దశాబ్ద కాలంలో 30–35 శాతానికి పడిపోయిన వీటి సంఖ్య
దసరా రోజు పాలపిట్టను చూడటం శుభం.. దాన్ని బోనులో బంధించి చూడటం చట్టరీత్యా నేరం
ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లో లీస్ట్ కన్సర్న్ విభాగం నుంచి నియర్ త్రెటెన్డ్ విభాగానికి మార్పు
ప్రభుత్వం పరిరక్షణ చర్యలు చేపట్టాలి: హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ అధ్యక్షుడు హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీక, రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట (ఇండియన్ రోలర్) రాష్ట్రంలో క్రమంగా మాయమవుతోంది. గత దశాబ్ద కాలంలో వీటి జనాభా 30 నుంచి 35 శాతం వరకు పడిపోయింది. దస రా పండుగ రోజు పాలపిట్టను చూడటం శుభమే, కానీ దాన్ని బోనులో బంధించి చూడటం పాపం, చట్టరీత్యా నేరం. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం పాలపిట్టలను పట్టుకోవడం శిక్షార్హం. ఒకప్పుడు దసరా వచ్చిందంటే చాలు పల్లెల్లో, పట్టణాల్లో పొలాల గట్ల వెంబడో, విద్యుత్ తీగలపైనో నీలిరంగు రెక్కల పాలపిట్టలు విరివిగా కనిపించేవి. కానీ ఈ ఏడాది దసరా సీజన్ నాటికి క్షేత్రస్థాయి పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.
అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (ఐయూసీఎన్) పాలపిట్టను మునుపటి ‘కనిష్ట ఆందోళన’(లీస్ట్ కన్సర్న్) విభాగం నుంచి ‘సమీప ముప్పు’(నియర్ త్రెటెన్డ్) విభాగానికి మార్చింది.హైదరాబాద్ బర్డ్ అట్లాస్ సర్వే ప్రకారం నగర శివార్లలో, రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పక్షుల గుర్తింపు సర్వేల్లో పాలపిట్టల లభ్యత అత్యంత అరుదుగా మారింది. 70 వేలకు పైగా పక్షులను సర్వే చేయగా కేవలం వేళ్ల మీద లెక్కించదగిన సంఖ్యలోనే పాలపిట్టల ఉనికి బయటపడింది. వేటగాళ్లు దసరా సమయంలో ఈ పక్షులను బంధించి గుడుల వద్ద ప్రదర్శనకు ఉంచడాన్ని అరికట్టేందుకు తెలంగాణ అటవీ శాఖ ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి 2026 దసరా వేళ ముమ్మర తనిఖీలు, కఠిన చర్యలు చేపట్టింది. గతేడాది దసరా సమయంలో 28 పాలపిట్టలను రక్షించి అడవుల్లోకి వదిలారు.
సంఖ్య క్రమంగా తగ్గడానికి ప్రధాన కారణాలు
» పాలపిట్టలు అంతరించిపోవడానికి మానవ తప్పిదాలు, పర్యావరణ మార్పులే ప్రధాన కారణాలని పక్షి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
» విచక్షణారహితంగా పురుగుల మందుల వాడకం: పాలపిట్టలు ప్రాథమికంగా కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. వ్యవసాయంలో కెమికల్స్, పెస్టిసైడ్స్ విపరీతంగా వాడటం వల్ల ఇవి తినే కీటకాలు నశించిపోతున్నాయి. విషపూరితమైన ఆహారం వల్ల పాలపిట్టల సంతానోత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుతోంది
» ఆవాసాల విధ్వంసం (హాబిటాట్ లాస్): పట్టణీకరణ వేగంగా పెరగడం వల్ల చెట్లు, మైదానాలు మాయమవుతున్నాయి. పాలపిట్టలు సాధారణంగా తాటిచెట్లు లేదా పాత వృక్షాల తొర్రల్లో గూళ్లు పెట్టుకుంటాయి. తాటిచెట్ల నరికివేత వల్ల వీటికి నివాసాలు కరువయ్యాయి
» దసరా వేళ అక్రమ వేట: దసరా పండుగ సందర్భంగా ప్రజల మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని వేటగాళ్లు వీ టిని జిగురు పెట్టి పట్టుకుంటారు. చిన్న బోనుల్లో బంధించడం వల్ల, వాటి రెక్కలు కత్తిరించడం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురై, ఆహారం తీసుకోలేక సగానికి పైగా పక్షులు చనిపోతున్నాయి.
» చైనా మాంజా ముప్పు: పతంగుల సీజన్‌లో వాడే పదునైన చైనా మాంజా దారాలు తగిలి ఎన్నో పాలపిట్టలు ప్రాణాలు కోల్పోతున్నాయి
» దసరా సందర్భంగా పాలపిట్టకున్న ప్రాధాన్యం: తెలంగాణ సంస్కృతిలో పాలపిట్టకు విజయదశమికి విడదీయరాని బంధం ఉంది
» పురాణ నేపథ్యం: మహాభారత చరిత్ర ప్రకారం, పాండవులు అజ్ఞాతవాసం ముగించుకుని, జమ్మిచెట్టుపై దాచిన తమ ఆయుధాలను తిరిగి తీసుకునే సమయంలో పాలపిట్ట రూపంలోనే దేవుడు దర్శనమిచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే శ్రీరాముడు రావణ వధకు తరలివెళ్లే ముందు పాలపిట్టను చూసి విజయం సాధించాడని నమ్ముతారు.
» శుభ సూచకం: దసరా రోజు సాయంత్రం జమ్మి పూజ ముగించుకుని ఊరి పొలిమేరల్లో పాలపిట్టను దర్శించుకుంటే కష్టాలన్నీ తీరి, అంతా శుభం జరుగుతుందని, ఏటా విజయాలు సిద్ధిస్తాయని తెలంగాణ ప్రజల బలిష్టమైన నమ్మకం
» రైతు నేస్తం: కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా, పాలపిట్ట పంటలను నాశనం చేసే పురుగులు, కీటకాలను తింటూ రైతుకు మేలు చేస్తుంది. అందుకే దీన్ని వ్యవసాయ శ్రేయస్సుకు, సమృద్ధికి చిహ్నంగా భావిస్తారు
రాష్ట్రప్రభుత్వం, సమాజం, వ్యక్తుల పరంగా వాటి పరిరక్షణకు వెంటనే కచ్చితమైన చర్యలు చేపట్టాలి. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అన్నివర్గాల ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంపొందించాలి. ఈ పక్షులు గతంలో యాప్రాల్ చెరువు, అమీన్‌పూర్ లేక్, కిష్టారెడ్డిపేట, కొడకంచి, అనంతగిరి ఇలా ప్రతీచోటా విరివిగా కనిపించేవి. ఇప్పుడు పాలపిట్ట కనబడితేనే దసరా అన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి. వాటి ఫ్రీక్వెన్సీ 60, 70 శాతం పడిపోయింది.
హైదరాబాద్ చుట్టుపక్కల పొలాలు లేక, చెట్లు లేక టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా చెట్లు పెట్టలేకపోవడంతో పాలపిట్టలే కాకుండా పక్షులే గూడుపెట్టుకోలేక పోతున్నాయి. జీవవైవిధ్యం మెరుగుపరిచే చర్యలేవీ చేపట్టడం లేదు. రోజురోజుకూ కాలుష్యం పెరుగుతోంది. చెరువులు కలుషితమవుతున్నాయి. ఒక్క పాలపిట్టనే కాకుండా అన్ని పక్షుల సంరక్షణకు వెంటనే అత్యవసర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. – హరికృష్ణ ఆడెపు, అధ్యక్షుడు, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్


