కెట్లోకి తీసుకురావడం పెంచారు. ఈ ఏడు నగరాల్లో జూలై–సెపె్టంబర్‌ త్రైమాసికంలో కొత్తగా 1,14,320 యూనిట్లు మార్కెట్లోకి రాగా, గతేడాది (96,690)తో పోలిస్తే ఇది 18 శాతం పెరిగింది. రాబోయే పండుగ సీజన్‌ ఆధారంగా నివాస గృహాలకు డిమాండ్‌ మరింత పుంజుకుంటుందని అనూజ్‌ పూరి ఆశాభావం వ్యక్తం చేశారు.

మారిన కొనుగోలుదారుల ప్రాధాన్యతలు  
సొంత గృహాలు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరగడమే ఇళ్ల విక్రయాల వృద్ధి కారణము. అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక రాబడి, భద్రత కోసం రియల్‌ ఎస్టేట్‌లోనే పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఇళ్ల కొనుగోలుదారులు కేవలం చదరపు అడుగుల విస్తీర్ణాన్ని మాత్రమే కాకుండా నిర్మాణ నాణ్యత, లొకేషన్, ఆధునిక వసతులు, బిల్డర్‌ నమ్మకత్వానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. మార్కెట్‌ మరింత పరిణతి చెంది ‘డిమాండ్‌–ఆధారిత’ దశలోకి అడుగుపెట్టిందని సంజీవిని గ్రూప్‌ చైర్మన్‌ ఉమేష్‌ గౌడ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement