మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే.. | KTR at India Today South Conclave | Sakshi
Sakshi News home page

మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే..

Oct 1 2026 4:17 AM | Updated on Oct 1 2026 4:18 AM

KTR at India Today South Conclave

తెలంగాణలో రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే

బీజేపీతో పొత్తు ఉండదు.. 

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు.. 

ఇండియా టుడే సౌత్‌ కాంక్లేవ్‌లో కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధీమా వ్యక్తంచేశారు. బీజేపీతో బీఆర్‌ఎస్‌కు ఎలాంటి పొత్తు ఉండదన్నారు. గత 26 ఏళ్లలో ఒక్కసారి కూడా బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకోలేదని, 2014, 2018, 2023 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసిందని గుర్తుచేశారు. భావజాలపరంగా, సైద్ధాంతికంగా బీఆర్‌ఎస్‌ బీజేపీకి వ్యతిరేకమని, అలాంటప్పుడు ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటామని ప్రశ్నించారు. కేరళంలోని కొచ్చిలో బుధవారం జరిగిన ఇండియా టుడే సౌత్‌ కాంక్లేవ్‌లో ‘తెలంగాణ తదుపరి దశాబ్దం’అనే అంశంపై కేటీఆర్‌ మాట్లాడారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్‌ విధానంపై కేటీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

జనాభా ఆధారంగా డీలిమిటేషన్‌ చేపడితే జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా గతంలో సుమారు 24 శాతం ఉండగా 19 శాతానికి తగ్గిందని తెలిపారు. పార్లమెంట్‌ సీట్లు పెంచాలనుకుంటే అసెంబ్లీ స్థానాలను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. దామాషా ప్రకారం సీట్లు పెంచితేనే మద్దతు ఇస్తామని చెప్పారు. అస్సాం, జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాలు పెంచినప్పుడు ఏపీ, తెలంగాణలో ఎందుకు పెంచలేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ ప్రభావం తక్కువగా ఉండటమే దీనికి కారణమన్న అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హామీలపై తమకు నమ్మకం లేదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్‌పై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’విమర్శలు 
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని కేటీఆర్‌ అన్నారు. 2023 ఎన్నికల్లో 420కి పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వ చ్చిన కాంగ్రెస్‌ వాటిలో ఒక్కదానినీ పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ఆర్‌ (రికాల్, రిగ్రెట్, రివోల్ట్‌) పరిస్థితి కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసినందుకు ప్రజలు పునరాలోచిస్తున్నారని, ఆ అసంతృప్తి తిరుగుబాటు దిశగా మారుతోందని చెప్పారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కంటే ఢిల్లీ నాయకత్వానికి విధేయత ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి చేసిన రాముడు– శివుడు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. బీజేపీ మతం పేరుతో దేశాన్ని విభజించాలనుకుంటే, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి దేవుళ్ల ప్రాతిపదికన విభజించేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.  

ఈసీ, ఎస్‌ఐఆర్‌పై అభ్యంతరాలు 
ఎన్నికల సంఘం విశ్వసనీయతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయని కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల సంఘంలో జరుగుతున్న పరిణామాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై ఆరోపణలు వ చ్చిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకోవాల్సిందని వ్యాఖ్యానించారు. ఎస్‌ఐఆర్‌పై మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేయడం అవసరమేనని, అయితే మొత్తం ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్నారు.

బీఆర్‌ఎస్‌ గెలిచిన 39 నియోజకవర్గాల్లోనే అత్యధిక ఓట్లు తొలగించారని ఆరోపించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై యువత, ముఖ్యంగా జెన్‌జీ తీవ్ర ఆగ్రహంతో ఉందని చెప్పారు. యువత ఉద్యోగాలు, ఉపాధి గురించి ప్రశ్నిస్తుంటే కేంద్ర ప్రభుత్వం దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ‘ఇంకెంతకాలం మతం పేరుతో దేశాన్ని విభజిస్తారు?’అని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు, భవిష్యత్తు, అవకాశాలపై సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement