తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనంతట తాను కొన్ని అనవసర అంశాలను ప్రస్తావిస్తున్నారా? లేక సలహాదారులు , పీఆర్ టీమ్ రాసి ఇస్తున్న వాటిని పాలో అవుతున్నారో తెలియదు. కాని ఆయన చేస్తున్న ప్రసంగాలు కొన్నిసార్లు వివాదాస్పదం అవుతున్నాయి. కొన్ని వ్యాఖ్యలు హేతుబద్దంగా కనిపించడం లేదు. ఇటీవల ఢిల్లీలో అస్సాం చెందిన ఒక మీడియా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఒటర్ల జాబితా ప్రత్యేక సవరణను బ్రిటిష్ హయాం నాటి సైమన్ కమిషన్‌తో పోల్చారు.
ఉత్తరాది, దక్షిణాది అంటూ తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ శ్రీరాముడు ఉత్తరాది దేవుడు, ఉన్నవారి దేవుడు, శివుడు దక్షిణాది దేవుడు అంటూ చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇలాంటి విషయాలు మాట్లాడడానికి ముందు ఆయన పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తే బాగుంటుంది. అలాకాకపోతే ఆయన విమర్శలకు గురి అవుతారు. ఎన్నికల సంఘం దేశంలో ఎన్నికలను నిర్వహిస్తున్న తీరుపై , ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ అంశంలో అనుసరిస్తున్న విధానాలపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఈసీలో జరిగిన పరిణామాలపై ఇచ్చిన సంచలన కధనంతో ఆ సంస్థ ఆత్మరక్షణలో పడింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు ఆందోళనలు సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నిరసనలలో పాల్టొంటోంది. హైదరాబాద్ లో పీసీసీ అద్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితరులు నిరసనలు నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణపై గత కొన్ని నెలలుగా రేవంత్ కాని, కాంగ్రెస్ నేతలు కాని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా రాష్ట్రాలలో దీని పరిస్థితిపై లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈసీ పనితీరును ఉతికి ఆరేస్తున్నారు. దానికి ప్రతిగా బీజేపీ జవాబు ఇస్తోంది. ఇదంతా వేరే కధ. తాజాగా ఢిల్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు బహుశా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించడానికి చేశారా అన్న సందేహం కలుగుతుంది.
ఆనాటి భారత ప్రభుత్వ చట్టాన్ని సమీక్షించడానికి, రాజ్యాంగ సంస్కరణలు చేపట్టడానికి సైమన్ కమిషన్ ఏర్పడింది. ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ పై ఆందోళనకు పిలుపు ఇచ్చింది. సైమన్ కమిషన్ లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించలేదన్నది ఈ నిరసనకు ప్రధాన కారణం. దీనిని ప్రస్తుత భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్‌కు పోలిక ఏమిటో తెలియదు. ఓటర్ల జాబితా సవరణ లో వివక్ష జరుగుతోందని, విపక్షం అదికారంలో ఉన్న రాష్ట్రాలలో లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతు అవుతున్న వైనంపై పలు అభియోగాలు వచ్చాయి.
అసలు చట్టం లేకుండానే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టడం, ఓటర్ నమోదుకు అవసరమయ్యే ఫామ్ 6 లో పలు మార్పులు పార్లమెంటుతో సంబంధం లేకుండా చేయడం, ఓట్ల తొలగింపు ప్రక్రియను డిల్లీ లో కేంద్రీకృత విధానంలో చేయడం వంటివాటిపై అనుమానాలు వచ్చాయి. ఈ విషయాలను వివరించడం తప్పు కాదు.కాని తెలిసి,తెలియని రీతిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రసంగం చేస్తే అది ఆయనకు అంత ప్రతిష్టనివ్వదు. 13 కోట్ల ఓట్లను తొలగించిన వైనం, జనాభా పెరుగుతుంటే, ఓట్లు ఎలా తగ్గుతున్నాయని ప్రశ్నించడం వంటివి సమంజసమే. తమాషా అంశం ఏమిటంటే దేవుళ్లకు కూడా ఉత్తరాది, దక్షిణాది అని పేర్లు పెట్టడం. బహుశా దేశంలో ఏ రాజకీయ నేత ఇలాంటి విశ్లేషణ గతంలో చేసి ఉండరు.
పైగా శివుడు పేదల దేవుడని, రాముడు సంపన్నుల దేవుడని ఆయన వర్గీకరించారు. దీనిపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్,బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు తదితరులు దేవుళ్లను కూడా చీల్చుతారా? అని విమర్శిస్తూ కాంగ్రెస్ ది ఎప్పుడూ విభజించే విధానమే అని ధ్వజమెత్తారు.ఆ రకంగా బీజేపీకి ఈయన అవకాశం ఇచ్చినట్లయింది కదా! రేవంత్ చేసిన ఈ వాదనలో హేతుబద్దత కూడా కనిపించదు. నిజానికి ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా లేకుండా భక్తులు శ్రీరాముడు, శివుడులను కొలుస్తారు. శ్రీరామ నవమి వస్తే శ్రీరాముడిని, శివరాత్రి వస్తే శివుడికి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ట్రాలలో రాముడి గుడి లేని గ్రామం ఉండదంటే ఆశ్యర్యం కాదు. అదే విధంగా శ్రీశైలంతో సహా పలు చోట్ల శివాలయాలు ఉంటాయి.
భద్రాద్రిలో అదికారికంగా శ్రీరామనవమి చేస్తారు. ఎపీలో ఒంటిమింట, రామతీర్ధంలలో ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంది. ఉత్తరాదిలో శివాలయాలు పెద్ద ఎత్తునే కనిపిస్తాయి. ఉదాహరణకు వారణాసిలో ఉన్నది శివలింగమే కదా! కేదార్ నాద్, బదరీనాద్, అమరనాద్ వంటి ప్రముఖ క్షేత్రాలలో శివార్చనలు జరుగుతుంటాయి. అంతేకాదు.. లక్షల సంఖ్యలో ఉండే దేవుళ్లను ఆయా ప్రాంతాలలో ఆచారాలను బట్టి పూజిస్తారు. దీనికి ప్రాంతీయత ఆపాదించడం ఏమిటో! అయోధ్యలో రాముడికి బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో బ్రహ్మండమైన రీతిలో గుడి కట్టించిన నేపధ్యంలో ఆయన సంపన్నుల దేవుడని అన్నారో, లేక బీజేపీ సంపన్నుల పార్టీ అని చెప్పడానికి ఈ ఉపమానం వాడారో తెలియదు కాని అంత అర్దవంతంగా కనిపించదు.
ఇదీ చదవండి: గతాన్ని మరిచిన బాబు.. ఈసీపై డబుల్ టాక్!?
సాధారణంగా ఒక మాట చెబుతారు. విష్ణువు ధనికుడుగాను, శివుడు తిరిపమెత్తే దేవుడుగాను ప్రాచుర్యంలో ఉంటారు. బహుశా దానిని దృష్టిలో ఉంచుకుని రేవంత్ అన్నారేమో కాని, దానిని సరిగా చెప్పలేకపోయారనిపిస్తుంది. ధనిక, పేద తేడా లేకుండా హిందూ భక్తులు అంతా ఈ దేవుళ్లను పూజిస్తుంటారు. బీజేపీ వారు హరహర మహాదేవ అనరని రేవంత్ వ్యాఖ్యానించగానే, ప్రధాని మోడీ శివరాత్రినాడు అవే పదాలు వాడుతూ ప్రార్దనలుచేసిన వీడియోలు వచ్చేశాయి. అంటే సి.ఎమ్. స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియచేస్తుంది.
తన గురువు చంద్రబాబు మాదిరే ఏది పడితే అది మాట్లాడితే రేవంత్ కే నష్టం అని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తుంటాయి. ప్రధాని మోడీ తెలంగాణతో పాటు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూడా అన్యాయం చేస్తున్నారని, అంతా గుజరాత్ కే చేసుకుంటున్నారని రేవంత్ ఆరోపించడం విచిత్రమే. బీజేపీ పాలిత రాష్ట్రాల తరపున ఈయన వకల్తా తీసుకోవడం ఏమిటో తెలియదు. అందుకు ఏమైనా ఉదహరణలు ఇచ్చారా అంటే అదీ కనబడదు. తాను కాంగ్రెస్ లోకి ఎందుకు రావల్సి వచ్చింది తదితర విశేషాలు చెప్పారు. వాటిలో అభ్యంతరాలు ఏమి లేవు. సహజంగానే బీఆర్ఎస్ పైన, కేసీఆర్‌పైన విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే ఆంధ్రవాళ్ల పెత్తనంపై పోరాడి తెలంగాణ సాధించుకున్నామని రేవంత్ చెబుతున్నారు.
మరి ఇప్పటికీ ఆయన ఆంధ్రా నాయకుడైన చంద్రబాబు నాయుడుకే శిష్యుడుగా ఉంటున్నారన్న విమర్శ ఎందుకు వస్తోంది? టీడీపీ ఎంపీ ఒకరు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డా, అలాగే మరో ఎంపీ కుమారుడు చేసిన కారు ప్రమాదంలో ఒక మహిళ మరణించినా అరెస్టు చేయకపోవడం, ఏపీకి చెందిన కొందరు నేతలపై భూ కబ్జా ఆరోపణలు వచ్చినా చట్టాన్ని అమలు చేయకుండా, చూసిచూడనట్లు పోవడం వంటివాటిని గమనిస్తే ఇంకా వారి పెత్తనానికి రేవంత్ ప్రభుత్వం తలొగ్గి పనిచేస్తున్నదన్న భావన కలగదా! ఏది ఏమైనా రేవంత్ జాతీయ స్థాయిలో ప్రొజెక్టు కావాలన్న ఆలోచనలో తప్పు లేదు. కాని ఆ క్రమంలో చేసే ప్రసంగాలు, వ్యాఖ్యల పట్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది కదా!.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


