హైదరాబాద్: మున్సిపాలిటీలోని అవినీతి చేపలు ఏసీబీ వలకు చిక్కాయి. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయవద్దంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసి, రూ.75 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్‌లో ఇల్లు నిర్మించుకుంటున్న ఓ వ్యక్తి వద్ద టౌన్ ప్లానింగ్ అధికారి వాణి, సీనియర్ అసిస్టెంట్ సుదర్శన్ డబ్బులు డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణం చేపడుతున్నారని.. కూల్చివేయవద్దంటే రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అంత ఇవ్వలేనని బాధితుడు చెప్పడంతో రూ.75 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిపై బాధితుడు మూడు రోజుల క్రితం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం సాయంత్రం అజీజ్‌నగర్‌లోని మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సుదర్శన్‌కు రూ.75 వేలు ఇస్తుండగా, అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఆ తర్వాత టౌన్‌ప్లానింగ్ అధికారి వాణిని అరెస్టు చేశారు. ఇదే సమయంలో అత్తాపూర్‌లోని ఆమె ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. ఇద్దరు నిందితులను గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
ఐదు చోట్ల ఒక్కరే..
మొయినాబాద్‌లో ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారి వాణి ఐదు మున్సిపాలిటీలకు ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. వికారాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి పోస్టులో ఉంటూ మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లితో పాటు నార్సింగి సర్కిల్‌లో ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈమె పనితీరు మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉందని తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన మొయినాబాద్ మున్సిపాలిటీలోనూ పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.


