సాక్షి,హైదరాబాద్: దాదాపు 35 ఏళ్లుగా పోలీసు కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న రౌడీషీటర్ ఇల్యాస్ బిన్ హుస్సేన్ యాఫైని చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు ఇన్‌చార్జి అదనపు డీసీపీ కేఎస్ రావు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బార్కస్ సలాలాలకు చెందిన హుస్సేన్ యాఫై వృత్తిరీత్యా వాల్ పెయింటర్. 1991లో చంద్రాయణగుట్ట పరిధిలో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతనిపై రౌడీషీట్ తెరిచారు.
ఈ విషయం తెలిసిన హుస్సేన్ యాఫై పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఉపాధి కోసమంటూ విదేశాలకు వెళ్లి కొన్నాళ్లు తలదాచుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత కూడా వివిధ రాష్ట్రాల్లో పెయింటింగ్ పనులు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇతడి కదలికలపై సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ ఎస్.సైదాబాబు నేతృత్వంలో ఎస్‌ఐలు కె.రామారావు, ఎం.మహేష్, ఎం.మధులతో కూడిన బృందం వలపన్ని బుధవారం పట్టుకుంది. తదుపరి చర్యల నిమిత్తం చంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించింది.


