సైబర్ నేరాలు ఇక కేవలం సాంకేతిక పరిజ్ఞానాల మధ్య పోరాటం కాదని, అవి మానవ నమ్మకం, ఆలోచనా సరళి, మన ప్రవర్తనను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడిగా మారాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ పోలీసు శాఖల భాగస్వామ్యంతో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మానవ నమ్మకాలు ఎలా ప్రభావితం చేస్తాయనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి, టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తెలంగాణలో నమోదవుతున్న సైబర్ నేరాల ఆర్థిక నష్టాల్లో దాదాపు 60 శాతం నష్టాలు స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ వల్లే జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. బాధితుల ప్రవర్తనను అధ్యయనం చేస్తూ వారిలో నమ్మకం కలిగించి డబ్బులు బదిలీ చేసేలా వియత్నాం, మయన్మార్, కాంబోడియా వంటి విదేశాల నుంచి ఈ సైబర్ ముఠాలు కాల్ సెంటర్ల ద్వారా నెట్‌వర్క్ నడుపుతున్నాయని స్పష్టం చేశారు. అయితే, అప్రమత్తతే అతిపెద్ద రక్షణ అని, గత రెండేళ్లలో తెలంగాణ పోలీసు శాఖ రూ.455 కోట్ల బాధితుల సొమ్మును రికవరీ చేయగలిగిందని తెలిపారు. ‘ఏమీ తెలియదనే అమాయకత్వం మిమ్మల్ని కాపాడదు. ఆలోచించి, అన్ని అంశాలు సరిచూసుకున్నాకే ముందడుగు వేయాలి’ అని సూచించారు.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, సైబర్ లా నిపుణులు పవన్ దుగ్గల్ మాట్లాడుతూ.. కృత్రిమ మేధపై అతిగా ఆధారపడటం మానవ మేధస్సును క్షీణింపజేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ చిన్న విషయానికి ఏఐని సంప్రదించి మానవ ఆలోచనా శక్తిని తగ్గించుకోకూడదని హెచ్చరించారు. ఏఐ డీప్‌ఫేక్‌ల నిరోధానికి దేశంలో తక్షణమే ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ‘కోర్టుల్లో ఏఐ వినియోగంపై డ్రాఫ్ట్ నిబంధనలు - 2026’ రూపొందించిందని గుర్తుచేశారు.
డీఎస్‌సీఐ అడ్వైజర్ ఎయిర్ వైస్ మార్షల్ దేవేష్ వత్స మాట్లాడుతూ.. రామాయణంలోని లక్ష్మణ రేఖయే ప్రపంచంలో మొదటి ఫైర్‌వాల్ అని వ్యాఖ్యానించారు. సైబర్ నిపుణులు జితేన్ జైన్ మాట్లాడుతూ.. ఫోన్ నంబర్లను షాపింగ్ మాల్స్‌లో ఇవ్వొద్దని, ఇది సోషల్ ఇంజినీరింగ్ దాడులకు మార్గం సుగమం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన సైబర్ అవగాహన వీడియోలు, పోస్టర్లను ఆవిష్కరించారు. 2.95 లక్షల మంది పెన్షనర్లు, మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు వీటి ద్వారా అవగాహన కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం!


