హైదరాబాద్ : నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ కమిషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీలో ఉచ్వాస్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో ‘జస్ ఆంకో’ పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ కేర్ సెంటర్‌ను గురువారం ఆయన సంస్థ వ్యవస్థాపకురాలు డైరెక్టర్ డాక్టర్ విజయలక్ష్మి బాలకృష్ణన్‌తో కలిసి హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సకు ప్రభుత్వం నుంచి పలు సేవలు అందిస్తున్నప్పటికీ ప్రైవేట్ సంస్థలు కూడా రోగులకు అందుబాటు ధరల్లో వైద్యాన్ని అందించాలని, ఇలాంటి కేంద్రాలు మరిన్ని రావాలని సూచించారు. జస్ ఆంకో ఫౌండర్ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ తమిళనాడు కేంద్రంగా కొనసాగుతున్న తమ సంస్థ కార్యకలాపాలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నామని అందులో భాగంగానే తొలి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని రోజుల తరబడి ఆస్పత్రుల్లో ఇన్‌పేషంట్‌గా ఉండాల్సిన అవసరం లేకుండానే ఎన్నో రకాల క్యాన్సర్ వ్యాధులకు డే కేర్ ప్రొసీజర్‌లో వైద్యం అందించనున్నట్లు ఆమె వెల్లడించారు.
రోగులపై ఆర్ధిక భారం తగ్గించే విధంగా తాము వైద్య చికిత్సా విధానలను అవలంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ డేకేర్ సెంటర్‌లో కీమోథెరపి, ఇమ్యునో థెరపి, టార్గెటెడ్ థెరపి వంటి వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉచ్వాస్ రిహాబిలిటేషన్ సెంటర్స్ చైర్మన్ డాక్టర్ అంబటి రాంపాపారావు, ఎంఎన్‌జే ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ రీజినల్ సెంటర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ముక్త శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


