యూఎల్‌సీ భూముల్లోని నిర్మాణాలపై స్పష్టత లేదంటూ దాటవేత
ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయని సబ్ రిజిస్ట్రార్లు
ఆందోళనలో లక్షలాది మంది బాధితులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్‌సీ) భూముల్లోని ప్లాట్లు, ఫాట్లు, ఇళ్ల నిర్మాణాలను రిజిస్టర్ చేయడానికి రిజిష్ట్రేషన్ శాఖ అధికారులు ససేమిరా అంటున్నారు. తమకు వీటికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు లేవంటూ దాటవేస్తున్నారు. వాస్తవానికి నిషేధిత జాబితా (22ఏ) ఉన్నా హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, జీహెచ్‌ఎంసీలు అనుమతులున్న లే అవుట్‌లు లేదా నిర్మాణాల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తద్వారా లక్షలాది మందికి ఉపశమనం కలుగుతుందని స్పష్టం చేసింది. కానీ యూఎల్‌సీ భూముల విషయంలో స్పష్టత ఇవ్వలేదంటూ సబ్ రిజిస్ట్రార్‌లు రిజిష్ట్రేషన్లు చేయడానికి నిరాకరిస్తున్నారు.
యూఎల్‌సీ భూముల క్రమద్ధీకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఉన్నాయి తప్ప...రిజిష్ట్రేషన్ చేయాలంటూ తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వారు చెబుతున్నారు. 2016కు ముందు యూఎల్‌సీ భూమల క్రమబద్దీకరణ చేసుకున్న దరఖాస్తులు మాత్రమే పరిశీలించాలంటూ కలెక్టర్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అంటున్నారు. అయితే ఈ పది సంవత్సరాల కాలంలో యూఎల్‌సీ భూముల్లో వేలాది కాలనీలు, నిర్మాణాలు వెలిశాయి.
ఆయా కాలనీల్లోని భవనాలు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ల గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం దాటవేత ధోరణి ప్రదర్శించడం లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. యూఎల్‌సీ భూముల్లో పురపాలక సంస్థలు అనుమతులు ఇచ్చినా.. ఆ భూములకు లింక్ డాక్యుమెంట్లు ఉన్నా అలాంటి వాటికి సంబంధించి ప్రజలకు మాత్రం ఎలాంటి ఉపశమనం లేదని వారు తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు. 2016 సంవత్సరంలోనే యూఎల్‌సీ భూములను క్రమబద్ధం చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో.. దాదాపు 14 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
కానీ వాటిపై పదేళ్లపాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కాలాయాపన చేశారు. ఆ తర్వాత కూడా వందలాది కాలనీలు వెలిశాయని, అందుకు సంబంధించి రిజిష్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నా.. ఇప్పుడు యూఎల్‌సీ భూములంటూ వాటికి రిజిస్ట్రేషన్‌లు చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసరానికి విక్రయించుకోవాలన్నా కూడా రిజిష్ట్రేషన్ వెసులుబాటు లేకుండా పోయిందని వాపోతున్నారు.
మంత్రి ఆదేశాలు బేఖాతర్
హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, జీహెచ్‌ఎంసీలు అనుమతి ఇచ్చిన లే అవుట్లలోని ప్లాట్లు, ఇళ్లను రిజిష్ట్రేషన్ చేయాలని సెప్టెంబర్ 24న ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సరూర్‌నగర్ మండలం రోషన్‌దౌలాకు చెందిన ఓ బాధితుడు తన ఆస్తిని రిజిష్ట్రేషన్ చేయాలని ఇటీవల ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని ఆశ్రయించగా, ఇందుకు ఆమె నిరాకరించారు. ‘మీ ఆస్తి ఇప్పటికీ నిషేధిత జాబితాలోనే ఉంది.
కలెక్టర్ నుంచి ఎన్‌ఓసీ తెచ్చుకోవాలి’అని చెప్పి డాక్యుమెంట్ రిజిష్ట్రేషన్ ప్రక్రియను దాటవేశారు. దీంతో సదరు బాధితుడు ఆ శాఖ ఐజీకి ఫిర్యాదు చేశారు. యూఎల్‌సీ భూముల రిజిస్ట్రేషన్లు ఆపొద్దంటూ 2026 జూన్ 6న హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను బాధితుడు సదరు ఎస్‌ఆర్‌ఓకు చూపించినా అంగీకరించకపోవడం గమనార్హం. మంత్రి సహా ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలు ఉన్నా..అధికారుల వైఖరిలో మార్పులేకుండా పోయిందనే విమర్శలు విన్పిస్తున్నాయి.
పెద్ద అంబర్‌పేటలో డబుల్ రిజిష్ట్రేషన్
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద అంబర్‌పేట్ పరిధిలోని తట్టి అన్నారంలో ఒకే ప్లాట్‌కు డబుల్ రిజిస్ట్రేషన్ కలకలం రేపింది. కోర్టు కేసు ఉన్న ఖాళీ స్థలానికి సదరు సబ్ రిజిస్ట్రార్ మళ్లీ రిజిష్ట్రేషన్ చేయడం వివాదాస్పదమైంది. మూడు రోజుల క్రితం బాధితులు ఏకంగా పెద్ద అంబర్‌పేట సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు. ఆరు నెలల క్రితమే కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల కాపీని సబ్ రిజిస్ట్రార్‌కు అందజేసినప్పటికీ..ఆయన ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు.


